ఖురాన్‌ అవతరించిన పవిత్ర మాసం

తొలకరి వర్షాలతో సాగు చేయడానికి అనుకూలంగా తయారవుతుంది నేల. అదే విధంగా రంజాన్‌ మాసంలో కురిసే అల్లాహ్‌ అనుగ్రహాలను ఆస్వాదించేందుకు బీడులా తయారైన హృదయాన్ని తీర్చిదిద్దుకోవాలి.

Published : 07 Mar 2024 00:24 IST

మార్చి 11 నుంచి రంజాన్‌ మాసం ఆరంభం

తొలకరి వర్షాలతో సాగు చేయడానికి అనుకూలంగా తయారవుతుంది నేల. అదే విధంగా రంజాన్‌ మాసంలో కురిసే అల్లాహ్‌ అనుగ్రహాలను ఆస్వాదించేందుకు బీడులా తయారైన హృదయాన్ని తీర్చిదిద్దుకోవాలి. బోలెడన్ని కానుకలు తీసుకొచ్చే రంజాన్‌ను ఘనంగా స్వాగతించేందుకు సిద్ధమవ్వాలి. అందుకోసం ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించు కోవాలి. ఈ పండుగలోని ప్రతీ నిమిషాన్నీ సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికను సిద్ధం చేసు కోవాలి. రంజాన్‌ నెలవంకను చూడటానికి ముందే మనసును ప్రక్షాళన చేసుకోవాలి. తోటివారి పట్ల పగ, ప్రతీకారాలు లేకుండా చూసుకోవాలి. మనం తెలిసీ తెలియక పొరపాట్లు చేసి ఉంటే.. క్షమాపణ అడగాలి. ఇతరుల తప్పిదాలను పెద్ద మనసుతో క్షమించాలి. అనారోగ్య సమస్యలేమైనా ఉంటే ముందుగానే చికిత్స చేయించుకోవాలి. గత రంజాన్‌లో చేసిన తప్పులు ఈసారి దొర్లకుండా చూసుకోవాలి.

ఒక్క అడుగు దూరంలోనే.. రంజాన్‌ నెలలో ఉపవాసాలు, ఆరాధనలు ముఖ్యం. ఆశలను గనుక నియంత్రించుకోగలిగితే.. స్వర్గం ఒక్క అడుగు దూరంలోనే ఉంటుంది. కోరికలకు కళ్లెం వేసేందుకే రంజాన్‌ ఉపవాసాలని గ్రహించాలి.

తౌబా: చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందడం తౌబా. అల్లాహ్‌ను మన్నించమని వేడుకుంటే మంచిపనులు చేసే భాగ్యం కలిగిస్తాడు. హసన్‌ బస్రీ (రహ్మ)ని కలిసిన ఓ వ్యక్తి ‘తెల్లవారుజామున లేచి నమాజు చదవాలన్న సంకల్పంతో పడుకున్నప్పటికీ నిద్రమత్తు వల్ల లేవలేకపోతున్నాను’ అన్నాడు. ‘అంటే నువ్వు పాప పంకిలంలో బందీవై ఉన్నావు. ముందు చెడు ఆలోచనలూ, పనులను వదిలిపెట్టు’ అన్నారు. అందువల్ల రంజాన్‌కు ముందే చెడు యోచనల నుంచి మనసును ప్రక్షాళన చేసుకోవాలి.

సంకల్పం ముఖ్యం: రంజాన్‌లో నూటికి నూరుపాళ్లు అల్లాహ్‌ విధేయత పాటిస్తామని, సత్క్రియలు చేద్దామని  సంకల్పించుకోవాలి. రంజాన్‌ రోజాలు, నమాజులు, దానధర్మాలు హృదయపూర్వకంగా పాటించాలి.

దుఆ: అల్లాహ్‌ను వేడుకోవడం (దుఆ) కూడా ఆరాధనతో సమానం. అల్లాహ్‌ సాన్నిహిత్యానికి దుఆ గొప్ప మార్గం. ఈ రంజాన్‌ నెలంతా శుభాలు ప్రసాదించమని అల్లాహ్‌ను వేడుకోవాలి. దేవుణ్ణి నమ్మినవారికి నిరాశ అనేది ఎన్నటికీ ఉండదు. ఆయన తన కారుణ్య ద్వారాలను తప్పక తెరుస్తాడు.

ఖురాన్‌ పారాయణం: రంజాన్‌ నెలలోనే ఖురాన్‌ అవతరించింది. కనుక ఈ మాసమంతా ఖురాన్‌ పారాయణతో తరించాలి.

రోజా నియమ నిబంధనలు:  రంజాన్‌ నెల ఉపవాసాలు ఫలప్రదం కావాలంటే రోజా నియమాలను ఆచరించాలి. సహెరీ ఎప్పటి వరకూ తినొచ్చు, ఇఫ్తార్‌ ఎలా చేయాలి, రోజాలో చేయకూడని పనులేంటి?- ఇలా రంజాన్‌ నిబంధనలను ఉలమాల ద్వారా కానీ, పుస్తకాలు చదివి కానీ తెలుసుకోవాలి.

శుభాలు అందుతాయి: రంజాన్‌ ప్రణాళిక నిర్దేశించుకోవడం వల్ల ఈ మాసంలో ఒనగూరే శుభాలను అందుకోవచ్చు. కాలం వ్యర్థం కాకుండా వినియోగించవచ్చు. నిద్ర వేళల్ని తగ్గించుకోవడం, ఖురాన్‌ పారాయణం, అల్లాహ్‌ నామస్మరణ, మస్జిద్‌లో ఎక్కువ సమయం గడపడం అలవరచుకోవాలి.

ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని