Telangana News: తల్లీకుమారుల ఆత్మాహుతి ఘటన.. పూచీకత్తే ఉసురు తీసింది

తన స్నేహితుడి రుణానికి పూచీకత్తుగా ఉండటమే గంగం సంతోష్‌, అతడి తల్లి పద్మల ఆత్మహత్యకు దారితీసిందని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా..

Published : 21 Apr 2022 09:11 IST

పోలీసుల నివేదిక
ఆరుగురు నిందితులకు రిమాండ్‌
పరారీలో సీఐ నాగార్జునగౌడ్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి; న్యూస్‌టుడే, కామారెడ్డి నేరవిభాగం: తన స్నేహితుడి రుణానికి పూచీకత్తుగా ఉండటమే గంగం సంతోష్‌, అతడి తల్లి పద్మల ఆత్మహత్యకు దారితీసిందని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి, కుమారుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లాడ్జిలో ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిని బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా కేంద్రంలోని 9వ అదనపు న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. అనంతరం నిందితులను నిజామాబాద్‌ జిల్లా జైలుకు తరలించారు.  

నిందితులకు రాచమర్యాదలా..

నిందితులను బుధవారం ఉదయమే కోర్టులో హాజరుపరచకుండా తాత్సారం చేయడం, వైద్యపరీక్షలు పూర్తయ్యాక న్యాయస్థానానికి కాకుండా మళ్లీ ఠాణాకు తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నిందితులకు రాచమర్యాదలు చేస్తున్నారంటూ భాజపా నాయకులు ఠాణా ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో స్టేషన్‌ ఆవరణలో వేచి ఉన్న విలేకరులపై ఏఎస్పీ అన్యోన్య దురుసుగా ప్రవర్తించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మండిపడ్డారు. ఆయన తీరును నిరసిస్తూ పాత్రికేయులు కూడా ఆందోళన చేపట్టారు.

సీఐ పరారీపై అనుమానాలు

ఈ కేసులో మరో నిందితుడైన సీఐ నాగార్జునగౌడ్‌ మొన్నటి వరకు యథావిధిగా విధులు నిర్వహించగా, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు రిమాండు రిపోర్టులో పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. పోలీస్‌శాఖకు సంబంధించిన వ్యక్తి కావడం వల్లే అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని