Crime News: ప్రేమకు నిరాకరణ.. గంజాయి గిఫ్ట్‌ ఇచ్చి పోలీసులకు పట్టించాడు

ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతి (గిఫ్ట్‌) పేరుతో గంజాయి ప్యాకెట్‌ ఇచ్చి చివరకు కటకటాలపాలయ్యాడు ఓ యువకుడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ వర్గాల కథనం ప్రకారం..

Updated : 22 Oct 2021 08:35 IST

కక్షతో యువతిని ఇరికించే కుట్ర
మూడేళ్ల తర్వాత నిందితుడి అరెస్టు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతి (గిఫ్ట్‌) పేరుతో గంజాయి ప్యాకెట్‌ ఇచ్చి చివరకు కటకటాలపాలయ్యాడు ఓ యువకుడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ వర్గాల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన వినయ్‌కుమార్‌(25) ప్రైవేట్‌ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తున్నాడు. తనతోపాటు చదువుకున్న అదే ప్రాంతానికి చెందిన యువతికి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష తీర్చుకోవాలని కుట్ర పన్నాడు. ఈవెంట్స్‌ నిర్వాహకురాలు అయిన ఆమె ఆ పనిపై 2018 మే 31న మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి శిర్డీసాయి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరింది. ఇది తెలుసుకుని వచ్చిన అతడు.. స్నేహానికి గుర్తుగా గిఫ్ట్‌ అని నమ్మించి 3 కిలోల గంజాయి ప్యాకెట్‌ చేతికిచ్చాడు. మరుసటిరోజు రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకునే ముందే.. ఆ యువతి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు జీఆర్పీ వారికి సమాచారం అందించాడు. రైలు స్టేషన్‌కు రాగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడినంటూ.. గిఫ్ట్‌ ప్యాకెట్‌ రూపంలో గంజాయి ఇచ్చి ఆమెను మోసం చేసినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణకొచ్చారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాలతో ఆ యువతిని వదిలిపెట్టారు.

అదేరోజు వినయ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు చిక్కకుండా అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. కేసేమీ లేదని, కేవలం సమాచారం కోసం మాట్లాడాల్సి ఉందని జీఆర్పీ అధికారులు పిలిపించగా గురువారం స్టేషన్‌కు వచ్చాడు. విచారణలో గంజాయిని గిఫ్ట్‌ ప్యాకెట్‌ రూపంలో ఇచ్చింది తానేనని అంగీకరించాడు. అతడిని అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని