Royal Enfield: ‘రీఓన్‌’తో సెకండ్‌ హ్యాండ్ వ్యాపారంలోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

Royal Enfield: తమ బైక్‌లను కస్టమర్లకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా సెకండ్‌ హ్యాండ్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తెలిపింది.

Updated : 05 Dec 2023 13:59 IST

దిల్లీ: ప్రముఖ మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. ‘రీఓన్‌’ (Reown) పేరిట విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం తెలిపింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల కొనుగోలు, విక్రయాలకు ఇవి వేదికగా ఉంటాయని వెల్లడించింది. తమ కంపెనీకి చెందిన పాత మోటార్‌సైకిళ్లను కొనాలన్నా లేదా విక్రయించాలన్నా రీఓన్‌కు రావొచ్చని పేర్కొంది.

ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) బైక్‌ ఉన్నవాళ్లు రీఓన్‌లో ఎక్స్ఛేంజ్‌ కింద అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ని కూడా తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అమ్మకానికి వచ్చిన పాత బైక్‌లను అన్ని రకాలుగా క్షుణ్నంగా తనిఖీ చేస్తామని పేర్కొంది. నాణ్యత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేసింది. తద్వారా దాన్ని కొత్తగా కొనుగోలు చేసేవారికి భరోసా ఇస్తామని చెప్పింది. రీఓన్‌ ఔట్‌లెట్లతో తమ బ్రాండ్‌కు కొత్త కస్టమర్లు వచ్చి చేరతారని ఆశాభావం వ్యక్తం చేసింది. వారికి బైక్‌లను అందుబాటులో ఉంచుతూ.. విశ్వసనీయమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. తొలుత దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలలో రీఓన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు