Andhra News: పెళ్లి ఇష్టం లేకనే కాబోయే వరుడిపై కత్తితో దాడి: అనకాపల్లి డీఎస్పీ

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కాబోయే వరుడిపై యువతి కత్తితో దాడి చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ సునీల్‌ వెల్లడించారు.

Updated : 19 Apr 2022 22:22 IST

బుచ్చయ్యపేట: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కాబోయే వరుడిపై యువతి కత్తితో దాడి చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ సునీల్‌ వెల్లడించారు. గిఫ్ట్‌ ఇస్తానంటూ కళ్లకు గంతలు కట్టి అనకాపల్లి జిల్లాలో కాబోయేవాడి కంఠం కోసిన ఘటన సోమవారం కలకలం రేగిన విషయం తెలిసిందే. యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడిన యువతి పుష్పను ఇవాళ అనకాపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కత్తితో దాడి చేసింది తానేనని యువతి ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఈ  కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఎస్‌ఐ రామకృష్ణతో కలిసి డీఎస్పీ సునీల్‌ మీడియాకు వివరించారు. పుష్పను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు చెప్పారు.

డీఎస్పీ మాట్లాడుతూ.. ‘‘రామునాయుడు, పుష్పకు మే 20న వివాహం నిశ్చయించారు. అమ్మాయి, అబ్బాయి కలిసి సోమవారం స్కూటీపై బయటకి వెళ్లారు. తల్లిదండ్రుల అనుమతితోనే ఇద్దరు బయటకి వెళ్లారు. వడ్డాది వద్ద స్కూటీ ఆపి గిఫ్ట్‌ కొంటానని పుష్ప షాప్‌లోకి వెళ్లింది. ఏం కొన్నావని అడిగితే అబ్బాయికి చెప్పలేదు. యువకుడిని విశ్వశాంతి జ్యోతిర్మయి ఆశ్రమం వద్దకు తీసుకెళ్లింది. బహుమతి ఇస్తాను.. కళ్లు మూసుకో అని అబ్బాయికి చెప్పింది. అబ్బాయి కళ్లు మూసుకుంటే సరిగ్గా మూసుకోలేదని కళ్లకు చున్నీ కట్టింది. చున్నీతో కట్టిన తర్వాత తనతో తీసుకొచ్చిన చాకుతో అబ్బాయి గొంతు కోసింది. పెళ్లి ఇష్టం లేకనే గొంతు కోసినట్లు అబ్బాయితో చెప్పింది. ఆత్మహత్య చేసుకుంటుందేమోనని యువతితో సహా రామునాయుడు బయలుదేరాడు. స్థానికులు గమనించి యువకుడిని ఆస్పత్రిలో చేర్చారు. ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని యువతి చెప్పింది. దైవ చింతనతో ఓంశాంతి ఆశ్రమంలో జీవితం గడపాలని యువతి భావిస్తోంది. పెళ్లి చేసుకోనంటే పెద్దలు ఒప్పుకోరేమోనని దాడి చేసినట్లు తెలిపింది. యువతిపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ఈ కేసులో వేరే వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్యాయత్నానికి యువతి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం’’ అని డీఎస్పీ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని