క్షమకు చిరునామా ఆమె

సృష్టికి మూలం స్త్రీ. భావపరంగానే కాదు, భాషాపరంగానూ ఇది విశిష్టమైంది. స్త్రీ శబ్దంలోని సకార, రకార, తకారాలు సత్వరజస్తమో గుణాలకు ప్రాతినిధ్యం వహించగా.. శక్తిబీజమైన ఇకారాన్ని తనలో లీనం చేసుకుందీ పదం.

Published : 07 Mar 2024 00:28 IST

సృష్టికి మూలం స్త్రీ. భావపరంగానే కాదు, భాషాపరంగానూ ఇది విశిష్టమైంది. స్త్రీ శబ్దంలోని సకార, రకార, తకారాలు సత్వరజస్తమో గుణాలకు ప్రాతినిధ్యం వహించగా.. శక్తిబీజమైన ఇకారాన్ని తనలో లీనం చేసుకుందీ పదం.

ప్రేమ, ఓర్పు, సహనం, శ్రద్ధ, నిబద్ధతలతో లోకానికి ఆదర్శంగా నిలిచిన మహిళామూర్తులు ఎందరో. నిప్పుల్లో కాలినప్పుడే బంగారం నిగ్గు తేలినట్లుగా ఆధ్యాత్మిక ఎదుగుదలకు పై భావనలు ఇంధనంలా పనిచేస్తాయనిపిస్తుంది.

భర్తను పోగొట్టుకొని, కన్నబిడ్డలు అడవుల పాలై, తాను పరాయి పంచన తలదాచుకుంటూ పీకల్లోతు సమస్యల్లో ఉంది కుంతీమాత. అలాంటప్పుడు కృష్ణ పరమాత్ముడు ఏం కావాలో కోరుకోమంటే.. తనకు కష్టాల్నే ప్రసాదించమని అడిగింది. అదేమిటన్న కృష్ణుడితో ‘సుఖాల్లో ఉంటే నిన్నెందుకు తలచుకుంటాను? నన్ను చూడటానికి నువ్వెందుకు వస్తావు? నిన్ను మరిపించే సుఖాల కంటే, గుర్తుచేసే కష్టాలే నాకు ప్రియం’ అంటూ తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటింది కుంతి. తెలిసీ తెలియని వయసులో గర్భశోకాన్ని అనుభవించాల్సి రావడం, యుక్త వయసులో భర్తను కోల్పోవడం, నడివయసులో కన్నబిడ్డలు అడవులకు వెళ్లాల్సిరావడం- లాంటి కష్టాల కొలిమిలో రాటుతేలింది. అందువల్ల ఆమె మనసులో వైరాగ్య భావనకు బీజం పడింది. ఆ ఆలోచనలను ఆధారంగా చేసుకుని ఆధ్యాత్మికంగా తనను తాను ఉన్నత పథంలో నియమించుకోగలిగింది. జీవితమంతా చిక్కుల్లో గడిపింది. కన్నబిడ్డలు చక్రవర్తులై తాను రాజమాత హోదాలో సుఖపడాల్సిన సమయంలో, తమ కష్టాలకు కారకులైన ధృతరాష్ట్రాదులకు తనను తాను సేవకురాలిగా నియమించుకోగలిగిన మానసిక ఔన్నత్యం సాధించింది.


అమ్మ ఔన్నత్యం

అర్హుడైన తన బిడ్డకు అధికారం అందనందుకు అలమటించింది ఒక అమ్మ కౌసల్య. తన బిడ్డకు అర్హత లేకున్నా.. అధికారం అందించేందుకు- ఆహ్లాదకరంగా సాగుతున్న జీవితాన్ని అల్లకల్లోలం చేసింది మరో అమ్మ కైక. ఇటువంటి భిన్న ధృవాల మధ్య జీవిస్తూ కూడా తన ఇద్దరు బిడ్డలైన లక్ష్మణ, శత్రుఘ్నుల్లో ఒకరిని భగవత్‌ సేవకునిగా, మరొకరిని భాగవత సేవకునిగా సమర్పించగలిగిన ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన ఇంకో అమ్మ సుమిత్ర. వాల్మీకి మహర్షి సుమిత్ర అనే పేరులోనే ఆమె వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేశాడు. రాగద్వేషాలతో పని లేకుండా మంచితనంతో మమేకం కాగలిగిన మనస్తత్వం కలది సు-మిత్ర.

స్త్రీ జీవితంలో ఎన్ని దశలున్నా అన్నింటి కంటే ఉత్తమమైంది అమ్మ దశ. నిండు సభలో తనను అవమానించినవారు ఘోరంగా పతనం కావాలి, అప్పుడే తన వేదన తీరుతుంది- అనుకుంది ద్రౌపది. కానీ క్రమంగా ఆమె ఆధ్యాత్మిక పథంలో ప్రవేశించింది. తల్లిగా తాను పడిన క్షోభ మరో తల్లికి కలగకూడదని భావించి, తన బిడ్డల్ని పాశవికంగా చంపిన అశ్వత్థామను సైతం క్షమించి, మానవత్వం నుంచి మాధవత్వం దిశగా పయనించింది.


మహా సాధ్వి సావిత్రి

వడ్డించిన విస్తరి లాంటి జీవితావకాశాలన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా, రాజ్యం కోల్పోయి అంధుడైన తండ్రితో అడవుల పాలవడమే కాకుండా అల్పాయుష్కుడైన సత్యవంతుణ్ణి నారదుని మాటల ప్రభావంతో పరిణయం చేసుకుంది. సాధనతో అటు పుట్టినింటిని, ఇటు మెట్టినింటిని ఉద్ధరించటమే కాకుండా తన వాక్చాతుర్యంతో యమధర్మరాజును సైతం మెప్పించి భర్త ప్రాణాల్ని రక్షించుకున్న సాధ్వి సావిత్రి.

పడి లేచిన కెరటం

‘కెరటం నాకు ఆదర్శం. పడినందుకు కాదు.. పడినా లేచినందుకు’ అన్నాడో కవి. జీవితంలో తప్పటడగు ఏ క్షణంలోనైనా, ఎప్పుడైనా పడొచ్చు, కానీ అక్కడి నుంచి లేచి ఎదగడమే ఉన్నతికి మార్గం. తనపై ఇంద్రుడికున్న మోహమో, భర్త గౌతముడి తపశ్శక్తిపై ఉన్న భయమో.. కారణమేదైనా బలైంది మాత్రం అహల్యే. శతానందుడికి జన్మనిచ్చిన అహల్య ఒక బలమైన బలహీన క్షణంలో ఇంద్రుడి ఆనందానికి లోనైంది. ఆ ప్రవర్తనకు గౌతముడి శాపం మార్గం చూపింది. తాను శిలా సదృశగా ఉంటూ సాధన కొనసాగించింది. లోకం నిత్యం స్మరించదగ్గ పంచ కన్యల్లో ఒకరిగా పరిణామం చెందింది. శ్రీరాముడు కూడా కౌసల్యామాతతో సమానంగా నమస్కరించగలిగే స్థాయికి ఎదిగింది. చివరికి తాను సాధించిన తపశ్శక్తి మొత్తాన్ని లోక కల్యాణం కోసం రామచంద్రమూర్తి చేయబోతున్న దుష్ట రాక్షస సంహార యజ్ఞానికి సమిధగా అందించింది అహల్య. చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు, ఆమోదించేవాడు- ఈ నలుగురు పాపపుణ్యాల్లో భాగస్వాములు అవుతారు. తనవాళ్లు పాపకార్యాలకు పాల్పడుతుంటే ఆపగలగాలి. అంత శక్తి లేకపోతే కనీసం చెప్పే ప్రయత్నం చేయాలి. అలా భర్తకు చెప్పగలిగింది మండోదరి. అతడు విన్నా వినకపోయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. అందువల్లనే భర్త రావణాసురుణ్ణి చంపిన పరమాత్మ స్వరూపమైన రామచంద్రుడు తన ఎదుట వినయంగా నిలబడేలా చేసుకుంది మండోదరి.

యోగిని శబరి

మునుల సూచన మేరకు రామచంద్రుని దర్శనం కోసం పరితపించిన యోగిని శబరిమాత. తన బోధనలతో బిడ్డ ఛత్రపతి శివాజీని ధర్మ పరిరక్షకునిగా తీర్చిదిద్దిన వీరమాత జిజియాబాయి. 28 సంవత్సరాల పాటు రాజ సింహాసనాన్ని అధిష్టించి పరిపాలన చేస్తూనే జీవిత గమనాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ కాశీ విశ్వనాథ ఆలయం, గయ విష్ణుపాద ఆలయంతో సహా తొమ్మిది దేవాలయాలను పునరుద్ధరించి, అనేక ధర్మశాలలు నెలకొల్పిన ధన్యజీవి, వీరవనిత అహల్యబాయి హోల్కర్‌. కోనసీమ ప్రాంతంలో అన్నార్తుల ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ, ఆధ్యాత్మిక రంగంలో సామ్యవాదాన్ని ప్రవేశపెట్టి, సకల జీవులనూ కన్నబిడ్డల్లా ఆదరించిన కరుణామాత జిల్లెళ్లమూడి అమ్మ.. ఇలా పౌరాణిక, చారిత్రక, ఆధునిక మహిళామూర్తులు ఎందరో! అందరికీ వందనాలు.   - డా.కె.కరుణశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు