70రోజుల తర్వాత ఆ మృతదేహాల అప్పగింత

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ముగ్గురు పౌరుల మృతదేహాలను పోలీసులు 70 రోజుల తర్వాత..

Published : 04 Oct 2020 01:29 IST

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ షోపియన్ జిల్లాలో ఓ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ముగ్గురు పౌరుల మృతదేహాలను పోలీసులు 70 రోజుల తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉగ్రవాదులుగా అనుమానించిన పోలీసులు జులై 18న ముగ్గురు యువకులను ఎన్‌కౌంటర్ చేశారు. కాగా శనివారం శ్మశానవాటిక నుంచి వారి మృతదేహాలను వెలికితీసి అంతిమ సంస్కారాల కోసం కుటుంబాలకు అప్పగించారు. రాజౌరీ జిల్లాకు చెందిన యువకుల కుటుంబాలు పోలీసుల చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇంతియాజ్‌ అహ్మద్‌, అబ్రహమ్‌ అహ్మద్‌, మహమ్మద్‌ ఇబ్రార్‌లు కూలీపని కోసం షోపియన్‌కు వెళ్లారని కానీ, వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించి బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొద్ది రోజులుగా తమ బిడ్డల జాడ తెలియలేదని, అనంతరం ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చూసి తెలుసుకున్నామని బాధితుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. కాగా సదరు యువకులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఎలాంటి ఆధారాలు కనుగొనలేకపోయారు. మిలిటెన్సీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఉల్లంఘించి ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు విధుల నుంచి తప్పుకొన్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని