మిస్సింగ్‌ కేసులపై ఆందోళన వద్దు:సజ్జనార్‌

హైదరాబాద్‌లో మిస్సింగ్‌ కేసులపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కోరారు. ఈ కేసుల గురించి మాట్లాడుతూ..చాలామంది

Published : 07 Nov 2020 01:14 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : హైదరాబాద్‌లో మిస్సింగ్‌ కేసులపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కోరారు. ఈ కేసుల గురించి మాట్లాడుతూ.. చాలామంది వ్యక్తిగత సమస్యల కారణంగానే ఇంట్లోంచి వెళ్లిపోతున్నట్లు వివరించారు. వ్యవస్థీకృత పద్ధతిలో ఏమీ జరగటం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి మిస్సింగ్‌ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో.. దర్పణ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌, ఆపరేషన్‌ స్మైల్ వంటివి ఈ రకమైన కేసులను పరిష్కరించటంలో ఎంతో తోడ్పాటునందిస్తున్నట్లు  చెప్పారు.

‘‘ప్రతి మిస్సింగ్‌ కేసునూ ఓ సవాల్‌గా స్వీకరిస్తున్నాం. ప్రతి కేసులోనూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నాం. మనం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మరెక్కడా లేదు. అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌వోటీ, క్రైం వారిని కూడా ఉపయోగించుకుంటున్నాం. తల్లిదండ్రులు తిట్టారని, అప్పుల బాధ తాళలేక, ఇతరత్రా సమస్యలతో ఇల్లు విడిచి వెళ్లిపోయిన కేసులు చాలా ఉంటున్నాయి. ఇటీవల ఇలాంటి కేసులనూ చాలా పరిష్కరించాం ’’ అని సీపీ వివరించారు.

ఇంట్లోంచి వెళ్లిపోవటం పరిష్కారం కాదు...

‘‘ముఖ్యంగా నేను చెప్తున్నదొకటే. ఈ రోజు...మనం ఈ స్థితిలో ఉన్నామంటే అందుకు తల్లిదండ్రులే కారణం. ఎన్నో కష్టాలకు ఓర్చి చదివిస్తారు. ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటారు. కోపంతో ఏదైనా మాట అంటే బాధపడొద్దు. వారు మీ మంచి కోసమే తిడతారు. మీకు చెడు జరగాలని ఎప్పుడూ అనుకోరు. వారికి మీరే ప్రపంచం. మీరు కనిపించకుండా పోతే వారు తట్టుకోలేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలి. కానీ...ఇంట్లోంచి వెళ్లిపోవటం సరికాదు. అలా వెళ్లటం వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఉన్న సమస్యల గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి’’ అని సజ్జనార్‌ అన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని