వైయస్‌ఆర్‌ జిల్లాలో అర్ధరాత్రి మహిళా ఎస్‌ఐపై దాడి

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా మహిళా ఎస్‌ఐ హైమావతిపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు.

Updated : 10 Dec 2023 09:24 IST

కాలికి గాయం... పగిలిపోయిన సెల్‌ఫోన్‌
ఇసుకాసురుల పనేనని అనుమానం?

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా మహిళా ఎస్‌ఐ హైమావతిపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేశారు. ఆమె కాలికి గాయమైంది. సెల్‌ఫోన్‌ పగిలిపోయింది. రామేశ్వరం బైపాస్‌ రోడ్డులోని రెండు కుళాయిల సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రతిరోజూ తెల్లవారుజామున, రాత్రి సమయంలో పెన్నానది నుంచి అనేక ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న ఎస్‌ఐ హైమావతికి ఇసుక అక్రమ రవాణాపై సమాచారం రావడంతో రక్షక్‌ వాహనంలో కానిస్టేబుల్‌తో కలిసి బైపాస్‌ రోడ్డు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వారిని ఆపే ప్రయత్నం చేశారు. కాసేపటి తరువాత ఇద్దరు వ్యక్తులు మళ్లీ వచ్చి మమ్మల్ని ఆపుతారా అంటూ ఎస్‌ఐపై రాయి విసిరి బైక్‌లో పరారయ్యారు. విషయం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ దృష్టికి వెళ్లడంతో నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులను ఆదేశించారు. ఎస్‌ఐపై దాడి చేసిన వ్యక్తులు ఇసుకాసురులే కావొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి ఘటనపై ఎస్‌ఐ హైమావతి గ్రామీణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని