సర్వ జీవాదరణం.. సర్వేశ్వర ప్రీతికరం

మన సమాజం తొలి నాళ్ల నుంచి భూతదయకు పెద్దపీట వేసింది. సర్వజీవ ఆదరణే సర్వేశ్వరుడికి ప్రీతికరమని నమ్మి, ఆచరించారు. సర్వ జీవుల పట్ల సానుభూతి చూపాలన్న సత్సంప్రదాయాన్ని విశ్వం ముంగిటికి తెచ్చింది భారతీయం.

Published : 29 Feb 2024 00:11 IST

మార్చి 1 వివక్ష వ్యతిరేక దినోత్సవం

అభివృద్ధికి, అత్యున్నతికి నిలువుటద్దం వివక్షా రహిత సమాజం. ఎలాంటి వివక్షలూ లేకుండా సోదరభావంతో మెలగమని ప్రబోధిస్తుంది మన వేదభూమి. మధ్యలో వచ్చిన కొన్ని స్వార్థ శక్తుల అజ్ఞానం లేదా అహంకారం అంధకారంలా అలముకుని.. సంస్కృతికి మాయని మచ్చను తెచ్చాయి. ఆ కళంకం మాసిపోయి, శాంతి విలసిల్లాలంటే.. మళ్లీ సర్వజీవాదరణ, అహింసా విధానం వ్యాప్తి చెందాలి.

న సమాజం తొలి నాళ్ల నుంచి భూతదయకు పెద్దపీట వేసింది. సర్వజీవ ఆదరణే సర్వేశ్వరుడికి ప్రీతికరమని నమ్మి, ఆచరించారు. సర్వ జీవుల పట్ల సానుభూతి చూపాలన్న సత్సంప్రదాయాన్ని విశ్వం ముంగిటికి తెచ్చింది భారతీయం. ఈ భావన వల్ల భేదాలకు తావుండదు. అలా అన్ని ప్రాణులనూ సమాదరణతో చూడగలగడమే మన సంప్రదాయంలోని గొప్పదనం. జీవవైవిధ్యం ప్రకృతికెంతో మేలు చేస్తుంది. దయ, ఆదరణలకు సమమైన ధర్మం మరొకటి లేదు- అన్నారు రుషులు. అందువల్లే ప్రతి హృదయం దైవ మందిరమేనన్న అద్భుతభావన బహుళవ్యాప్తిలోకి వచ్చింది. వేదాలు, ఉపనిషత్తుల నుంచి తగిన సూక్తులను ఉదహరించి గురువులు నిరంతరం ఈ విధమైన సద్బోధలు చేస్తున్నారు. ఇదంతా శాంతియుత జీవనానికి దారితీయాలనే. స్త్రీ పురుష, పేద, ధనిక.. తదితర వివక్షలు పాటించకూడదనేది ఈ బోధనల సారాంశం. దీన్ని ఆచరించటంలో అవరోధాలు ఉన్నాయేమో కానీ రుషి వచనాల్లో ఎలాంటి లోపం లేదు. కానీ కాలక్రమంలో అవని అంతటా స్వార్థం ఆవరించి, వివక్ష వేళ్లూనుకుంది. దీన్ని ఎందరో మహనీయులు నిక్కచ్చిగా ఖండించారు. నేటికీ కవులూ, ఆధ్యాత్మికవేత్తలూ వివక్ష రాకాసిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

అభ్యుదయ వాదం గొంతెత్తినా..

ఆనాడు మహర్షులు చెప్పింది అర్థం కాకపోయినా నేటి అభ్యుదయ వాదులు చెప్పిన అంశాలైనా ఒంటబట్టించుకుని సరిదిద్దుకోవాలి. లేదంటే సమాజం పోకడ పెడదారి పడుతుంది. మహాకవి శ్రీశ్రీ ‘రుక్కులు’ అనే కవితలో ‘అగ్గిపుల్లా కుక్కపిల్లా సబ్బు బిళ్లా హీనంగా చూడకు దేన్నీ..’ అన్నారు. అసలు రుక్కు అంటేనే వేదం. అగ్గిపుల్ల, కుక్కపిల్ల.. అన్నిట్లో కవిత్వం చూడాలని పైకి కనిపిస్తున్నా సాహిత్యం దైవ, రుషి సంబంధమైనదని గ్రహించాలి. ‘నాన్‌ రుషిః కురుతే కావ్యం’ అన్నది ఆర్యోక్తి. అంటే రుషి కానివాడు కావ్యం రచించలేడు. కావ్యాలు సామాజిక సంక్షేమం కోసమే. శ్రీశ్రీ ప్రస్తావించిన అగ్గిపుల్ల, కుక్కపిల్ల వెనుక ఉన్న లోతైన తాత్త్వికతను గుడిపాటి వెంకటా చలం రాసిన ముందుమాట వివరిస్తుంది. ‘అగ్గిపుల్ల వంక.. ముఖ్యంగా పుచ్చిపోయిన అగ్గిపుల్లవంక చాలాసేపు చూడమంటాను. కుక్కపిల్లని.. ముఖ్యంగా తల్లి చనిపోయిన దిక్కులేని గజ్జికుక్క పిల్లని పెంచమంటాను..’ అన్నారు. ఈ మాటల్లో వివక్షా రహితంగా మెలగాలన్న సూచన కనిపిస్తుంది. ఇది ఎయిడ్స్‌ లాంటి వ్యాధుల బారిన పడినవారిని అమానుషంగా దూరం పెట్టొద్దని యుఎన్‌ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు చెప్పే ‘జీరో డిస్క్రిమినేషన్‌’ భావనను సమర్థిస్తుంది. రోగగ్రస్తులు, దివ్యాంగులు, స్త్రీలు, బలహీన వర్గాల ప్రజలు.. ఎవరైనా సరే వివక్షకు, నిరాదరణకు, అమానవీయతకు గురికాకూడదు. ఇది నెరవేరాలంటే శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన ఓ పూజా పుష్పాన్ని గుర్తు చేసుకోవాల్సిందే!

వివక్షను తరిమేసే సుందర సుమం

‘సర్వం విష్ణుమయం జగత్‌’ అన్నారు. ఈ జగమంతా శ్రీహరే ఉన్నాడని భావం. ‘విష్ణువు’ పదానికి విశ్వవ్యాపకుడని అర్థం. ఈశావాస్య ఉపనిషత్తు కూడా ‘ఈశావాస్యమిదం సర్వం’ అంటోంది. ఇక్కడ ఉన్నదంతా పరమాత్ముడేనని భావం. అంటే మనచుట్టూ ప్రతిదీ దైవత్వంతో నిండి ఉంది. అలా విశ్వమంతటా ఉన్న విష్ణువును పూజించడానికి అష్ట విధ పుష్పాలున్నాయి. అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, జ్ఞానం, తపస్సు, శాంతి, సత్యం- అనేవి అష్టవిధ పుష్పాలు. వీటిలో సర్వభూతదయ అనే కుసుమం ఆ స్వామికి మరీమరీ ఇష్టం. మనమంతా ఈ గుణాన్ని అలవరచుకుంటే ఎదుటి వారిలో దైవాన్ని చూడొచ్చు. అప్పుడు అనారోగ్యాలతో, ఆర్థిక కష్టాలతో లేదా మరే బాధల్లోనో ఉన్నవారిని దూరంపెట్టాలనే ఆలోచనే రాదు. అంతే కాదు అహంకార పూరితంగా ఉన్న లింగ వివక్ష కనుమరుగై పోతుంది. అందుకే భావాత్మకంగా విష్ణు మూర్తికి చేసే పూజల్లో ఇది చాలా ముఖ్యమైనదంటారు. జాతి, స్థాయి భేదాల్లేకుండా సర్వమానవుల్లోనే కాదు.. పశుపక్షాదులు, చెట్లు, క్రిమికీటకాల్లోనూ సర్వేశ్వరుడు ఒకేలా ఉంటాడని తెలుసుకుంటే ఎవరి పట్లా, ఎన్నడూ వివక్ష ఏర్పడదు, వ్యతిరేక భావన కలగదు. సదా, సర్వత్రా ప్రేమ, దయ వర్షిస్తాయి.

అన్నమయ్య అన్న మాట

వివక్ష, భూతదయల ప్రస్తావన అన్నమాచార్యుల కీర్తనల్లోనూ కనిపిస్తుంది. దేహంతో పుట్టినందుకు సకల ప్రాణులపైనా దయ చూపడం మన కర్తవ్యమంటూ- శరీరం నిర్వర్తించాల్సిన పని ఏమిటో అన్నమయ్య సూటిగా తెలియజేశారు. వివక్షా రహితంగా ప్రవర్తించడమే మానవత్వమన్నది అన్నమయ్య భావన.

దైవం మాట వినాలి!

దేవుడున్నాడని నమ్మేటప్పుడు ఆయన మాటలను ఆచరించటం భక్తుల విధి. లింగ వివక్ష కూడదంటూ పురాణేతిహాసాల్లో అనేక కథలు స్పష్టం చేశాయి. అందుకు అర్ధనారీశ్వర తత్వం ఒక మంచి ఉదాహరణ. ఈ శబ్దానికి సగం స్త్రీ, సగం పురుష తత్వం కలిగిన భగవంతుడని అర్థం. మహాశివుడు, ఆయన దేవేరి పార్వతీదేవి.. ఏక రూపంగా కనిపిస్తుంటే.. స్త్రీలను తక్కువ చేసి చూడటం సమంజసమా?! సాగర మథనం తర్వాత అమృతం విషయంలో తగవు తీర్చడానికి, అలాగే పరమేశ్వరుణ్ణి భస్మాసురుడనే రాక్షసుడి బారి నుంచి కాపాడటానికి స్త్రీ మూర్తే శరణ్యం అయింది.
శిఖండి, బృహన్నల లాంటి పాత్రలు నపుంసకులుగా ఉన్నవారి ఔన్నత్యాన్ని చాటుతాయి. మహాభారతంలో భంగాశ్వుడు అనే రాజు, వైవస్వత మనువుకు పుత్రుడైన సుద్యుమ్నుడు తమ పురుషత్వాన్ని వదిలి స్త్రీగా మారి... ఆమె ఔన్నత్యం ఎంతటిదో తెలియజేశారు. ఇలాంటి ఉదంతాలు లింగ వివక్షను దూరం పెట్టాలని, సకల జీవాదరణ, సర్వభూత దయలను అందరూ అనుసరించాలని సూచిస్తూనే ఉంటాయి. వాటిని అనుసరించటమే మన కర్తవ్యం. అదే సర్వ శ్రేయస్కరం.

డా.యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని