Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్‌లో 28.54 లక్షల అమ్మకాలు

Automobile Sales: దీపావళి, కొత్త మోడళ్ల విడుదల, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకోవడం వంటి కారణాలతో నవంబర్‌లో వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి.

Published : 06 Dec 2023 15:41 IST

Automobile Sales | దిల్లీ: నవంబర్‌ నెలలో వాహన రిటైల్‌ విక్రయాలు (Automobile retail sales) రికార్డు స్థాయికి చేరాయి. ప్యాసెంజర్‌ వెహికల్స్‌, ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా పుంజుకోవడమే అందుకు దోహదం చేసినట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. 2022 నవంబర్‌లో నమోదైన 24,09,535 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే గత నెలలో 18.45 శాతం పుంజుకొని 28,54,242 యూనిట్లకు చేరాయి. 2020 మార్చిలో నమోదైన 25.69 లక్షల వాహన విక్రయాలే ఇప్పటి వరకు అత్యధికంగా ఉండేవి.

ప్రయాణికుల వాహన రిటైల్‌ విక్రయాలు (Passenger vehicle retail sales) ఏడాది క్రితంతో పోలిస్తే 17 శాతం పెరిగి 3,60,431 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహన విక్రయాలు (Two wheeler retail sales) వార్షిక ప్రాతిపదికన 18,56,108 యూనిట్ల నుంచి 21 శాతం పుంజుకొని 22,47,366 యూనిట్లకు చేరాయి. ఈ రెండు విభాగాల విక్రయాల్లో గత నెలలో రికార్డు నమోదైంది. దీపావళి సహా, కొత్త మోడళ్ల విడుదల నేపథ్యంలో ప్రయాణికుల వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు పుంజుకోవడం, కొత్త మోడళ్లు అందుబాటులోకి రావటంతో ద్విచక్ర వాహన అమ్మకాలు పెరిగినట్లు వెల్లడించారు.

త్రిచక్ర వాహన విక్రయాలు (Three wheeler retail sales) 2023 నవంబర్‌లో వార్షిక ప్రాతిపదికన 23 శాతం పెరిగి 99,890 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 78,720 యూనిట్ల నుంచి 61,969 యూనిట్లకు పడిపోయాయి. వాణిజ్య వాహన రిటైల్‌ విక్రయాలు ఏడాది క్రితంతో పోలిస్తే రెండు శాతం కుంగి 84,586 యూనిట్లకు చేరాయి. పంటలు దెబ్బతినడం, రవాణా డిమాండ్‌ తగ్గడం వంటి కారణాలతోనే వాణిజ్య వాహన విక్రయాలు కుంగినట్లు ఫాడా తెలిపింది.

ద్రవ్య లభ్యత పెరిగిన నేపథ్యంలో ద్విచక్ర వాహన విక్రయాలు (Two wheeler retail sales) స్వల్ప కాలంలో పుంజుకుంటాయని ఫాడా అంచనా వేసింది. దీనికి పెళ్లిళ్ల సీజన్‌ కూడా దోహదం చేస్తుందని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ బాగా ఉంటుందని తెలిపింది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సవాల్‌ విసిరే అవకాశం ఉందని వెల్లడించింది.

ఎన్నికలు ముగియటంతో సిమెంట్‌, బొగ్గు రవాణా సహా ఇతర కార్యకలాపాలు పుంజుకుంటాయని ఫాడా అంచనా వేసింది. ఫలితంగా వాణిజ్య వాహన విక్రయాలు (Commercial Vehicle retail sales) సైతం పెరుగుతాయని తెలిపింది. మరోవైపు సంవత్సరాంతపు ఆఫర్లతో ప్రయాణికుల వాహన అమ్మకాలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు