Google urgent alert: గూగుల్‌ ఎమర్జెన్సీ అలర్ట్‌.. ఆ 2.5 బిలియన్‌ మంది జీమెయిల్ పాస్‌వర్డ్స్ మార్చాల్సిందే!

Eenadu icon
By Business News Team Published : 01 Sep 2025 00:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Google urgent alert | ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ తన 2.5 బిలియన్‌ జీమెయిల్‌ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించింది. దీంతో పాటు టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ (2SV) తప్పనిసరిగా ప్రారంభించుకోవాలని తెలిపింది. హ్యాకింగ్‌ ప్రయత్నాలు గణనీయంగా పెరగడంతో ఈ హెచ్చరిక చేసినట్లు గూగుల్ తెలిపింది. వీటి వెనక షైనీహంటర్స్‌ అనే అంతర్జాతీయ హ్యాకర్ల ముఠా ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది.

2020 నుంచి యాక్టివ్‌గా ఉన్న ఈ గ్రూప్‌పై ఇప్పటికే ఏటీ&టీ, మైక్రోసాఫ్ట్‌, సాంటాండర్‌, టికెట్‌మాస్టర్‌ వంటి సంస్థల డేటా లీక్‌ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హ్యాకర్లు ఫిషింగ్‌ పద్ధతిని ప్రధాన ఆయుధంగా వాడుతున్నట్లు గూగుల్‌ తెలిపింది. నకిలీ ఇమెయిళ్లు పంపి యూజర్లను వేరే లాగిన్‌ పేజీలలోకి మళ్లించడం, సెక్యూరిటీ కోడ్‌లు సహా కీలక సమాచారాన్ని దోచుకోవడం వీరి ప్రధాన వ్యూహం. గూగుల్‌ జూన్‌లోనే ఒక బ్లాగ్‌పోస్ట్‌లో “షైనీహంటర్స్‌ గ్రూప్‌ డేటా లీక్‌ సైట్‌ ప్రారంభించడానికి సిద్ధమవుతోందని భావిస్తున్నాం. దీంతో సున్నిత సమాచార దోపిడీ మరింత పెరిగే అవకాశముంది” అని హెచ్చరించింది. ఆ తరువాత ఆగస్టు 8న ప్రభావితమయ్యే అవకాశం ఉన్న యూజర్లకు ప్రత్యేకంగా మెయిల్స్‌ పంపి అకౌంట్‌ సెక్యూరిటీని తక్షణం పెంచుకోవాలని సూచించింది.

టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ (2SV) తప్పనిసరి

దీని ద్వారా మీ ఇమెయిల్‌కు అదనపు సెక్యూరిటీ అందించొచ్చు. హ్యాకర్లు మీ పాస్‌వర్డ్‌ను తెలుసున్నప్పటికీ భద్రతా కోడ్‌ లేకుండా వారు లాగిన్‌ కాలేరు. ఈ కోడ్‌ సాధారణంగా మీ మొబైల్‌ లేదా నమ్మదగిన డివైజ్‌కు వస్తుంది. “2SV ప్రారంభిస్తే, దొంగలు మీ అకౌంట్‌లోకి చొరబడలేరు. మీ ఇమెయిల్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి ఇది అత్యవసరం” అని బ్రిటన్‌లోని యాక్షన్‌ ఫ్రాడ్‌ కూడా తెలిపింది. “2ఎస్‌వీ ఆన్‌ చేయడం కేవలం కొన్ని నిమిషాల పని. కానీ ఇది సైబర్‌ మోసాలను దరిచేరనీయదు” అని స్టాప్‌ థింక్‌ ఫ్రాడ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఇది జీమెయిల్‌కే పరిమితం కాదు. బ్యాంకింగ్‌, షాపింగ్‌, సోషల్‌ మీడియా అకౌంట్ల వంటి అన్ని ప్రధాన ఆన్‌లైన్‌ సర్వీసుల్లోనూ 2ఎస్‌వీ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో టూ-ఫాక్టర్‌ ఆథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ) లేదా మల్టీ-ఫాక్టర్‌ ఆథెంటికేషన్‌ (ఎంఎఫ్‌ఏ) పేరుతో అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు