సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!

సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.

Published : 17 May 2024 04:47 IST

భారం పడదని చెబుతూనే.. మిగులు లెక్కలు చూపిన ఏపీఈఆర్‌సీ
ఆ భారాన్ని వినియోగదారులపైనే..


సెకి నుంచి విద్యుత్‌ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీనివల్ల డిస్కంలకు విముక్తి లభిస్తుంది’

సెకి నుంచి విద్యుత్‌ తీసుకునే ప్రతిపాదనల ఆమోదం కోసం డిస్కంల పిటిషన్‌ను ఆమోదిస్తూ ఏపీఈఆర్‌సీ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.


ఈనాడు-అమరావతి: భారత సౌర విద్యుత్తు సంస్థ (సెకి) నుంచి తీసుకునే మిగులు విద్యుత్తు వల్ల వినియోగదారులపై రూ.8,291 కోట్ల భారం పడనుంది. ఒప్పందం ప్రకారం సెకి సంస్థకు యూనిట్‌కు రూ.2.49 చొప్పున చెల్లించే ధర ప్రకారం లెక్కిస్తేనే ఈ మొత్తం అవుతుంది. వాస్తవ విద్యుత్‌ ఉత్పత్తి వ్యయంతో లెక్కిస్తే ఆ భారం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఏటా జూన్‌, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిత్యం విద్యుత్‌ డిమాండ్‌కు మించి వివిధ వనరుల నుంచి విద్యుత్‌ లభిస్తుంది. రాష్ట్రంలోని థర్మల్‌ కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ (విద్యుత్‌ ఉత్పత్తి తగ్గించిన తర్వాత) చేసిన తర్వాత రాబోయే ఏడేళ్ల పాటు మిగులు విద్యుత్తు ఉంటుందని అంచనా వేసింది. ఏపీఈఆర్‌సీ వేసిన అంచనా ప్రకారం ఏడేళ్లలో సుమారు 33,300 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ మిగిలిపోనుంది.

ఈ ఏడాది నుంచే సెకి విద్యుత్‌

సెకి నుంచి ఏటా గరిష్ఠంగా 17 వేల ఎంయూల సౌరవిద్యుత్తు తీసుకునేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అది ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వచ్చే మూడేళ్లలో లభిస్తుంది. ఆ విద్యుత్తును మనం వాడుకోకపోయినా ఏడేళ్ల పాటు భారాన్ని వినియోగదారులే భరించక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. సెకి విద్యుత్‌తో ప్రజలపై ఎలాంటి భారమూ పడబోదని చెప్పిన ఏపీఈఆర్‌సీ.. పరోక్షంగా భారం వేసేలా లెక్కలు చూపుతోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి వచ్చే విద్యుత్తు ఉత్పత్తి ఎంత? దానికి సెకి విద్యుత్తును కూడా కలిపి..రాష్ట్రంలో అప్పటి డిమాండ్‌ ఆధారంగా లెక్కలు వేసింది. ఆ ప్రకారం ఎంత విద్యుత్తు మిగిలే అవకాశం ఉందనేది తేల్చింది. మిగులు విద్యుత్తు సర్దుబాటు కోసం థర్మల్‌ యూనిట్లను పూర్తి సామర్థ్యంలో 40 శాతానికి మించి బ్యాక్‌డౌన్‌ చేయడం సాధ్యం కాదు. ఆ మేరకు ఉత్పత్తి తగ్గించినా ఇంకా మిగులు ఉంటుందని ఏపీఈఆర్‌సీ అంచనా వేసింది. సెకి విద్యుత్తు ఒకసారి గ్రిడ్‌కు అనుసంధానం చేశాక వాడినా.. వాడకున్నా బిల్లు చెల్లించాలి. ఆ మిగులు భారం మొత్తం ప్రజలపైనే పడనుంది.

మెగావాట్‌ సామర్థ్యం గల పవన విద్యుత్తు ప్లాంటు నుంచి ఏడాదికి సగటున 2 ఎంయూల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ ప్రకారం రాష్ట్రంలో ఏడేళ్లలో  సుమారు 33,300 ఎంయూల మిగులు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సెకి సంస్థకు యూనిట్‌కు రూ.2.49 చొప్పున చెల్లించే ధర ప్రకారం లెక్కిస్తేనే రూ.8,291.70 కోట్లు అవుతుంది. ఆ భారాన్ని వినియోగదారులపై ప్రభుత్వం వేయబోతోంది. సెకి విద్యుత్‌ వల్ల ప్రత్యక్షంగా భారం పడకున్నా.. పరోక్షంగా వినియోగదారులే భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు