సంక్రమణ సౌందర్యం

సంక్రమణాల్లో మకర సంక్రమణం మహా పుణ్యకాలంగా సనాతన ధర్మశాస్త్రాలు పలు ప్రత్యేకతలను వివరించాయి. సంవత్సరాన్ని ఒకరోజుగా నిర్ణయించితే, ఉత్తరాయణాన్ని పగటి కాలంగా గణిస్తారు. ఆ పగటికి

Updated : 12 Mar 2023 13:01 IST

సంక్రమణాల్లో మకర సంక్రమణం మహా పుణ్యకాలంగా సనాతన ధర్మశాస్త్రాలు పలు ప్రత్యేకతలను వివరించాయి. సంవత్సరాన్ని ఒకరోజుగా నిర్ణయించితే, ఉత్తరాయణాన్ని పగటి కాలంగా గణిస్తారు. ఆ పగటికి ఉదయకాలం వంటిది ఈసంక్రమణం.

సూర్యరశ్మి దక్షిణాయనంలో వానల చలువతో పంటలు పండించితే, ఆ ఫలం ఉత్తరాయణ ప్రారంభంలో కాంతిమయ సౌరశక్తికి నివేదించి ప్రసాదంగా అనుభవిస్తాం.

దేవతలకు, పితృదేవతలకు, సమాజానికి కూడా బాధ్యత కలిగి కృతజ్ఞతగా, దానాలతో, ధ్యానాలతో, స్నానతర్పణాలు అర్పించి సంతృప్తిపరచే ఘట్టాలు ఈ పర్వంలో అంశాలయ్యాయి.

సౌరమానం ప్రకారం ఈ రోజు నుంచి మకరమాసం. స్నానప్రాధాన్యం కలిగిన ఈ మాసంలో స్నాన వ్రతానికి ఇది తొలిదివసం. అందుకే అనేక పుణ్యతీర్థాల్లో ఎందరో భారతీయులు సంకల్పసహితంగా పుణ్యస్నానాలు ఆచరిస్తారు.

ఈ రోజున లక్ష్మీపూజకు ప్రాధాన్యాన్ని దేవీభాగవతం పేర్కొంది. ప్రతిమయందుగానీ, కలశమందుగానీ మహాలక్ష్మిని ఆరాధించాలనే విధిని వర్ణించింది. అదేవిధంగా సూర్యారాధనకు, విష్ణుపూజకు విశిష్టతను వర్ణించాయి. శివపూజావ్రతాన్ని ఈ రోజు విశేషవిధిగా కొన్ని ధర్మశాస్త్రాలు వివరించాయి.

సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీముహూర్తంలో స్నానవిధిని నిర్దేశించాయి ధర్మశాస్త్రాలు. సూర్యోదయ సమీపకాలం శ్రేష్ఠమని స్పష్టపరచాయి. తిలలు దానానికేకాక, నైవేద్యానికి, ఆహారంగా స్వీకరించడానికి, తెల్లతిలలతో మధుర పదార్థాలు కలిపి ఒకరికొకరు పంచుకొంటూ శుభాకాంక్షలు తెలపడానికి వినియోగించడం కొన్ని ప్రాంతాల ప్రత్యేక ఆచారం.

ఈ పర్వాన పితృదేవతలను ఉద్దేశించి ప్రత్యేక తర్పణాలు, దానాలు చేసే పద్ధతులున్నాయి. కొందరు పర్వశ్రాద్ధాన్నీ నిర్వర్తిస్తారు. అమ్మానాన్నలకు, పూర్వీకులకు సద్గతులు కలగాలనే సద్భావం వెనక బాధ్యతాయుతమైన కృతజ్ఞతానుబంధం ఉంది.

పాడిపంటలకు మూలమైన పశుసంపదను ఆరాధించడం నేటి వైశిష్ట్యం. పనికొచ్చే పశువుపై ప్రేమతో కూడిన దైవభావాన్ని ప్రసరించడం కృతజ్ఞతకు గొప్ప తార్కాణం. ఆవుపేడను బంతిపువ్వుతో అలంకరించి ‘గొబ్బిగౌరి’గా కొలుచుకొనే భావనలో సుకుమార సౌందర్య దృష్టి ఒక అద్భుతం.

మానవ సంబంధాల మాధుర్యాలు, ప్రకృతి బంధాల దివ్యత్వాలు, దేవతానుగ్రహాల కారుణ్యాలు... ఇటువంటి పండుగలతో అల్లికలై ఏకంగా గోచరిస్తాయి.

వేదఋషులు ‘అన్నం ఆదిత్యాత్మకం’ అని దర్శించారు. మనం స్వీకరించే శాకపాకాలన్నీ సూర్యశక్తిని స్వీకరించి మనకు అందించేవే. అందుకే ఈ పుణ్యకాలం నుంచి సౌరమాన మకరం, చాంద్రమాన మాఘం సూర్యారాధనా ప్రాధాన్యం ఉన్నవి.

కొన్ని ప్రాంతాల్లో కొత్తబియ్యంతో ఆవుపాలు కలిపి సూర్యుడికి నివేదిస్తారు. ఇది సామాన్యులు సైతం ఆచరించే యజ్ఞప్రక్రియే. వేదమూలం  కలిగిన ఈ విధి కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి సమీపంగా వచ్చే మాఘసప్తమి, ఆదివారాలు చేస్తారు. ‘పొంగల్‌’ అనే తమిళుల వ్యవహారం ఇదే.

సంవత్సర స్వరూపమైన దినానికి ఇది శుభోదయం కనుక, శుభాకాంక్షలకు తగిన పండుగ ఇది. అతిథి అభ్యాగతులు, బంధుమిత్రులు, పుట్టింటికి కూతుళ్లు, అత్తింటికి అల్లుళ్లు విచ్చేసి ఆనందంగా గడిపే ఉల్లాసం ఏడాదికాలపు సంతోషాన్ని దట్టించుకున్న వైభవం.

దేవుణ్ని, మనిషిని, పశువును కూడా ప్రేమించి అంతటా ఈశ్వరరూపం దర్శించే అందమైన ఎన్నో ఆచారాలు మేళవించిన ఈ సంక్రమణ శుభవేళగా సనాతన ధర్మనిష్ఠమైన భారతదేశానికి సామరస్య, అభ్యుదయాలు సిద్ధించాలని             శుభాకాంక్షిద్దాం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని