మరణం ఎదురొచ్చింది.. నలుగురు అక్కచెల్లెళ్లు సహా ఏడుగురి దుర్మరణం

పుణ్యక్షేత్రాలను దర్శించుకుని స్వస్థలాలకు బయలుదేరిన వారిని లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు కబళించింది.

Updated : 16 May 2023 08:17 IST

వైయస్‌ఆర్‌ జిల్లాలో ఘోరం

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, కొండాపురం: పుణ్యక్షేత్రాలను దర్శించుకుని స్వస్థలాలకు బయలుదేరిన వారిని లారీ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు కబళించింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం సంభవించింది. వైయస్‌ఆర్‌ జిల్లా కొండాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ తుపాను వాహనాన్ని ఢీకొట్టడంతో ఏడుగురు చనిపోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు, కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన బంధువులంతా కలిసి ఈ నెల 13న తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకోవడంతోపాటు పలు ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఆదివారం రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మరో అరగంటలో తాడిపత్రి చేరుకుంటారనగా వైయస్‌ఆర్‌ జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద సోమవారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న తుపాను వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన డ్రైవరు సహా ఐదు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది.

తుపాను వాహనంలో ప్రయాణిస్తున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వెంకటలక్ష్మి (55), ఆమె కుమారుడు, వార్డు వాలంటీరు సునీల్‌కుమార్‌రెడ్డి (26), డ్రైవర్‌ భూమిరెడ్డి సుధాకర్‌రెడ్డి (32), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కాటసాని సుభద్ర (35), ఆమె కుమారుడు కాటసాని నితిన్‌రెడ్డి (11), లక్ష్మీదేవి (38), వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగుకు చెందిన సుమలత (37) మృతిచెందారు. వీరిలో వెంకటలక్ష్మి, సుమలత, లక్ష్మీదేవి, సుభద్ర నలుగురూ అక్కచెల్లెళ్లు. వీరి మరో సోదరి జయలక్ష్మి గాయపడి, చికిత్స పొందుతున్నారు. మృతదేహాలన్నీ వాహనంలో చిక్కుకుపోవడంతో స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. మృతదేహాలకు తాడిపత్రి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. వీరిలో మేఘన, శిల్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: చంద్రబాబు

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సనందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని