ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీల మృతి

ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది.

Published : 06 May 2024 02:54 IST

పెద్దపల్లి జిల్లా మియాపూర్‌లో ఘటన

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ బోల్తాపడి ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సుబ్బారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌ మండలం చిన్నబొంకూర్‌కు చెందిన మల్యాల వెంకటేశ్‌ మియాపూర్‌ గ్రామ శివారులో రెండెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశారు. కంకుల పొట్టు తీయడానికి సొంత ట్రాక్టర్లో తన భార్యతో సహా గ్రామానికి చెందిన 8 మంది మహిళా కూలీలను తీసుకెళ్లారు. పనులు ముగిసిన తర్వాత అదే ట్రాక్టర్‌లో మొక్కజొన్న కంకులతోపాటు కూలీలను ఎక్కించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంమధ్యలో ట్రాక్టర్‌ అదుపుతప్పి ఎస్సారెస్పీ డీ86 ఉపకాల్వ 33ఎల్‌ కాల్వలో బోల్తా పడింది. ప్రమాదంలో పోచంపల్లి రాజమ్మ(55), భేతి లక్ష్మి(52) అక్కడికక్కడే మృతిచెందగా.. మల్యాల వెంకటేశ్‌ భార్య వైష్ణవి(32)ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందారు. మరో అయిదుగురు కూలీలు గాయాలతో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకటేశ్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని