అనిశాకు చిక్కిన ఎంపీడీవో, సీనియర్‌ అసిస్టెంట్‌

లంచం తీసుకున్న కేసులో ఎంపీడీవో, సీనియర్‌ అసిస్టెంట్‌లను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ నిజామాబాద్‌ జిల్లా డీఎస్పీ శేఖర్‌ తెలిపారు.

Published : 27 Mar 2024 03:51 IST

కమ్మర్‌పల్లి, న్యూస్‌టుడే: లంచం తీసుకున్న కేసులో ఎంపీడీవో, సీనియర్‌ అసిస్టెంట్‌లను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ నిజామాబాద్‌ జిల్లా డీఎస్పీ శేఖర్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కమ్మర్‌పల్లి మండల ఏపీవోగా పని చేసిన రావుట్ల భాగయ్య మూడు నెలల కిందట ఇందల్‌వాయికి బదిలీపై వెళ్లారు. తన సర్వీస్‌ రిజిస్టర్‌ పుస్తకాన్ని పంపించాలని అప్పటి కమ్మర్‌పల్లి ఎంపీడీవో సంతోష్‌రెడ్డికి పలుమార్లు విన్నవించారు. పుస్తకం ఇవ్వడానికి ఎంపీడీవో రూ.10 వేల లంచం డిమాండ్‌ చేశారు. ఎంపీడీవో కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు బదిలీపై వెళ్లినా సర్వీస్‌ రిజిస్టర్‌ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. లంచం ఇస్తేనే ఆర్‌సీ ఇవ్వాలని సీనియర్‌ అసిస్టెంట్‌ హరిబాబును ఆదేశించి వెళ్లారు. దీంతో ఏపీవో భాగయ్య రూ.8 వేలు ఇవ్వడానికి అంగీకరించారు. ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం కమ్మర్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంలో రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా సీనియర్‌ అసిస్టెంట్‌ హరిబాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భిక్కనూరులో ఎంపీడీవో సంతోష్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని కమ్మర్‌పల్లికి తీసుకొచ్చారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని