Karthika Somavaram: కార్తీక సోమవార పూజా విధాన ఫలితమిదే!

కార్తీక వ్రతం (karthika vratham) ఏ ఒక్క కులం వారికో సంబంధించినది కాదు. కులవివక్ష ఏదీ లేకుండా అంతా ఆచరించదగ్గ వ్రతమిది.

Updated : 18 Nov 2023 16:57 IST

కార్తీక మాసం (karthika masam) హరిహర పూజకు ఎంతో విశిష్ఠమైంది. ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం (karthika puranam) వివరిస్తోంది. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విషయాలన్నిటినీ విపులీకరించాడు. వాటిలో సోమవార వ్రతాన్ని (karthika somavaram) దాని శక్తిని మరింతగా తెలియ చేశాడు వశిష్ఠుడు.

ఓసారి వశిష్ఠుడు సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో జనక మహారాజును కలిశాడు. జనకుడు మహర్షిని చక్కగా ఆదరించి గౌరవించాడు. ఆ తర్వాత లోక క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జనకుడు ఓ ప్రధాన విషయాన్ని మహర్షి ముందు ప్రస్తావించాడు. ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గం, అందులోనూ వినగానే పుణ్యం వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడిగిన జనకుడికి వశిష్ఠుడు కార్తీక మహాత్మ్యాన్ని గురించి చెప్పాడు. కార్తీక పురాణాన్ని ఎవరైనా వింటే చాలు అది చెప్పిన వారికి, విన్న వారికి పుణ్యం కలుగుతుందన్నాడు. కార్తీక మాసంలో శుక్ల పాడ్యమి మొదలుకొని మాసాంతం వరకూ వ్రతాన్ని చేయాలి. ఈ మాసంలో నదీ స్నానం మరింత పుణ్య ఫలాన్నిస్తుంది.

సూర్యోదయ సమయంలో నదిలో స్నానం చేయాలి. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే భూమి మీద ఉన్న బావులు, చెరువులు, దిగుడు బావులు, చిన్న కాలువలు, నదులు లాంటి అన్ని జలాల్లోనూ శ్రీహరి నివసిస్తూ ఉంటాడు. కార్తీక వ్రతం (karthika vratham) ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. ఉదయాన స్నానం చేయటం తర్వాత భక్తితో పూజలు నిర్వహించటం, అనంతరం కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం ఇలాంటి వాటితో వ్రతం నడుస్తూ ఉంటుంది. సాయంకాల సమయానికి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శక్తి కొద్ది దీపాలను పెట్టి స్వామికి పూజా నైవేద్యాలను సమర్పించాలి. కార్తీక వ్రతం జరుగుతున్నప్పుడు చూసినా పుణ్యఫలమే. కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని చేసిన వాడికి కైలాస నివాస అర్హత లభిస్తుంది.

కార్తీక సోమవారం నాడు (karthika somavaram) చేసిన స్నానం, దానం, జపం అనేవి అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి. కార్తీకమాసంలో ఉపవాసానికి మరీ మరీ ప్రత్యేకత ఉంది. ఒంటిపూట భోజనం, రాత్రి పూట భోజనం, ఛాయానక్త భోజనం, స్నానం, తిలదానం (నువ్వుల దానం), పూర్తి ఉపవాసం అనే ఆరు విధాలుగా ఉపవాస దీక్షను శక్తి కొద్దీ చెయ్యవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వాడు ఒంటిపూట భోజనం చెయ్యవచ్చు. ఛాయానక్త భోజనమంటే సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగటి పూటే భుజించటం, దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటల వేళ భుజించటమని అర్థం. ఇలా ఉపవాసాలేవీ ఉండలేనివాడు ఉదయం పూట పూజకాగానే పండితులకు భోజనం పెట్టి, ఆ పగటి పూట తానూ భోజనం చెయ్యవచ్చు. కార్తీక మాసంలో ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని తప్పక ఆచరించాలి. ఈ నియమాల్లో ఏదో ఒక దాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం, పూజ చేసి రాత్రి పూట భుజించే వాడంటే శివుడికి ఎంతో ఇష్టం.

కర్కశ కథ

కార్తీక మాసంలో అందులోనూ ప్రత్యేకించి సోమవారం ఆచరించిన వ్రతం ఎలాంటి వారికైనా ఎంతటి పుణ్యాన్నిస్తుందో వివరించి చెబుతుంది కర్కశ కథ. పూర్వం స్వాతంత్య్ర నిష్ఠురి అనే ఒక ఆమె ఉండేది. ఆమె ప్రవర్తనంతా అత్యంత హేయంగానూ, కర్కశంగానూ ఉండటంతో ఆమెను కర్కశ అని అంటుండే వారు. కశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడని పెళ్ళాడింది. ఆమె తన దుర్మార్గ వర్తనంతో మంచి వాడైన భర్తను సైతం హింసించి భోగలాలసయై జీవితం గడిపి వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరలో ఎవరూ ఆదరించే వారు లేక దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుసటి జన్మలో శునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారంనాడు పగటిపూట ఎక్కడా ఆహారమే దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో (karthika somavaram) భాగంగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం బలిని (అన్నం ముద్దను) తన ఇంటి ముంగిట ఉంచాడు. ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తింది. వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. దాంతో మానవ భాషలో వేద పండితుడికి తన గతాన్నంతటినీ చెప్పింది.

అంతా తెలుసుకొని కార్తీక సోమవారం నాడు పగటి పూట అంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా శునకానికి పూర్వ జన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని శునకానికి చెప్పాడు. దాంతో తనకెలాగైనా మళ్ళీ పుణ్యం లభించేలా అను గ్రహించమంది ఆ శునకం. సోమవార వ్రతాలను చేసి పుణ్యం సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి ధార పోశాడు వెంటనే కర్కశ శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్వ శరీరంతో కైలాసానికి చేరింది. ఇది స్కంద పురాణం చెబుతున్న సోమవార వ్రత కథ. దీనిలో అంతర్గతంగానూ మనం నేర్చుకునే సందేశాలు ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని