Vibhuti Dharana: విభూతి మహిమతో పుణ్యలోకంగా మారిన కుంభీపాకం

విభూతి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది. దీనిని ధరించిన వారు నరకాల పాలు కాకుండా స్వామి రక్షిస్తాడు అని నమ్మకం.

Published : 26 Feb 2024 07:20 IST

సర్వపాప విముక్తం త్రిపుండ్రాల ధారణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: శైవులు విభూతిని ధరిస్తుంటారు (Vibhuti Dharana). ముఖానికి, చేతులకు, వక్షస్థలానికి విభూతి రేఖలను అలంకరించుకుంటూ ఉంటారు. విభూతి పరమేశ్వరుడికి (Lord Shiva) ఎంతో ప్రీతికరమైంది. దీనిని ధరించిన వారు నరకాల పాలు కాకుండా స్వామి రక్షిస్తాడని నమ్మకం. దేవీభాగవతం పదకొండో స్కందంలో త్రిపుండ్ర విభూతి విశిష్టతను తెలిపే కథ ఒకటి ఉంది.

ఒకనాడు దూర్వాస మునీంద్రుడు మూడు పుండ్రాలుగా (రేఖలుగా) విభూతిని ధరించి పితృలోకానికి వెళ్లాడు. విభూతి రేఖలు, రుద్రాక్ష మాలికలను ధరించి ఈశ్వరనామ స్మరణ చేసుకుంటూ పితృలోకానికి వెళ్లగానే పితృదేవతలంతా ఎంతో ఆనందంగా ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లారు. అలా ఆ పూజలందుకుంటున్న వేళ ఏవో రోదనలు బిగ్గరగా వినిపించాయి. పితృలోకవాసులను ఆ రోదనల గురించి ప్రశ్నించాడు.

కుంభీపాక నరకం నుంచి ఆర్తనాదాలు

అప్పుడు ఆ దేవతలు తమ లోకానికి సమీపంలో యమలోకం ఉందని, ఆ యమలోకంలోని కుంభీపాక నరకం నుంచి ఆ ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపిస్తుంటాయని చెప్పారు. ఆ ఆర్తనాదాలు వచ్చిన దిశగా ఆ మునీంద్రుడు నడిచాడు. యమలోకం వచ్చింది. అక్కడ మొత్తం ఎనభై ఆరు నరక కూపాలు కనిపించాయి. వాటిలో రోదనలు వస్తున్న కుంభీపాక నరకకూపం ఒడ్డుకు చేరుకొని తొంగి చూశాడు. క్షణంలో ఎంతో విచిత్రం జరిగినట్లనిపించింది. అప్పటిదాకా వినిపిస్తున్న ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ ఆగిపోయి అందుకు విరుద్ధంగా నవ్వులు, కేరింతలు వినిపించాయి. ఆ కూపంలో ఉన్నవారు ఏ మాత్రం శిక్షలు లేకుండా సర్వభోగాలలో తేలిపోతున్నారు. ఆ విచిత్రమేమిటో మునికి అర్థం కాలేదు.

అప్పటివరకు కుంభీపాకంలో పాపులను శిక్షిస్తూ ఉన్న యమదూతలకు విషయం అర్థంకాక ప్రభువైన యముడికి సమాచారం పంపారు. ఆయన వెంటనే మహిష వాహనాన్ని అధిరోహించి కుంభీపాకానికి బయలుదేరుతూ బ్రహ్మ, విష్ణులకు విషయాన్ని తెలపమని చారులను పంపాడు. అంతా కలసి క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ఇలా అయితే వేదనింద చేసినవారు, శివుడిని, దేవతలను నిందించిన వారు, తల్లిదండ్రులను, గురువులను, సత్పురుషులను బాధపెట్టినవారు భూలోకంలోనూ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ లోకంలోకి వచ్చాక స్వర్గసుఖాలనే అనుభవిస్తూ ఉంటే ఇక అధర్మానికి శిక్ష ఎప్పుడు పడాలి? ఎక్కడ పడాలి? అని యముడు బాధపడ్డాడు.అతని బాధను బ్రహ్మదేవుడు, విష్ణువు అర్థం చేసుకున్నారు. కుంభీపాకంలో జరిగిన విచిత్రానికి కారణమేమిటని ఒకరినొకరు చర్చించుకుంటూ సమాధానం దొరకక ఈశ్వరుడి దగ్గరకు వెళ్లారు.

కైలాసంలో సమాధానం

పార్వతీదేవి సమేతమై ఉన్న పరమేశ్వరుడికి నమస్కరించి వెనువెంటనే జరిగిన ఘోరం గురించి తెలిపారు. కుంభీపాక నరకం ఉన్నట్లుండి స్వర్గధామంగా మారిపోయిందని, దానికి కారణమేమిటో తెలియడం లేదని, పాపులంతా అలా స్వర్గసుఖాలను అనుభవించటం ధర్మవిరుద్ధం కదాని విన్నవించారు. శివుడు వారి మాటలను విని.. చిరునవ్వు నవ్వి.. దీనిలో వింత ఏమీ లేదు. నరకకూపం దగ్గరకు దూర్వాసుడు వెళ్లి లోనికి తొంగి చూసిన సమయంలో ముని నుదుటి మీద ఉన్న మూడు విభూతి రేఖల్లోని కొన్ని అణువులు వెళ్లి ఆ కూపంలో పడ్డాయి. ఆ పవిత్ర అణువుల ప్రభావమే ఇది అని చెప్పారు. ఆ సమయంలోనే కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణి కోటి అంతా దివ్య విమానం అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ వారక్కడే ఉంటున్నారు.

పరమేశ్వరుడు ఆ కుంభీపాక కూపాన్ని పితృదేవతలకు పనికి వచ్చే ఉత్తమ తీర్థంగా మార్చారు. ఆ తీర్థం పక్కనే శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించమని చెప్పి ఆ మూర్తులు పూజలందుకుంటారని, ఆ ప్రాంతం పితృతీర్థంగా మారిపోతుందని చెప్పాడు. యముడు చేసేదిలేక పితృలోకానికి చాలా దూరంగా మళ్లీ ఒక కొత్త కుంభీపాక నరక కూపాన్ని నిర్మించి పరిసరాలకు విభూతి ధరించిన శివభక్తులెవరూ రాకుండా కట్టడి చేశాడు. విభూతిలోని కొన్ని కణాలకే అంతటి మహత్తర శక్తి ఉందని ఈ కథ తెలుపుతోంది. అందుకే విభూతిని ధరించటం మనతో పాటు ఇతరులకు శుభాన్ని అందిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని