Tata Motors: సింగూర్‌ ప్లాంట్‌ కేసు.. టాటాకు రూ.766 కోట్లు చెల్లించాలన్న ట్రిబ్యునల్‌

సింగూరులో కార్ల తయారీ ప్లాంటుకు సంబంధించిన కేసులో టాటా మోటార్స్‌కు రూ.766కోట్లు చెల్లించాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆర్బిట్రాల్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువరించింది.

Published : 30 Oct 2023 19:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన కేసులో (Singur Plant) ఆర్బిట్రాల్‌ ట్రిబ్యునల్‌లో టాటా మోటార్స్‌కు (Tata Motors) అనుకూలంగా తీర్పు వచ్చింది. టాటా మోటార్స్‌కు రూ.766కోట్లు చెల్లించాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాన్ని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. 2016 నుంచి 11శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని స్పష్టం చేసింది.

‘సింగూరులో ఆటోమొబైల్‌ తయారీ కేంద్రానికి సంబంధించి ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌ ముందు పెండింగులో ఉన్న కేసు ఏకగ్రీవ తీర్పుతో ముగిసిపోయింది. అక్టోబర్‌ 30, 2023న వచ్చిన ఈ తీర్పు టాటా మోటార్స్‌కు అనుకూలంగా వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (WBIDC) నుంచి రూ.765.78 కోట్లతోపాటు సెప్టెంబర్‌ 1, 2016 నుంచి 11శాతం వార్షిక వడ్డీతో కలిపి రికవరీ చేసుకోవచ్చని అందులో పేర్కొంది. కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.కోటి వసూలు చేసుకోవచ్చు’ అని స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో టాటా మోటార్స్‌ పేర్కొంది.

ఇదిలాఉంటే, టాటా మోటార్స్‌ తీసుకొచ్చిన నానో కారు (Tata Nano) తయారీ యూనిట్‌ను పశ్చిమ బెంగాల్‌లో ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించింది. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం.. సింగూర్‌లో దాదాపు వెయ్యి ఎకరాల మేర వ్యవసాయ భూమిని సేకరించింది. అయితే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలో సింగూర్‌, నందిగ్రామ్‌లో పెద్ద ఉద్యమమే జరిగింది. దీంతో టాటా తమ తయారీ యూనిట్‌ను గుజరాత్‌కు తరలించింది. మూడున్నర దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన వామపక్షాలను గద్దెదించి 2011లో మమత బెనర్జీ అధికారంలోకి రావడానికి ఈ ఉద్యమం ఎంతగానో దోహదపడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని