Penamaluru: మిస్టరీ.. కాల్వలో మునిగిన కారు.. యజమాని అదృశ్యం!

కారు కాల్వలో మునిగి ఉంది. వాహన యజమాని దుస్తులు అందులోనే ఉన్నాయి. కానీ అతని ఆచూకీ మాత్రం లభ్యమవలేదు.

Updated : 18 Jul 2023 09:07 IST

పెనమలూరు, న్యూస్‌టుడే : కారు కాల్వలో మునిగి ఉంది. వాహన యజమాని దుస్తులు అందులోనే ఉన్నాయి. కానీ అతని ఆచూకీ మాత్రం లభ్యమవలేదు. సోమవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద జరిగిన ఈ ఘటనపై మిస్టరీ నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజుల రత్నభాస్కర్‌(43) అవనిగడ్డ నివాసి. బంటుమిల్లి సమీప రామవరపుమూడిలో ఐస్‌ కోల్డ్‌ స్టోరేజీ నిర్వహిస్తున్నారు. అతడికి  భార్య, కుమార్తె ఉన్నారు. మచిలీపట్నంలో జరుగుతున్న ఓ రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్తున్నట్లు ఇంట్లో తెలిపి ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సోమవారం వేకువజామున పెదపులిపాక వంతెన సమీపంలో ఇతని కారు స్థానిక కరవు కాల్వలో పైకప్పు వరకూ మునిగిపోయి ఉండగా హెడ్‌ లైట్లు వెలుగుతున్నట్లు నీటిలో కనిపించడంతో అటుగా వెళ్తున్న ఇసుక లారీ డ్రైవర్‌ గుర్తించి 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. పెనమలూరు ఎస్‌ఐ అర్జున్‌, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. అప్పటికే వాహనం తలుపు తెరచి ఉండగా, జత దుస్తులు డ్రైవర్‌ సీటు కింద ఉన్నాయి. డాష్‌బోర్డులో పత్రాలను పరిశీలించగా కారు రత్నభాస్కర్‌దిగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మచిలీపట్నంలో సమావేశానికి హాజరైన ఇతను పెదపులిపాక ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఏదైనా వ్యూహం ఉందా అనే కోణాల్లో పోలీసులు దృష్టి సారించారు. కారులో రత్నభాస్కర్‌ ఒక్కడే ఉన్నారా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అతడి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా కోసం యత్నిస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల వరకు ఇతను మచిలీపట్నంలోనే ఉన్నట్లు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ చూపుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్లు నిర్ధారించుకున్నారు. రత్నభాస్కర్‌ కారు దిగి వెళ్లిపోయారా? లేక కాల్వలో గల్లంతయ్యారా? అన్నది మిస్టరీగా మారింది. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని