పరాశక్తి స్వరూపాలు సమ్మక్క సారలమ్మ

విజయనగరంలో పైడితల్లి అమ్మవారు, బుక్కరాయ సముద్రంలో ముసలమ్మ, పెనుగొండలో కన్యకా పరమేశ్వరి.. వీరంతా మనిషిగా జన్మించి, మందికి మేలుచేసి దైవంగా పూజలందుకున్నారు. సమ్మక్క, సారలమ్మలు ఆ కోవకు చెందిన వారే. వీరిని ఆది పరాశక్తి స్వరూపాలుగా భావించి ఆరాధిస్తారు.

Updated : 15 Feb 2024 08:34 IST

ఫిబ్రవరి 21-24 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర

విజయనగరంలో పైడితల్లి అమ్మవారు, బుక్కరాయ సముద్రంలో ముసలమ్మ, పెనుగొండలో కన్యకా పరమేశ్వరి.. వీరంతా మనిషిగా జన్మించి, మందికి మేలుచేసి దైవంగా పూజలందుకున్నారు. సమ్మక్క, సారలమ్మలు ఆ కోవకు చెందిన వారే. వీరిని ఆది పరాశక్తి స్వరూపాలుగా భావించి ఆరాధిస్తారు.

న్యాయం, ప్రజా వ్యతిరేక పాలనల మీద తిరుగుబాటుతో తల్లీకూతుళ్లు సాగించిన పోరాటానికి ప్రతీక సమ్మక్క, సారలమ్మ జాతర. సమ్మక్క.. ఆమె కుమార్తె సారలమ్మలు చేసిన పోరాటాన్ని గౌరవిస్తూ గిరిజనులు చేసుకునే పండుగ ఇది. ఆధ్యాత్మిక చైతన్యానికి, అడవి బిడ్డల వీరత్వానికి, ఆదివాసుల ఆత్మాభిమానానికి, అమరులైన శూరుల త్యాగనిరతికి సంకేతమైన ఈ జాతరకు 9 శతాబ్దాల ఘనచరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే జాతర ఇది. దండకారణ్యంలో ఒక భాగమిది.

మేడారంలో రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తారు. చారిత్రక కథనాన్ని అనుసరించి.. 12వ శతాబ్దంలో జగిత్యాల ప్రాంతంలోని పొలవాస అటవీ క్షేత్రానికి నాయకుడు గిరిజన తెగకు చెందిన మేడరాజు. ఇతడు అడవిలో దొరికిన శిశువును అమ్మవారి అనుగ్రహంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. యుక్తవయసులో మేనల్లుడైన పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశాడు. వీరి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు. ఒకసారి ప్రతాపరుద్రుడు రాజ్య కాంక్షతో పొలవాస మీద దండెత్తాడు. కాకతీయ సైన్యాల ధాటికి తాళలేని గిరిజనులు మేడారానికి తరలివెళ్లారు. మామ మేడరాజుకు, అల్లుడు పగిడిద్దరాజు ఆశ్రయం ఇచ్చాడు. అది నచ్చని కాకతీయ చక్రవర్తి- మేడారంపై మెరుపుదాడి చేశాడు. గిరిజన సైన్యం ధైర్యంగా ఎదుర్కొన్నా ఎక్కువకాలం యుద్ధం చేయలేకపోయారు. సంపెంగ వాగు దగ్గర పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజు వీరమరణం పొందారు. ఆ పరాజయాలను జీర్ణించుకోలేక జంపన్న.. సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగుగా పిలుస్తున్నారు.

అయినవాళ్లు వీరమరణం చెందినా.. సమ్మక్క సారలమ్మలు మాత్రం కదన రంగంలో ధైర్యంగా పోరాడారు. తర్వాత సారలమ్మా నేలకొరిగింది. సమ్మక్కను నేరుగా ఎదుర్కోవడం అసాధ్యమని తలచిన శత్రువులు వెన్నుపోటు పొడిచారు. చివరిక్షణం దాకా పోరాడుతూ, నెత్తురోడుతూ సమ్మక్క చిలుకలగుట్ట పైకి వెళ్లింది. అక్కడి నాగమల్లి చెట్టు కింద ఓ కుంకుమ భరిణలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి వెదురుకర్రగా ఆవిర్భవించిందనే కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

నాలుగు రోజుల పండుగ

మేడారంలోని జువ్విచెట్టు కింద ఏర్పాటుచేసిన మహాపీఠంపై రెండు వెదురు కర్రలను సమ్మక్క, సారలమ్మలకు ప్రతీకగా ప్రతిష్ఠిస్తారు. సమ్మక్కకు ప్రతీకగా భావించే కుంకుమ భరిణను చిలుకలగుట్ట నుంచి పూజారులు తీసుకొచ్చి, వెదురు కర్రకు అలంకరించడం ఈ జాతరలో ప్రధాన ప్రక్రియ. దీన్నే ఆదిఘట్టం అంటారు. రెండో రోజు కన్నెపల్లి మందిరం నుంచి సారలమ్మకు ప్రతిరూపమైన పసుపు భరిణను మరో వెదురు కర్రకు పట్టుదారాలతో కడతారు. తల్లీబిడ్డల రూపాలకు కుంకుమ, పసుపులను నీళ్లల్లో కలిపి స్నాన వేడుక నిర్వహిస్తారు. శక్తిమాతలైన సమ్మక్క సారలమ్మలకు చీర సారెలు సమర్పిస్తారు. మూడో రోజైన మాఘ పౌర్ణమి నాడు నిండు జాతర పేరుతో నిర్వహించే ప్రధాన ఉత్సవాలకు అసంఖ్యాకంగా భక్తులు వస్తారు. నాలుగో రోజు వనప్రవేశంతో సమ్మక్క, సారలమ్మల జాతర ముగుస్తుంది. 1996లో దీన్ని తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించారు. జాతరకు మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఝార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి భక్తజనం తరలివస్తుంది.

బెల్లమే బంగారం

జాతరలో శక్తి రూపాలైన సమ్మక్క, సారలమ్మలకు బంగారం పేరిట బెల్లం నివేదించడం సంప్రదాయం. తమ బరువుకు సరితూగే బెల్లాన్ని అమ్మవారికి మొక్కు కింద సమర్పించుకుంటారు. ఆ బెల్లాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకెళ్తారు.

తిరుగువారం వేడుక

మహాజాతర పూర్తయిన తర్వాతి వారం నిర్వహించే వేడుకలను ‘తిరుగువారం వేడుక’ అంటారు. నాలుగు రోజుల జాతరలో తప్పులు ఏమైనా జరిగితే క్షమించమని అమ్మవారిని వేడుకుంటారు. ఈ తిరుగువారం వేడుకతో మహాజాతర ముగుస్తుంది.

రమా శ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని