పంచ నారసింహుల పవిత్రక్షేత్రం

నాడు అమిత భక్తితో ప్రత్యక్షం చేసుకున్న యాదరుషికే కాదు, నేడు అశేష భక్త జనులకు కూడా ఆశీస్సులు అందిస్తున్న భక్త వరదుడు యాదాద్రి లక్ష్మీనారసింహుడు. ఆయన ఈ క్షేత్రంలో అయిదు రూపాల్లో వెలసి అఖిల జనావళికి అభయప్రదాతగా నిలుస్తున్నాడు. ఆ స్వామి రూపమే భీకరం. కానీ హృదయం మహా మృదులం.

Updated : 14 Mar 2024 02:17 IST

మార్చి 18 యాదాద్రి నరసింహుని కళ్యాణోత్సవం, 19 స్వామివారి రథోత్సవం

నాడు అమిత భక్తితో ప్రత్యక్షం చేసుకున్న యాదరుషికే కాదు, నేడు అశేష భక్త జనులకు కూడా ఆశీస్సులు అందిస్తున్న భక్త వరదుడు యాదాద్రి లక్ష్మీనారసింహుడు. ఆయన ఈ క్షేత్రంలో అయిదు రూపాల్లో వెలసి అఖిల జనావళికి అభయప్రదాతగా నిలుస్తున్నాడు. ఆ స్వామి రూపమే భీకరం. కానీ హృదయం మహా మృదులం.

రుష్యశృంగుని పుత్రుడైన యాదరుషి తపోఫలంగా నరసింహస్వామి పరమ ప్రేమతో ప్రత్యక్షమైన క్షేత్రమే యాదగిరిగుట్ట. పంచ నరసింహ క్షేత్రంగానూ ప్రసిద్ధి. ఈ కొండపై స్వామి జ్వాలా నరసింహ, గండ భేరుండ నరసింహ, యోగ నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీనరసింహగా దర్శనమివ్వటం విశేషం. యాదాద్రిని ‘రుషి ఆరాధన క్షేత్రం’ అని కూడా అంటారు. ఆంజనేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. యాదగిరి శిఖరాగ్రంలో ఈశాన్య దిశలో పరమశివుడు స్వయంభూలింగంగా వెలిశాడు. అందుకే ఇది వైష్ణవులూ, శైవులకూ కూడా ఆరాధ్యనీయమైన తీర్థం.

యాదర్షి పేరిటే యాదాద్రి

పురాణ కథలను అనుసరించి బాల్యం నుంచే యాదర్షి నృసింహభక్తుడు. ఒకసారి తీర్థయాత్రలు చేస్తుండగా ఆంజనేయుడు కలలో కనిపించి అడవి మధ్యలో ఉన్న పర్వతం దగ్గర తపస్సు చేయమని ఆదేశించాడు. హనుమ సూచన మేరకు కొండ దిగువన తన ఇష్టదైవమైన నరసింహుని ధ్యానిస్తూ, ఎన్నో ఏళ్లు తపస్సు చేశాడు. అలా తపస్సు చేసింది ఈ పరిసర ప్రాంతంలోనే అని భక్తుల నమ్మకం. యాదముని తపస్సుకు మెచ్చిన స్వామి ఉగ్రనరసింహ రూపంలో సాక్షాత్కరించాడు. ఆ మూర్తిని దర్శించలేని ముని, శాంతరూపంలో కనిపించమని ప్రార్థించగా లక్ష్మీసమేతుడై ప్రత్యక్షమయ్యాడు. యాదర్షి కోరిక మేరకు 12 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవైన గుహలో స్వయంభువుగా వెలిశాడు. అదే లక్ష్మీనరసింహుని రూపం. ఇక్కడ శంఖుచక్రాలు, అభయ వరద ముద్రలతో స్వామి శోభిల్లడం విశేషం. ఆ గిరి తన భక్తుడైన యాదరుషి పేరుమీదుగా యాదగిరిగా ప్రసిద్ధమవుతుందని నృసింహుడు ఆశీర్వదించాడు. అదే యాదగిరిగుట్ట. యాదర్షి ప్రార్థన మేరకు ఆంజనేయస్వామి కూడా పంచముఖాలతో క్షేత్రపాలకుడిగా వెలిశాడు.

అయిదు రూపాల అపురూప దర్శనం

నరసింహస్వామిలోని బహు ముఖాలను దర్శించాలని ఆకాంక్షించి యాదముని తీవ్ర తపస్సు చేశాడు. భక్తులను కరుణించే నృసింహుడు మరోసారి దర్శనమిచ్చి ముని అభీష్టాన్ని నెరవేర్చి, తనలోని మరో నాలుగు దివ్యరూపాలను దర్శింపచేశాడు. అవే జ్వాల, ఉగ్ర, గండభేరుండ, యోగనృసింహ రూపాలు. లక్ష్మీ నరసింహ రూపంతో కలిపి పంచముఖ మూర్తులతో నరహరి యాదాద్రిపై భక్తుల మనోభీష్టాలను తీరుస్తున్నాడు. సాధారణంగా సౌమ్య, భోగమూర్తులను (సీతారాములు తదితర సతీసమేతులైన మూర్తులు) జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. ఉగ్ర, యోగమూర్తులను కొండలపైన, అరణ్యాల్లో ప్రతిష్ఠాపన చేస్తారు. కానీ నరసింహుని సర్వ మూర్తులను ఒకేచోట పూజించటం యాదాద్రి విశిష్టత. ఆలయంలో జ్వాలా నరసింహుడు పాము పడగలా, ఎగసిన అగ్నికీలలా ఉంటాడు. అలాగే ధ్యానస్థితిలో యోగనరసింహడు, వెండి కవచంతో ఉన్న లక్ష్మీనరసింహస్వామి, ఉత్సవ మూర్తులు, గండభేరుండ నారసింహుడు, చక్రనారసింహుడు కనిపిస్తారు.

కొన్నాళ్లు మరుగున పడినా..

యాదముని నరహరిని అర్చిస్తూ యాదగిరిపైనే తనువు చాలించి, స్వామిలోనే ఐక్యమయ్యాడు. కాలక్రమంలో ఈ క్షేత్రం ధూపదీప నైవేద్యాలు లేని కోవెలగా మారింది. కొన్నేళ్ల తర్వాత సమీప గ్రామాధికారికి నృసింహుడు కలలో కనిపించి, తన జాడలు తెలియజేశాడు. మరుసటి రోజు భక్తులతో కలసి కొండపై అన్వేషించగా తొలుత విష్ణు పుష్కరిణి, తర్వాత ఆంజనేయస్వామి మూర్తి, చీకటి గుహలో పంచనారసింహుల రూపాలు కనిపించాయి. అప్పటి నుంచి స్వామికి పూజలు చేయసాగారు. స్థల పురాణాన్ని బట్టి త్రిభువన మల్లుడనే పశ్చిమ చాళుక్య రాజు ఈ లక్ష్మీనరసింహుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అతడు తన మంత్రి ద్వారా ఆ స్వామి మహిమను తెలుసుకుని పూజలు నిర్వహించాడు. తరవాత నరసింహుని కృపతో ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించాడు. యాదగిరీశుడిని కాకతీయ గణపతిదేవుడు, శ్రీకృష్ణదేవరాయలు దర్శించినట్లు, ముస్లిం పాలకులు కూడా ఈ స్వామికి ఆకర్షితులైనట్లు చరిత్ర కథనం. ఆసఫ్‌జాహీ ప్రభువులు మెట్ల మార్గాన్ని నిర్మించారని, ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆలయ అభివృద్ధికి అప్పట్లోనే సుమారు ఎనభై వేల రూపాయలు మంజూరు చేశారని చెబుతారు.

గుట్టకింద మరో నరసింహుడు

యాదగిరి క్షేత్రంలో గుట్ట కింద ఉన్న మరో నరసింహస్వామిని భక్తులు ‘పాత నరసింహ స్వామి’ అని పిలుస్తారు. స్థానికుల కథనం ప్రకారం.. నరసింహుడు తొలుత ఇక్కడే వెలసి, తర్వాత పర్వతం మీదికి తరలివెళ్లాడని, ఆలయంలో కనిపించే పాదముద్రలు ఆ స్వామివేనని నమ్ముతారు.

దుష్టశక్తులను దునుమాడే దేవుడు

నరసింహమూర్తిని స్మరిస్తే దుష్టశక్తులూ ఆవరించవని, అనారోగ్యాల నుంచి బయట పడొచ్చని భక్తులు విశ్వసిస్తారు. స్వామి అవతార ఘట్టాన్ని విన్నా, చదివినా భయంతో కూడిన జన్మ రాదని ధర్మరాజుకు నారదుడు ప్రబోధించాడు. అంతరంగంలో కరుణను, బహిరంగంగా రౌద్రాన్ని ఒలికిస్తూ అవతరించిన నరసింహుడిలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత క్రోధం కనుమరుగైందట. అందుకే యాదాద్రి తదితర పుణ్యక్షేత్రాల్లో స్వామి దయానిధిగానే దర్శనమిస్తున్నాడు. యాదాద్రి నరసింహుడు భక్తవత్సలుడు, కోటి భానుతేజుడు, సాధురక్షకుడు, శంఖచక్రహస్తుడు, సర్వేశుడు, క్షీరసాగర శయనుడు - అంటూ వర్ణించాడు శేషప్ప కవి.

పురాణాల్లోనూ నరసింహుని ప్రస్తావన

నృసింహ, పద్మ, బ్రహ్మ, బ్రహ్మాండ, స్కాంధ పురాణాలు యాదాద్రి నరసింహుని విశిష్టతను వివరించాయి. ఈ స్వామి కథకు మూలం వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది.

నిత్యోత్సవాలు, బ్రహ్మోత్సవాలు

యాదాద్రి నరసింహునికి నిత్యపూజలు చేస్తారు. ఏటా ఫాల్గుణ శుద్ధ విదియ మొదలు ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. వైశాఖంలో నృసింహజయంతితో పాటు ధనుర్మాసోత్సవం, శివరాత్రి, కృష్ణాష్టమి, శరన్నవరాత్రి పర్వదినాలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని