మహా జాతర

గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పడుతుంది సమ్మక్క సారక్క జాతర. తమ కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, వనదేవతలుగా ఈ ఇద్దరమ్మలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

Updated : 14 Mar 2023 13:24 IST

ఫిబ్రవరి 1-4 మేడారం జాతర

గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పడుతుంది సమ్మక్క సారక్క జాతర. తమ కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, వనదేవతలుగా ఈ ఇద్దరమ్మలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

యుగాలుగా, తరాలుగా నిరంతరంగా ప్రవహిస్తున్న క్షీరధార మన సంస్కృతి. ఆ వెల్లువలో తేలే మీగడ తరగలే మన పండుగలు, జాతరలు. తెలంగాణలో జరిగే సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలోని తాడ్వాయి మండలం మేడారంలో దట్టమైన అడవుల మధ్య ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

నేటి జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. అతడు వేటకి వెళ్లినప్పుడు దొరికిన చిన్నారికి ‘సమ్మక్క’ అని పేరు పెట్టుకున్నాడు. గ్రామస్థులు కరువు సమయంలో తమకు తోడుగా వచ్చిన వనదేవతగా ఆమెను భావించేవారు. సమ్మక్క హస్తవాసి మీద ఆ ఊరి ప్రజలకు అపార నమ్మకం. మేనల్లుడు పగిడిద్ద రాజుతో సమ్మక్క వివాహం చేశాడు మేడరాజు. కాకతీయ ప్రభువుల వద్ద సామంత రాజుగా ఉండేవాడు పగిడిద్ద. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని ముగ్గురు పిల్లలు కలిగారు. కరువు కారణంగా కప్పం కట్టకపోవడంతో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తాడు. సమ్మక్క, సారక్క, నాగమ్మ జంపన్న వేరువేరు ప్రాంతాల నుంచి కాకతీయ సైన్యాలపై సాంప్రదాయ ఆయుధాలతో పోరాడారు. ఆ యుద్ధంలో పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ మరణించారు. పరాజయాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే అది జంపన్న వాగు అయ్యింది. సమ్మక్క కాకతీయ సైన్యంతో ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయేలా విరోచితంగా పోరాడింది. యుద్ధానంతరం చిలుకలగట్టు వైపు వెళ్తూ అంతర్థానమైంది. ఆమె జాడ కోసం వెతకగా.. ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించింది. దానినే సమ్మక్కగా భావించారు. అప్పటి నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క జాతరను నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది.

జాతర తొలిరోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె మీదికి తీసుకొస్తారు. రెండోరోజు చిలుకలగుట్టలో భరణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడోరోజున ఇద్దరూ కొలువు తీరుతారు. నాలుగోరోజు సాయంత్రం ఇరు దేవతలను యుద్ధస్థానానికి పంపిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే పూజలు నిర్వహిస్తారు. జాతరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తూ బంగారాన్ని (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతర తొమ్మిది శతాబ్దాల నాటిది. 1940 తర్వాత తెలంగాణ ప్రజలే కాక మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. లక్షలాదిమంది హాజరయ్యే మహా జాతరిది.

ఉషా కామేష్‌ డొక్కా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని