icon icon icon
icon icon icon

Btech Ravi: జగన్‌ ఏ స్థాయికి దిగజారిపోయారో ప్రజలు ఆలోచించాలి: బీటెక్‌ రవి

రాష్ట్రంలో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెదేపా నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్‌ రవి విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని ఆయన ఊదరగొడుతున్నారన్నారు.

Updated : 26 Apr 2024 14:36 IST

కడప: రాష్ట్రంలో పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెదేపా నేత, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్‌ రవి విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం జరుగుతోందని ఆయన ఊదరగొడుతున్నారన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా నేత శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. 

ఎన్నికల అఫిడవిట్‌లో సుమారు రూ.750కోట్ల ఆస్తులు ఉన్నట్లు జగన్‌ పేర్కొన్నారని.. ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తి దాదాపు రూ.80 లక్షలు మాత్రమేనని బీటెక్‌ రవి చెప్పారు. దీన్ని బట్టి పేదవాడు ఎవరో? పెత్తందారు ఎవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. నుదిటికి ప్లాస్టర్‌తో వచ్చి పులివెందులలోనూ సానుభూతి సంపాదించాలనుకుంటున్నారా?.. ఇక్కడి ప్రజలు అంత అమాయకులని భావిస్తున్నారా?అని ధ్వజమెత్తారు. 

సొంత చెల్లెలు షర్మిల వస్త్రధారణపై జగన్‌ చాలా అసభ్యకరంగా మాట్లాడారని.. ఏ స్థాయికి ఆయన దిగజారిపోయారో ప్రజలు ఆలోచించాలని బీటెక్‌ రవి కోరారు. ‘‘సీఎం సతీమణి భారతి పసుపు వస్త్రాలు ధరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఆ రంగు చీరలను బయట పడేస్తారా? వివేకాకు రెండో పెళ్లి జరగలేదా? అంటూ సొంత చిన్నాన్న గురించి పులివెందులలోనే మాట్లాడటం సిగ్గుచేటుగా లేదా? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే జగన్‌కు ఈ విషయం తెలుసు.. అయినా ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇచ్చారు? అప్పుడు వివేకా వ్యక్తిత్వం గుర్తురాలేదా? ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ మేం ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడలేదు. కానీ సొంత అన్న కుమారుడే వివేకాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం’’ అని బీటెక్‌ రవి అన్నారు.  

వివేకా హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్‌కు సీఎం జగన్‌ ఏవిధంగా సర్టిఫికెట్‌ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. విధిలేని పరిస్థితుల్లోనే చిన్నపిల్లాడు, అమాయకుడని అవినాష్‌ను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. జగన్‌ నామినేషన్‌కు డబ్బు, మద్యం ఇచ్చి జనసమీకరణ చేశారని బీటెక్‌ రవి అన్నారు. సీఎం అహంకారానికి, సొంత నియోజకవర్గం పట్ల చూపిన నిర్లక్ష్య వైఖరికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img