CM Chandrababu: తొందరపడి టికెట్లు ఇచ్చానేమో..!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Nov 2025 05:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

యువత కదా అని ప్రోత్సహిస్తే రచ్చకెక్కి పరువు తీశారు
ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
వారి వ్యవహారం తేల్చాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశం

ఈనాడు, అమరావతి: ‘పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లు గురించి తెలియనివారికి, రాజకీయ అనుభవం లేనివారికి టికెట్లిస్తే ఇలాంటి సమస్యలే వస్తాయి. నేను కూడా తొందరపడ్డానేమో! వారి వ్యవహారశైలిని కొంతకాలం చూశాక టికెట్లు ఇవ్వాల్సింది. యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో టికెట్లు ఇస్తే పార్టీ పరువు ఇలా బజారుకు ఎక్కిస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) విభేదాలతో రచ్చకెక్కడంపై ఆయన మండిపడ్డారు. వారిద్దరినీ పిలిచి మాట్లాడతామని పార్టీ నాయకులు చెప్పగా.. ఎవర్నీ బతిమలాడాల్సిన పనిలేదని, తీరు మార్చుకోకపోతే ఉపేక్షించబోమని స్పష్టంగా చెప్పాలని చంద్రబాబు పేర్కొన్నారు. వారిద్దరినీ పిలిచి వివరణ తీసుకుని తనకు నివేదించాలని, లండన్‌ పర్యటన నుంచి తిరిగొచ్చాక వారితో మాట్లాడతానని క్రమశిక్షణ కమిటీకి చెప్పారు. ముఖ్యమంత్రి శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నేతలు వర్ల రామయ్య, అశోక్‌బాబు, మంతెన సత్యనారాయణరాజు, బ్యాక్‌ ఆఫీస్‌లోని వివిధ విభాగాలతో సమావేశం నిర్వహించారు.

పార్టీ గుర్తుపైనే గెలిచారని మర్చిపోతే ఎలా?

  • పార్టీ నాయకులు పరస్పర ఆరోపణలతో మీడియాకు ఎక్కడం గతంలో ఎప్పుడూ లేదు. పార్టీ విధానాల్ని అనుసరించకుండా, సొంత ఎజెండాతో వెళ్లాలనుకున్నవారు స్వతంత్రంగా పోటీ చేస్తే వారి సత్తా ఏంటో తెలిసేది. పార్టీ టికెట్‌ ఇచ్చింది కాబట్టే గెలిచామని గుర్తు పెట్టుకోవాలి. 
  • వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనని నాయకుల వివరాలు నాకివ్వండి. ప్రతి నాయకుడి పనితీరు, వ్యవహారశైలిని నమోదు చేస్తున్నాం.  
  • భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం వివరాల నమోదు త్వరలో మొదలవుతుంది. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా తప్పనిసరిగా పాల్గొనాలి.

సీఎంఆర్‌ఎఫ్‌ లేఖలు ఇవ్వడానికీ ఎమ్మెల్యేలకు తీరిక లేదా?

పేదలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఉదారంగా సాయం అందిస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు దానిపైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు అర్హులైన పేద రోగులకూ సీఎంఆర్‌ఎఫ్‌ లేఖలు ఇవ్వడం లేదన్న విషయం సీఎం దృష్టికి తేగా వారి వివరాలు తనకు ఇవ్వాలని, అలాగే అనర్హులకు లేఖలు ఇచ్చినవారి వివరాలూ అందజేయాలని, వారితో మాట్లాడతానని సీఎం పేర్కొన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు సిద్ధమైన తర్వాత కూడా ఎమ్మెల్యేలు వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటున్నారని, గడువు ముగిసిపోవడంతో మళ్లీ చెక్కులు ఇవ్వాల్సి వస్తోందని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి వాటిలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించనన్నారు. మతపరమైన, సున్నితమైన అంశాలపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నాయకులకు సూచించారు. 

మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలి 

తెదేపా నాయకులు మద్యం వ్యాపారానికి దూరంగా ఉండాలని, అలాంటి వారి వల్ల పార్టీకి మరక అంటుతోందని సీఎం వ్యాఖ్యానించారు. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై నాయకులతో చర్చించారు. మొంథా తుపానును దీటుగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేసిన కృషిని పార్టీ పరంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. లండన్‌ నుంచి తిరిగొచ్చాక పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. 


తిరుమల పవిత్రతను మంటగలిపిన వైకాపా నేతలు

ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తితిదేలో కూడా వైకాపా నేతలు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు. ‘కల్తీ నెయ్యి వ్యవహారంతో తిరుమల పవిత్రతను మంటగలిపారు. పరకామణి నుంచి చోరీ వ్యవహారంలో వైకాపా నేతలు నిందితుల్ని కాపాడేలా వ్యవహరించడం సిగ్గుచేటు. వైకాపా నేతలు విపత్కర పరిస్థితుల్లోనూ వికృత మనస్తత్వంతో విషం చిమ్ముతున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్ని స్వర్ణాంధ్ర  కేంద్రాలుగా మార్చాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరిగింది.

Tags :
Published : 01 Nov 2025 05:26 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు