నకిలీ ధ్రువపత్రాలతో పంట రుణాలు!

బ్యాంకు సిబ్బంది, కొందరు గ్రామస్థులు కలిసి బ్యాంకు మేనేజర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి 47 మంది రైతులకు పంట రుణాలు ఇప్పించిన వైనం సిద్దిపేట జిల్లాలో బహిర్గతమైంది.  కలెక్టరేట్‌లో ఇటీవల నిర్వహించిన ప్రజావాణిలో మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామస్థుడు అన్నెబోయిన

Published : 27 May 2022 06:10 IST

బ్యాంకు మేనేజర్‌ సంతకం ఫోర్జరీ చేసిమరో బ్యాంకులో సమర్పణ

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: బ్యాంకు సిబ్బంది, కొందరు గ్రామస్థులు కలిసి బ్యాంకు మేనేజర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి 47 మంది రైతులకు పంట రుణాలు ఇప్పించిన వైనం సిద్దిపేట జిల్లాలో బహిర్గతమైంది.  కలెక్టరేట్‌లో ఇటీవల నిర్వహించిన ప్రజావాణిలో మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామస్థుడు అన్నెబోయిన అశోక్‌గౌడ్‌ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రైతుల పెట్టుబడి అవసరాలను ఆసరాగా చేసుకొని గ్రామీణ బ్యాంకు సిబ్బంది ఇద్దరు, మల్లుపల్లి గ్రామస్థులు నలుగురు కలిసి మోసపూరితంగా 47 మందికి రూ.50 లక్షలకు పైగా రుణాలు ఇప్పించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో 350 మంది రైతులకు పంట రుణాలను అధికారులు గతంలో మంజూరు చేశారు. మల్లుపల్లికి చెందిన 47 మంది రైతులు రూ.50 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నారు. వారు నిర్దేశిత కాలంలో తిరిగి చెల్లించలేదు. వారు యూనియన్‌ బ్యాంకు మేనేజరు సంతకాన్ని ఫోర్జరీ చేసి నోడ్యూస్‌ సర్టిఫికేట్లను సృష్టించారు. ఇదే మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో సమర్పించి తిరిగి రూ.50 లక్షలకు పైగా రుణాలు పొందారు. ఈ విషయంపై యూనియన్‌, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు మేనేజర్లు ధర్మరాజు, కమలాకర్‌రెడ్డిలను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పంట రుణాలు పొందిన మాట వాస్తవమేనన్నారు. అంతర్గతంగా విచారణ చేపట్టామన్నారు. కొందరు వ్యక్తులు ఫోర్జరీ సంతకాలతో పంట రుణాలు పొందినట్లు ఫిర్యాదు అందిందని ఏపీజీవీబీ రీజనల్‌ మేనేజర్‌ ఆశాలత తెలిపారు.  పదిహేను రోజుల నుంచి అంతర్గత విచారణ చేపట్టామని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు పంట రుణాలను రికవరీ చేస్తామని చెప్పారు. కాగా నకిలీ పత్రాల సృష్టి, అక్రమాలపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని