45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ

అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు.

Updated : 26 Apr 2024 07:41 IST

కూకట్‌పల్లిలో హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు

ఈనాడు- హైదరాబాద్‌, మూసాపేట, న్యూస్‌టుడే: అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. వేలిముద్రలు, జాగిలాలు, నేర చరిత్ర ఆధారంగా నిందితుల్ని గుర్తించాలనుకున్నా ఆచూకీ చిక్కలేదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూకట్‌పల్లి పోలీసులు.. నిందితులు వాహనంలో ప్రయాణించిన మార్గాల ఆధారంగా 45 కిలోమీటర్ల మేర దాదాపు 1200 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. బైకు నంబరు పసిగట్టి నిందితుల్ని కనిపెట్టారు. కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో మహిళ హత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. నిందితుల్లో ఒకరు మైనరు. కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ డి.కృష్ణమోహన్‌తో కలిసి ఏసీపీ కె.శ్రీనివాసరావు గురువారం వివరాలను వెల్లడించారు.

అత్యాచారం.. హత్య..: ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన మహిళ(45).. భర్త చనిపోవడంతో కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చి ఒంటరి జీవితం గడుపుతోంది. మూసాపేట వై జంక్షన్‌లోని వాహన షోరూంలో స్వీపర్‌గా పనిచేస్తూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉపాధి పొందేది. బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్‌ దేవ్‌(24), బాలుడు సంగారెడ్డిలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. నిత్యం తాగేవారు. ఈనెల 20న స్నేహితుడు బిహార్‌ వెళ్తుండటంతో ఆ ఇద్దరూ అతన్ని కలిసేందుకు బైకుపై ప్యారడైజ్‌ వద్దకు వచ్చి తిరిగి వెళ్తూ కూకట్‌పల్లి సమీపంలోని ప్రశాంత్‌నగర్‌లో టీ తాగేందుకు ఆగారు. అక్కడ ఆ మహిళ ఒంటరిగా కనిపించగా ఆమెను అనుసరించారు. నిర్మానుష్య ప్రాంతంలోని భవనం వద్దకు వెళ్లగానే ఆమెను సెల్లార్‌లోని దుకాణాల వద్దకు లాక్కెళ్లి ఇద్దరూ అత్యాచారం చేశారు. ఆమె పారిపోబోతుంటే ఆమె తలను నేలకేసి కొట్టి చంపేశారు. ఇద్దరూ పరారయ్యారు.

ఆర్సీల ఆధారంగా ఆరా

నిందితులు వెళ్లే బైకు నంబరు సరిగా కనిపించక దర్యాప్తు క్లిష్టంగా మారడంతో ఎస్సైలు పి.రామకృష్ణ, ఆర్‌.ప్రేమ్‌సాగర్‌, జి.చంద్రకాంత్‌, టి.ఇంద్రసేనారెడ్డి 4 బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టారు. కూకట్‌పల్లి వైజంక్షన్‌ నుంచి సంగారెడ్డి వరకు 45 కిలోమీటర్ల పొడవునా మొత్తం 1,400 సీసీ కెమెరాలను పరిశీలించారు. నంబరు ప్లేటుపై అంకెలు కనిపిస్తున్నా ఆంగ్ల అక్షరాలు స్పష్టంగా లేవు. అంచనా వేయగా 10 బైకులు సరిపోలాయి. కొందరి వివరాలు ఆరా తీసి చివరకు వాహనాన్ని గుర్తించారు. చివరగా కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులు సంగారెడ్డిలోని బార్‌లో పనిచేస్తున్నట్లు తేలడంతో పోలీసులు నిందితుడు నితీష్‌కుమార్‌ను, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని