ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలు!

దేశ పౌరుల ఆకాంక్షలకు, ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వాలను బాధ్యతాయుతంగా సాగనిచ్చే ప్రజాస్వామ్య సాధనాలు రాజకీయ పార్టీలు. అవి భిన్న   సిద్ధాంతాలను, ఆసక్తులను ప్రతిబింబిస్తాయి. వివిధ సామాజిక సమూహాలను రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేస్తాయి

Published : 26 Apr 2024 00:26 IST

ఇండియన్‌ పాలిటీ

దేశ పౌరుల ఆకాంక్షలకు, ఆశయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రభుత్వాలను బాధ్యతాయుతంగా సాగనిచ్చే ప్రజాస్వామ్య సాధనాలు రాజకీయ పార్టీలు. అవి భిన్న   సిద్ధాంతాలను, ఆసక్తులను ప్రతిబింబిస్తాయి. వివిధ సామాజిక సమూహాలను రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేస్తాయి. విధానాలను రూపొందించి, ఎన్నికల్లో పోటీ చేసి  పాలనను ప్రభావితం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూలస్తంభాలుగా వ్యవహరించే ఆ  పార్టీల గుర్తింపు, వర్గీకరణ, జాతీయహోదా తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు దేశంలోని జాతీయ పార్టీలు, వాటి విభాగాలు  మొదలైన వివరాలపైనా అవగాహన పెంచుకోవాలి.

భారతదేశంలో రాజకీయ పార్టీలు

లలు లేని సముద్రాన్ని, రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించడం కష్టం.. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో అవి కీలకంగా వ్యవహరిస్తాయి.

రాజకీయ పార్టీలకు గుర్తింపు:  భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 29(A) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపునిస్తుంది. ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం 100 మంది ఓటర్ల సంతకాల మద్దతు ఉండాలి. దాంతో పాటు రూ.10,000 డిపాజిట్‌గా చెల్లించి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ‘రాజకీయ పార్టీ’గా నమోదు చేసుకోవాలి.

  • మనదేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు. రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న  ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19(1)(C)  ప్రకారం ‘సంఘాలు లేదా అసోసియేషన్లు’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని పౌరులు ‘రాజకీయ పార్టీలను’ స్థాపించుకోవచ్చు.
  • రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్‌ను చేర్చి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టంలో ‘రాజకీయ పార్టీలు’ అనే అంశాన్ని పేర్కొన్నారు.

వర్గీకరణ:  భారతదేశంలో రాజకీయ పార్టీలను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 1) జాతీయ పార్టీ 2) రాష్ట్ర-ప్రాంతీయ పార్టీ

జాతీయ పార్టీ - గుర్తింపునకు షరతులు:  ఒక రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే కింద పేర్కొన్న షరతుల్లో ఏదైనా ఒకదాన్ని నెరవేర్చాలి. ఎ) గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలకుగాని, రాష్ట్ర శాసనసభ స్థానాలకుగాని 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు పోటీ చేసి ఉండాలి. పోలై చెల్లుబాటు అయిన ఓట్లలో 6% కంటే తక్కువ కాకుండా ఓట్లను సాధించాలి. దీంతోపాటు ఏ రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి అయినా కనీసం నలుగురు అభ్యర్థులు లోక్‌సభకు ఎన్నిక కావాలి. లేదా బి) గత సాధారణ ఎన్నికల్లో  లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం (11) సీట్లు గెలుచుకోవాలి. ఈ అభ్యర్థులు కనీసం 3 వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి. లేదా సి) కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి.

జాతీయ పార్టీ హోదా - కొత్త నియమాలు: 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీఐ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)ల జాతీయ పార్టీ హోదా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నియమాలను రూపొందించింది. దీని ప్రకారం వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో నిర్దేశించిన ఓట్లు, సీట్లు సాధించకపోతే ‘జాతీయ పార్టీ హోదా’ రద్దవుతుంది.

జాతీయ రాజకీయ పార్టీ హోదా వల్ల కలిగే ప్రయోజనాలు

  • నామినేషన్ల సమయంలో అభ్యర్థికి ప్రతిపాదకులు ఒక్కరు ఉంటే సరిపోతుంది.
  • జాతీయ పార్టీ ఎన్నికల గుర్తును ఇతర పార్టీలకు కేటాయించరు.
  • దూరదర్శన్‌, ఆలిండియా రేడియోలో ఉచితంగా ప్రసార సమయం కేటాయిస్తారు.
  • రెండుసెట్ల ఓటర్ల జాబితా కాపీలను అభ్యర్థులకు ఉచితంగా అందిస్తారు.
  • 40 మంది ప్రధాన ప్రచారకర్తల ప్రచార ఖర్చును అభ్యర్థి ప్రచార ఖర్చులో కలపరు.
  • అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కొత్తగా జాతీయ పార్టీ హోదాను పొందింది.

జాతీయ పార్టీ హోదా పొందిన రాజకీయ పార్టీలు: ప్రస్తుతం జాతీయ పార్టీ హోదా పొందిన పార్టీలు ఆరు. అవి 1) భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)  2) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 3) బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) 4) నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీసీ)  5) కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) (సీపీఐ-ఎం) 6) ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)

ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ): ఐఎన్‌సీని 1885, డిసెంబరు 28న ఎ.ఒ.హ్యూమ్‌ స్థాపించారు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశంలో సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో రాజకీయ సంస్థగా ‘భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ)’ అవతరించింది. 1955లో మద్రాస్‌ సమీపంలోని ఆవడి వద్ద జరిగిన ఐఎన్‌సీ  సమావేశంలో సామ్యవాద తరహా ప్రజాస్వామ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు.

  • అధికార పత్రిక - కాంగ్రెస్‌ అన్వేష్‌ నీ శ్రామిక విభాగం - ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌
  • యూత్‌ విభాగం - ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌
  • ఎన్నికల గుర్తు - హస్తం (మువ్వన్నెల జెండా మధ్యలో హస్తం) నీ కూటమి - యూపీఏ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ):  1980, ఏప్రిల్‌ 6న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే అడ్వాణీ స్థాపించారు. సామాజిక సంప్రదాయవాదం, హిందూత్వం, జాతీయవాదం, గాంధేయవాద సామ్యవాదం మొదలైనవి ఈ పార్టీ సిద్ధాంతాలు.

  • అధికార పత్రిక - కమల్‌ సందేశ్‌ నీ యూత్‌ విభాగం - భారతీయ జనతా యువ మోర్చా
  • రైతు విభాగం - బీజేపీ కిసాన్‌ మోర్చా నీ మహిళా విభాగం - బీజేపీ మహిళా మోర్చా
  • ఎన్నికల గుర్తు - కమలం (ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన జెండా మధ్యలో కమలం పువ్వు)
  • కూటమి - ఎన్‌డీఏ.

బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ):  1984, ఏప్రిల్‌ 14న కాన్షీరాం స్థాపించారు. సామాజిక న్యాయం, స్వగౌరవం, సామ్యవాద సమానత్వం, లౌకికవాదం, మానవ హక్కులు మొదలైనవి ఈ పార్టీ సిద్ధాంతాలు. బహుజనులు అంటే అధిక సంఖ్యాకులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) అని అర్థం. వీరు దేశంలోని మొత్తం జనాభాలో 85% ఉన్నారు.నీ ఎన్నికల గుర్తు - ఏనుగు నీ ప్రస్తుతం ఈ పార్టీ మాయావతి ఆధ్వర్యంలో నడుస్తోంది.

నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ):  2012, జులైలో పి.ఎ.సంగ్మా స్థాపించారు. 2019, జూన్‌ 7న జాతీయ పార్టీ హోదా పొందింది. ఈశాన్య భారతదేశం నుంచి జాతీయ పార్టీ హోదాను పొందిన తొలి రాజకీయ పార్టీ.

ఎన్నికల గుర్తు - పుస్తకం.

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) (సీపీఐ-ఎం):  1964, నవంబరు 7న జ్యోతిబసు, ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ స్థాపించారు. కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం మొదలైన సిద్ధాంతాల ఆధారంగా ఈ పార్టీ ఏర్పడింది.

  • అధికార పత్రిక - పీపుల్స్‌ డెమొక్రసీ
  • యూత్‌ విభాగం - డెమొక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా
  • శ్రామిక విభాగం - సెంటర్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌
  • విద్యార్థి విభాగం - స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా
  • రైతు విభాగం - ఆలిండియా కిసాన్‌ సభ
  • మహిళా విభాగం - ఆలిండియా డెమొక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌
  • న్నికల గుర్తు - సుత్తి, కొడవలి, నక్షత్రం.

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌):  2012, నవంబరు 26న అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించారు. ఈ పార్టీ ఎన్నికల గుర్తు చీపురు. 2023, ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఈ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది. ప్రస్తుతం ఈ పార్టీ దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో కొనసాగుతోంది. గోవా, గుజరాత్‌ రాష్ట్రాల శాసనసభల్లోనూ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.

జాతీయ పార్టీ హోదా రద్దు అయిన పార్టీలు:  2023, ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం మూడు రాజకీయ పార్టీల జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అవి
1)  ఏఐటీసీ 2) ఎన్‌సీపీ 3) సీపీఐ

ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ (ఏఐటీసీ): 1998, జనవరి 1న మమతా బెనర్జీ స్థాపించారు. ఈమె ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రి.
రాజకీయ నినాదం - మా, మాటి, మనుష్‌ (Mother, Land, People)

  • పత్రిక - జాగోబంగ్లా నీ విద్యార్థి విభాగం - తృణమూల్‌ ఛాత్ర పరిషత్‌ నీ రైతు విభాగం - ఆలిండియా తృణమూల్‌ కిసాన్‌ కాంగ్రెస్‌
  • శ్రామిక విభాగం - ఇండియన్‌ నేషనల్‌ తృణమూల్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌
  • ఈ పార్టీ 2016, సెప్టెంబరు 2న జాతీయ పార్టీ హోదా పొందింది. 2023లో కోల్పోయింది.నీ ఎన్నికల గుర్తు - గడ్డిపూలు

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ): 1999, మే 25న శరద్‌ పవార్‌ ఈ పార్టీని స్థాపించారు.

  • విద్యార్థి విభాగం - నేషనలిస్ట్‌ స్టూడెంట్‌ కాంగ్రెస్‌
  • యూత్‌ విభాగం -  నేషనలిస్ట్‌ యూత్‌ కాంగ్రెస్‌
  • మహిళా విభాగం  - నేషనలిస్ట్‌ మహిళా కాంగ్రెస్‌
  • ఎన్నికల గుర్తు - గోడ గడియారం

కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ):  1925, డిసెంబరు 25న ఎస్‌.ఎ.డాంగే,  ఎం.ఎన్‌. రాయ్‌ కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల ఆధారంగా పార్టీని స్థాపించారు.

  • అధికార పత్రికలు - న్యూ ఏజ్‌ (ఆంగ్లం), ముల్కీ సంఘర్ష్‌ (హిందీ)
  • విద్యార్థి విభాగం - ఆలిండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌)
  • శ్రామిక విభాగం - ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాన్ఫరెన్స్‌ (ఏఐటీయూసీ)
  • మహిళా విభాగం - నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఉమెన్‌
  • యూత్‌ విభాగం - ఆలిండియా యూత్‌ ఫెడరేషన్‌
  • ఎన్నికల గుర్తు - వరి కంకి, కొడవలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని