భక్త వశంకరుడు.. బోళా శంకరుడు!

భక్తసులభుడైన పరమేశ్వరుడు ప్రాణకోటి హితం కోసం హాలాహలాన్ని కూడా ఆనందంగా సేవించాడు. ఆ మహాదేవుని అర్చించి, అభిషేకించి తరించే పర్వదినమే మహాశివరాత్రి, ఈ పుణ్య దినాన ఉపవాసం, జాగరణలే కాకుండా శంకరుని చరితామృత శ్రవణం, గుణగానం, పాదసేవనం పరమపవిత్రం. బ్రహ్మదేవుడు సృష్టించిన లోకాల్ని శ్రీమహావిష్ణువు తన లీలలతో నడిపిస్తే, మహేశ్వరుడు తుదకు తనలో లయం చేసుకుంటాడు. మంగళస్వరూపుడైన మహాశివుడికి రెండు తత్త్వాలున్నాయి.

Updated : 07 Mar 2024 05:25 IST

మార్చి 8 మహాశివరాత్రి

భక్తసులభుడైన పరమేశ్వరుడు ప్రాణకోటి హితం కోసం హాలాహలాన్ని కూడా ఆనందంగా సేవించాడు. ఆ మహాదేవుని అర్చించి, అభిషేకించి తరించే పర్వదినమే మహాశివరాత్రి, ఈ పుణ్య దినాన ఉపవాసం, జాగరణలే కాకుండా శంకరుని చరితామృత శ్రవణం, గుణగానం, పాదసేవనం పరమపవిత్రం.

బ్రహ్మదేవుడు సృష్టించిన లోకాల్ని శ్రీమహావిష్ణువు తన లీలలతో నడిపిస్తే, మహేశ్వరుడు తుదకు తనలో లయం చేసుకుంటాడు. మంగళస్వరూపుడైన మహాశివుడికి రెండు తత్త్వాలున్నాయి. ఒకటి సకల భక్తానుగ్రహ కారకమైన సగుణ సాకార రూపం. అంటే మహాశివుడి దివ్య స్వరూపం. రెండోది నిరాకారం, నిర్గుణం, నిర్మలం, జ్యోతిర్మయ స్వరూపమైన లింగాకారం. ఇది అనంతానికి చిహ్నం. భక్తులకు సులువుగా వశమయ్యే భగవత్‌ స్వరూపం సదాశివుని రూపం. అలాగే ‘శివోహి భజనాధీనో..’ అన్నారు. అంటే భజనకు సులువుగా ప్రసన్నమయ్యేవాడని అర్థం. జ్ఞానభక్తి కన్నా భజనభక్తి అందరికీ సులభం. ‘శివ’ పదానికి మంగళం, క్షేమం, భద్రం, అభయం, ప్రశాంతత, శుద్ధత అనేవి అర్థాలు. అలా ఆయన భక్త వశంకరుడు, బోళా శంకరుడిగా ప్రసిద్ధుడయ్యాడు. యోగానికీ, యోగులకూ అధినాథుడు పరమశివుడు. అందుకే స్వామి వివేకానంద ‘భారతీయ నిరాడంబర త్యాగభావానికి ప్రతీక శంకరుడు. ఆయనను ఆరాధించటమంటే శాంతాన్ని, సమానత్వాన్ని, యోగాన్ని, త్యాగాన్ని, తపస్సుని ఆదర్శంగా స్వీకరించటమే’ అన్నారు.

ప్రణవ స్వరూపుడు పరమశివుడు

పరమేశ్వరుడు ప్రణవ స్వరూపుడు. ప్రణవమంటే ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కారాల సంయోగంతో కూడిన ఏకాక్షర ‘ఓం’కారం. ప్రతి మంత్రం ప్రణవంతోనే ప్రారంభమవుతుంది. ప్రణవమే పరమాత్మ. సర్వవ్యాపి. అలా సర్వత్రా వ్యాపించిన పరమేశ్వరుడు భక్తులకు మోక్షం ప్రసాదించేందుకు నిరీక్షిస్తుంటాడు. శివుడు శ్మశానాన్ని తన సంస్థానంగా చేసుకుని కొలువై ఉండటం వెనుక అంతరార్థమిదే.

పంచక్లేశాలు.. పంచామృతం

శివుడు అభిషేక ప్రియుడు. పూలు, పండ్ల్ల కన్నా అభిషేకాలతో పార్వతీశుడు త్వరగా సంతుష్టుడవుతాడని శాస్త్ర వచనం. ఆధ్యాత్మిక సాధనలో మానవులకు పంచక్లేశాలు ఎదురవుతాయి. అవి అజ్ఞానం, అహంకారం, కోరిక, ద్వేషం, సుఖాల కోసం తపించడం- అనే ఐదు దుఃఖాలు. వాటి నుంచి బయట పడేందుకు సాధకులైనవారు భక్తి, జ్ఞానం, నిష్కామకర్మ, వివేకం, వైరాగ్యం- అనే పంచామృతాలతో అభిషేకం చేయాలని మన ధర్మం బోధిస్తోంది. అప్పుడు ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది. జీవుడు దేవుడితో మమేకమవుతాడు. తొలుత భౌతికమైన పదార్థాలతో చేసే అభిషేకాలు పరమశివుడిపై భక్తి, విశ్వాసాలను పెంపొందిస్తాయి. తర్వాత పరిశుద్ధ ప్రేమ అనే శాశ్వత అభిషేకానికి దారి తీస్తాయి. అంతటి శుద్ధప్రేమ ప్రదర్శించినందువల్లే భక్త కన్నప్ప ఎంగిలి నీటితో అభిషేకం చేసినా.. మురిసిపోయాడు ముక్కంటి. ఆ అవ్యాజ భక్తితో అభిషిక్తుడై కన్నప్పకు ముక్తిని ప్రసాదించాడు.

వైవిధ్యాలు.. వైరుధ్యాలు..

లోకంలో ఎన్ని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉన్నా సమత్వాన్ని పాటించటమే మనధర్మం. దాన్ని నిరూపించేది పరమశివుడి రూపం. శిరస్సున గంగ రూపంలో నీరు, నుదుటిపై మూడో కన్ను రూపంలో నిప్పు, అమృతకిరణుడైన నెలవంక సిగపై, కాలకూట విషమేమో కంఠాన.. అలాంటి విశ్వేశ్వరుడు సదా మనందరినీ కాపాడే పరమశివుడు. ఆ స్వామి లింగాకారుడై కరుణించినా, దక్షిణామూర్తిగా జ్ఞానాన్ని పంచినా, నటరాజుగా నర్తించినా.. నిత్యచైతన్యాన్ని ప్రసాదిస్తాడు. విశ్వంలో ప్రతి కదలికా ఆ నీలకంఠుడి చైతన్య ప్రభావమే. శివాలయంలో మొదట నందికి ప్రణమిల్లాలని చెబుతారు. జ్ఞానస్వరూపుడైన శివుడికి వాహనమై, అందరి పూజలందుకునే అర్హత పొందింది నంది. మనం కూడా భగవత్‌ జ్ఞానాన్ని మన మస్తిష్కంలో స్థిరపరచుకుంటే సర్వత్రా సత్కారాలు అందుకోగలం అన్నది అంతరార్థం.

గంగాధరుడు ధరించే నెలవంకను కాలానికి ప్రతీకగా నిర్వచిస్తారు. చంద్రుడి వృద్ధి క్షయాల ఆధారంగానే కాలాన్ని రోజులుగా, నెలలుగా పరిగణిస్తారు. అటువంటి నెలవంకను దాల్చి.. అత్యంత శక్తిమంతమైన కాలం కూడా తనకు అలంకారం అయ్యిందని పరమేశ్వరుడు నిరూపించాడు. శివుడు ధరించే త్రిశూలం త్రిగుణాలకు, సృష్టి, స్థితి, లయ- అనే ప్రక్రియలకు ప్రతీకగా నిలుస్తుంది.

పరమపవిత్ర వ్రతం

మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణ పక్షాన అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిథిలో వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ప్రీతికరమైంది. పరమ శివుడు ఆనాటి అర్ధరాత్రి కోటి సూర్యసమప్రభతో లింగాకారంలో ఆవిర్భవించటం వల్ల దీనికి శివరాత్రి అనే పేరు వచ్చింది. దేవపూజ పగటిపూట కాకుండా రాత్రివేళ సాగటం ఈ పండుగ ప్రత్యేకతల్లో ఒకటి.

మహాశివరాత్రి విశిష్టతను లింగపురాణం పేర్కొంది. దీనికి సమానమైన వ్రతం ఇంకొకటి లేదు, ఆనాడు చేసే ఉపవాస, జాగరణలు ఎంతో పుణ్యప్రదమైనవి- అంటూ సోదాహరణంగా వివరించింది. ఈ పర్వదినాన మహేశ్వరుని ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని