అబ్బాయిగారి ‘దందా’లూరు!

కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు.

Published : 26 Apr 2024 05:21 IST

కొల్లేరు, పోలవరం, తమ్మిలేరుల్లో విధ్వంసకాండ
కోటరీ అంతా దోపిడీల్లోనే...
అధికారులు దాసోహం... ఎదురు ప్రశ్నిస్తే కేసులు
ఈనాడు, ఏలూరు, అమరావతి

కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో దారుణమైన దందా జరుగుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారంటే... ఈ ప్రజాప్రతినిధి విధ్వంసకాండను అంచనావేయొచ్చు....


చ్చని పశ్చిమ గోదావరిలోని ప్రకృతి వనరులను దోచేయడంలో ఆ ప్రజాప్రతినిధి సిద్ధహస్తుడు. కొల్లేరు, పోలవరం కాలువ, తమ్మిలేరు.. ఇలా సమస్త వనరులనూ ధ్వంసం చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. అభయారణ్యంలో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాల నుంచి మట్టి మాఫియా వరకు ఈ నాయకుడిది పెట్టింది పేరు. పర్యావరణానికి ఆయన చేసిన హాని అంతాఇంతా కాదు. పోలీసులు, కొల్లేరు చెక్‌పోస్టు సిబ్బంది, అటవీ అధికారులు అందరూ ఆయన చెప్పింది వినాల్సిందే. అబ్బాయి కనుసన్నల్లో అక్రమాలు జరుగుతుంటే.. అతని తండ్రి శ్రీరామచంద్రుడిలా పైకి కనిపిస్తూనే అసలు కథ నడిపించారు. ఏలూరుకు సమీపంలోని ఈ నియోజకవర్గంలో వారికి ఎదురు తిరిగిన వారంతా కేసులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు చవిచూశారు.


వందల ఎకరాల్లో కొల్లేరు విధ్వంసం

ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. 180 రకాలకు పైగా విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి గుడ్లను పొదిగి మళ్లీ తమ ప్రాంతాలకు వెళ్లిపోతుంటాయి. ఈ సరస్సు మనుగడ రాష్ట్ర పర్యాటక రంగానికి ఎంతో ముఖ్యం. ఇలాంటి వేల ఎకరాల వనరును ఆక్రమించి, ఇష్టారాజ్యంగా చెరువులు తవ్వేసి, చేపల సాగుకు లీజుకు ఇచ్చేసి వందల కోట్లు సంపాదిస్తున్నారాయన. వైకాపా ప్రభుత్వ హయాంలో కొల్లేరులో ఎంతో విధ్వంసం జరిగింది. దీనికి కర్త, కర్మ, క్రియల్లో అతి ముఖ్యుడు ఈ నేత. అయిదో కాంటూరు పరిధిలో అసలు చెరువులే ఉండకూడదనేది చట్టం. వాటిని తోసిరాజని గత అయిదేళ్లలో ఇష్టారీతిన చెరువులు తవ్వించేశారు. వాటిని అనుచరుల సాయంతో నిర్వహిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలో రహదారుల నిర్మాణం చట్ట విరుద్ధం. కాగా దర్జాగా రోడ్లను వేసేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎవరైనా కొత్తగా చెరువు తవ్వుకోవాలంటే ఈ నేతకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కప్పంకట్టాలి.


అంతా నాన్నగారే...

పేరుకు ప్రజాప్రతినిధి అయినా వసూళ్ల లెక్కలు చూసింది..ఎదిరించిన వారి లెక్కలు సరిచేసింది ఈ నాయకుడి తండ్రే. భార్యాభర్తల గొడవల నుంచి పెద్దపెద్ద వివాదాల వరకు అన్ని సెటిల్‌మెంట్లు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ప్రతిపక్షాలు మొదలు సాధారణ ప్రజల వరకు ఎవరైనా వారి అక్రమాలను ప్రశ్నించినా, ఫిర్యాదులు చేసినా... ప్రతిఘటించే ప్రయత్నంచేసినా రకరకాల మార్గాల్లో వారిని దారిలోకి తెచ్చేది ఈయనే. నియంతృత్వానికి పరాకాష్ఠ అయిన ఆయన గత అయిదేళ్లలో ప్రశ్నించిన వారిపై ఎన్నో దాడులు చేయించారు. ఎస్సీ, ఎస్టీ, అత్యాచార కేసులు పెట్టించారు. పోలీసులంతా ఆయన జేబులో మనుషుల్లా పని చేయకున్నా..  చెప్పిన వారిపై కేసులు నమోదు చేయకున్నా తాండవం ఆడేవారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వైకాపా కార్యకర్తలు బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. బడుల పక్కన, గుడుల ముంగిట..ప్రభుత్వ కార్యాలయాల చెంతన కూడా భయం లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. వారి వెనకున్న ధైర్యం ఆయన నాన్నగారే!


కోడి వ్యర్థాల రవాణాలో కాసుల వేట...

పర్యావరణానికి చేటు అని తెలిసినా కొల్లేరులోని చేపల చెరువులకు కోడి వ్యర్థాలు దగ్గరుండి రవాణా చేయిస్తున్నారీయన. రూప్‌చంద్‌, ఫంగస్‌ చేపల పెంపకానికి ఈ వ్యర్థాలు వినియోగిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వాటిని  రప్పించి తన అండదండలతో యథేచ్ఛగా కొల్లేరులోకి రవాణా చేయిస్తున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆయనే స్వయంగా చేస్తారు. ఇందుకు తగ్గట్టుగా పెద్ద లారీ లోడు తీసుకువెళ్లాలంటే రూ.లక్షల్లో, చిన్న వ్యాన్‌ తరలించాలంటే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. పోలీసులు, విజిలెన్స్‌, మత్స్యశాఖ అధికారులు ఎవరూ ఈ రవాణాను అడ్డుకోకుండా ప్రజాప్రతినిధి ఆదేశాలు జారీచేస్తారు. వాటిని యంత్రాంగం పాటించాల్సిందే. లేకుంటే ఇక్కడ పని చేయడం సాధ్యం కాని పరిస్థితి సృష్టించారు. ఒక వేళ ఎవరైనా ఈయనకు కప్పం కట్టకుండా కోడి వ్యర్థాలు తరలిస్తే ఆ వాహనాలు సీజ్‌ అవుతాయి. కేసులు నమోదవుతాయి. గత అయిదేళ్లలో ఈ  వ్యాపారంలో ఆయన రూ.కోట్లు వెనకేసుకున్నారు.


ఆక్రమణల్లోనూ పరాక్రమం...

పోలవరం కుడి కాలువ గట్టు ఆక్రమణలన్నీ ఆయన అండతోనే జరిగాయి. కాలువ కోసం సేకరించిన భూములను ఆక్రమించుకుని మొక్కజొన్న, వరి, ఆయిల్‌పాం, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. కొందరు ఆక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి కోళ్లఫారాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో కాలువ వెళుతున్న ప్రతి చోట ఆక్రమణలు ఉన్నాయి. ఇవి కాకుండా నియోజకవర్గంలో ఇరిగేషన్‌, పంచాయతీ, దేవాదాయ, ఆర్‌అండ్‌బీ ఇలా అన్ని శాఖల్లో వందల ఎకరాల్లో భూములు ఈ నాయకుడి అండతో ఆక్రమించుకున్నారు. అక్కడ భూమి విలువలో 30 శాతం ఈయనకు కట్టాల్సిందే. ఆక్రమణలు తొలగించాలని ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదులు అందినా ఫలితం లేదు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా గుత్తేదారులు ఆయనకు కప్పం చెల్లించాల్సిందే.


అక్కడ ఎప్పుడూ కోడి పందేలే..

గోదావరి జిల్లాలో సంక్రాంతి మూడు రోజులూ కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తుంటారు. ఆ నియోజకవర్గంలో మాత్రం గత అయిదేళ్లూ సంక్రాంతి సందడే. ఆయన సొంత మండలంలోని ఓ గ్రామాన్ని జూద క్రీడలకు అడ్డాగా మార్చేశారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, తెలంగాణ నుంచి కూడా ఇక్కడ జూదం ఆడేందుకు కార్లలో వస్తున్నారు. మరో మూడు గ్రామాల్లో కోడి పందేల బరులు ఏర్పాటు చేసి రేయింబవళ్లు ఆడుకునేలా అన్ని ఏర్పాట్లు చేయించారు. కోడిపందెం బరిలోకి వెళ్లాలంటే రూ.1000 ఎంట్రీ ఫీజు చెల్లించాలి. పార్కింగ్‌కు అదనం. పోలీసులు కన్నెత్తి చూడరు. వీటి ద్వారా రోజుకు రూ.5 లక్షల వరకు ఈ నాయకుడు కమీషన్‌ వసూలు చేస్తున్నారు.


తమ్మిలేరు, పోలవరం మట్టి... తరలిపోతోంది

తమ్మిలేరు ఇసుక తరలింపు ఈ ప్రజాప్రతినిధికి కాసులు కురిపిస్తోంది.  గ్రామాల్లో వాహనాలుండి... వైకాపాకు అనుకూలంగా ఉన్న వారందరినీ ఈ వ్యవహారంలో పాత్రధారులను చేశారు. అనుమతులు లేకుండా, నిబంధనలతో ప్రమేయం లేకుండా వందల ట్రక్కుల ఇసుకను తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రక్కు మట్టి రూ.4-5 వేలకు విక్రయిస్తున్నారు. ఈ దందాలో రోజుకు రూ.5-7లక్షల వరకు ఈ ప్రజాప్రతినిధి ఖాతాలోకి చేరిపోతోంది. ఏదైనా గ్రామస్థులు, ప్రతిపక్షాల కార్యకర్తలు ఇసుక రవాణాను అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయిస్తున్నారు. 

పోలవరం కుడికాలువ గట్టుపై అడ్డగోలుగా మట్టి, గ్రావెల్‌ తవ్వేసి రవాణా చేస్తున్నారు. అనుమతులు లేకుండా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల్లో తరలించేస్తున్నారు. ఆ కాలువ గట్లపై ఈ ప్రజాప్రతినిధికి సంబంధించిన  రౌడీ మూకలు నిత్యం కాపలా ఉంటాయి. ఎవరైనా అటు వెళ్లాలన్నా భయమే. ఇంత జరుగుతున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. గతంలో చాలాసార్లు తెదేపా నాయకులు, కార్యకర్తలు తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దాడులు చేయించి.. వారిపై ఎదురు కేసులు పెట్టించారు.
నియోజకవర్గంలోని చెరువుల్లోంచీ మట్టిని అక్రమంగా తరలించేశారు.


జగనన్న ఇళ్ల స్థలాల్లో...

జగనన్న కాలనీల లేఅవుట్ల కోసం ప్రభుత్వం సేకరించిన భూముల విషయంలోనూ భారీగా దండుకున్నారు. స్థల సేకరణ విషయం ముందే తెలియడంతో పథకం ప్రకారం రైతులను భయపెట్టి అనుచరులు, బినామీలతో ఎకరం రూ.20- 25 లక్షలకు కొనుగోలు చేయించి... ప్రభుత్వానికి రూ.40-50 లక్షల చొప్పున అమ్మించారు. చాలాచోట్ల శివారు ప్రాంతాల్లో, పొలాల్లో నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఆయన అనుచరుల భూములను ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయించి లబ్ధి పొందారు. మెరక పనుల పేరుతో.. కాలనీలకు సమీప ప్రాంతాల నుంచే మట్టి తరలించి దూరం నుంచి తరలించినట్లు బిల్లులు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు