ప్రత్యక్ష దైవానికి ప్రణమిల్లుదాం!

ఏ దేవతలను సాక్షాత్కారం చేసుకోవాలన్నా.. అనేక ఆధ్యాత్మిక సాధనలు ఆచరించాలి. కానీ అవేవీ అవసరం లేకుండానే నిరంతరం మన ఎదుట ప్రత్యక్షమయ్యే భగవానుడు సూర్య నారాయణమూర్తి. అందుకే దినకరుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు.

Updated : 15 Feb 2024 03:22 IST

ఫిబ్రవరి 16 రథసప్తమి

దేవతలను సాక్షాత్కారం చేసుకోవాలన్నా.. అనేక ఆధ్యాత్మిక సాధనలు ఆచరించాలి. కానీ అవేవీ అవసరం లేకుండానే నిరంతరం మన ఎదుట ప్రత్యక్షమయ్యే భగవానుడు సూర్య నారాయణమూర్తి. అందుకే దినకరుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్నాడు. ఆయనలోనే త్రిమూర్తులున్నారు. ఆ ఆదిత్యుడు విశ్వానికే ఆత్మ అన్నది వేదవాక్కు. సూర్యుణ్ని ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. రాజవంశాల్లో సూర్యవంశం మొదటిది. శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు. రాముడు నిత్యం సూర్యారాధన చేసేవాడని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలో స్పష్టం చేశాడు. యుద్ధభూమిలో అగస్త్య మహర్షి ఉపదేశించిన ‘ఆదిత్య హృదయం’ పఠించిన తర్వాతే శ్రీరాముడు రావణాసురుని సంహరించగలిగాడు. పాండవులు సూర్యుడి అనుగ్రహంతో అక్షయపాత్రను పొంది, అరణ్యవాస కాలంలో ఆహార సంక్షోభం లేకుండా అతిథి సత్కారాలు చేయగలిగారు. సూర్యుణ్ణి దేవతలే కాదు రాక్షసులూ ఆరాధించటం విశేషం. పరమోన్నతమైన గాయత్రీ మంత్రం కూడా సూర్యుడి తేజస్సుతో కూడుకున్నదే! ఆ సహస్రకిరణుడిని శ్రేష్ఠతముడిగా తెలుసుకోవటం.. మన బుద్ధిని, ఆలోచనల్ని సవ్యంగా నడిపించమని ప్రార్థించటం.. గాయత్రీ మంత్రం పఠించడంలోని ఉద్దేశం. అలాగే సూర్య మంత్రోపాసన, సూర్య స్తోత్ర పారాయణం ఎంతో శక్తిమంతాలు.

నమస్కార ప్రియుడు... నవగ్రహాల్లో ఏ గ్రహానికీ లేని నమస్కార సంప్రదాయం సూర్య గ్రహానికే ఉండటం విశేషం. సూర్యుడు నమస్కార ప్రియుడు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఆ ప్రత్యక్ష నారాయణుని ఆరాధించి, నమస్కరించాలి. దీని వెనుక పారమార్థిక ప్రయోజనమే కాదు భౌతిక శ్రేయస్సూ ఉంది. సూర్య కిరణాల్లోని దివ్యతేజస్సునూ, చైతన్యశక్తినీ మనం పొందాలని ఆ సంప్రదాయాన్ని నిర్దేశించారు. భానుడి చైతన్యశక్తి జగతికి ఐశ్వర్యాలను ప్రసాదిస్తోంది. అందుకే ఆ సౌరశక్తిని లక్ష్మిగా, పరాశక్తిగా, జగదంబగా ఆరాధిస్తూ ఉంటాం. లలితా సహస్ర నామాల్లో ‘భానుమండల మధ్యస్థా..’ అనేది ఒక నామం. ఆదిత్యహృదయం సూర్యుణ్ణి ‘సర్వదేవతాత్మకుడు’ అని స్తుతించింది. భూమిపై ప్రతి అణువూ సూర్యుడి నుంచే ప్రాణశక్తిని పొందుతోంది. ఆయన వర్ణకారకుడు. అంటే రంగులన్నింటికీ సూర్యుడే కారణం. ఒకే సూర్యకాంతి ఏడురంగులుగా విశ్లేషితమవుతుంది. అలాగే శబ్ద, వర్ష కారకుడు కూడా సూర్యుడే!

ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు... ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగానూ ఆ ఆదిదేవుడికి ప్రాధాన్యముంది. అందుకే ధన్వంతరి అని కూడా అంటారు. సూర్యభగవానుడి ద్వారా ఆరోగ్యం పొందాలన్నారు. యోగాభ్యాసంలో సూర్యనమస్కారాలకు ప్రాముఖ్యముంది. సూర్యుడు నేత్ర కారకుడంటోంది జ్యోతిషం. అంటే సూర్యుడి అనుగ్రహం వల్లే కంటిచూపు బాగుంటుంది. ఆ కిరణాల ప్రభావంతో మన శరీరం విటమిన్‌ ‘డి’ని ఉత్పత్తి చేసుకుంటుంది. పాడిపంటలకు, మానసిక పరిపుష్టికి, శారీరక పటిష్టతకు.. ఇలా అన్ని విధాలా అనుకూలించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. భాస్కరుడి దివ్యశక్తులను ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి వేదాలు.  

రథసప్తమి విశిష్టత... మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. ఈ పర్వదినాన ఆకాశంలో నక్షత్రాల కూటమి రథం ఆకారంలో ఉంటుంది. అదే విశేషం. రథసప్తమిని సూర్యజయంతి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో సౌరసప్తమి, భాస్కరసప్తమి, మహాసప్తమి అని కూడా పిలుస్తారు. ఈ పుణ్యదినాన నదీస్నానం, సూర్యుణ్ణి ప్రత్యేకంగా పూజించటం ఆనవాయితీ. ప్రకృతిని కలుషితం చేయకుండా పుడమిపై స్వచ్ఛమైన సూర్యకాంతి ప్రసరించే అవకాశం కల్పించగలిగితే.. అదే అత్యున్నతమైన సూర్యారాధన.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని