పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య  పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే..

Published : 19 Feb 2024 09:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: పితృ దేవతల్ని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు పురాణాల్లో అనేకం ఉన్నాయి. అసలు పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుందీ కథా సందర్భం. ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలు అంటుంటారు. పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవ గణాలు ఎన్ని? ఎలా ఉంటాయి? అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాల్ని వివరించే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది.

పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటాయి. వీరిలో మూడు గణాల వారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనే వారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యవులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడు గణాల వారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావాల్సిన శ్రాద్ధ విధుల్ని నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారు.

పితృదేవతలుగా ఎలా మారారంటే?

ఈ అమృతాలైన పితృగణాల వారు శాశ్వతాలైన లోకాల్ని పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. ఏకాగ్రత లోపించి యోగభ్రష్టులయ్యారు. ఇలా భ్రష్టులైన కారణంగా వారంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఆమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరు మీదనే క్రౌంచ ద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు. ఉమ, ఏకపర్ణ, అపర్ణ వారి పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజు పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాల్లో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి. వీరిని దేవతలు ఆరాధించటం విశేషం.

పితృదేవతలకు మానస పుత్రిక

ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఆమె పేరు మీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఆమె జీవన కథనంలో నేటి వారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం ఇమిడి ఉంది.  అగ్నిష్వాత్తుల మానస పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఓ రోజు వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతుర్ని అడిగారు. అయితే ఆమె పొరబాటుతో అప్పటివరకు సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది.

పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమాన పాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో... అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావాస్య అయింది. అమావాస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్థం. తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఆమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానసపుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావాస్య (అమావాస్య తిథి) అయిన రోజు తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు