కారు రుణం ముందే తీర్చేస్తే

అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా..

Published : 17 May 2024 00:42 IST

అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా..

కారు రుణాన్ని గడువుకు ముందే పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించాలనుకున్నప్పుడు ముందుగా రుణదాతకు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటప్పుడు కొంత రుసుములు ఉంటాయని మర్చిపోవద్దు. కాబట్టి, ముందుగానే వీటి గురించి తెలుసుకోండి. బ్యాంకులు/ఆర్థిక సంస్థలను బట్టి ఇది మారుతూ ఉంటుంది. మిగిలిన రుణ మొత్తంపై ఒక శాతం నుంచి ఆరు శాతం వరకూ ఇది ఉండొచ్చు.

  • ముందుగా మీ రుణ ఒప్పందాన్ని ఒకసారి పరిశీలించండి. గడువుకు ముందే రుణం తీర్చడానికి సంబంధించిన షరతులు, నిబంధనలు ఇందులో ఉంటాయి.
  • మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి అంచనా వేయండి. ముందస్తు చెల్లింపు చేయడం వల్ల మీ ఇతర ఆర్థిక లక్ష్యాలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి.
  • రుణ మొత్తం, దానిపై రుసుములు అన్నీ స్పష్టంగా తెలుసుకోండి.
  • ఏ రోజున మీరు చెల్లిస్తారన్నదీ రుణదాతకు స్పష్టంగా చెప్పండి.
  • రుణాన్ని పూర్తిగా తీర్చేసిన తర్వాత,  రుణదాత నుంచి తగిన ధ్రువీకరణలను తీసుకోవడం మర్చిపోవద్దు.

అదనపు చెల్లింపులతో..

కారు రుణానికి నెలవారీ వాయిదాలతో పాటు అప్పుడప్పుడూ అదనంగా కొంత మొత్తం చెల్లించే ప్రయత్నమూ చేయొచ్చు. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల వాహన రుణం 9 శాతం వడ్డీతో 5 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుందాం. దీనికి నెలకు రూ.10,380 వరకూ వాయిదా ఉంటుంది. ఏడాదికి రూ.5,000 అదనంగా చెల్లించడం వల్ల రుణాన్ని 4 ఏళ్ల 7 నెలల్లోనే తీర్చేయొచ్చు. మొత్తం వడ్డీ భారం దాదాపు రూ.10వేల వరకూ తగ్గుతుంది.

ఇవి చూశాకే..

  • మీ దగ్గరున్న అదనపు నిధులను కారు రుణం తీర్చడం కోసమే కాకుండా, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉందా చూసుకోండి. ముఖ్యంగా అధిక వడ్డీ ఉన్న రుణాలను ముందుగా తీర్చడానికి ప్రయత్నించండి.
  • సాధారణంగా 12 నెలల వాయిదాలు చెల్లించిన తర్వాతే రుణాన్ని ముందుగా తీర్చేందుకు అనుమతిస్తారు. కాబట్టి, మిగతా వాయిదాల చెల్లింపు, రుసుముల భారం రెండూ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.
  • మీ రుణదాత అధిక వడ్డీ విధిస్తున్నారు అనిపిస్తే.. మరో సంస్థకు మారే ప్రయత్నం చేయొచ్చు. దీనికి కొన్ని అదనపు రుసుములు తప్పవు.

కారు రుణాన్ని తొందరగా తీర్చేయాలంటే కొంత ఆర్థిక క్రమశిక్షణ అవసరం. కొత్త వాహనాన్ని తీసుకునేటప్పుడే వడ్డీ రేట్లు, రుసుములు ఇతర వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే కారు రుణం భారం కాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని