icon icon icon
icon icon icon

సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల

‘‘వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్‌ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చ చీర కట్టుకున్నానట.

Updated : 26 Apr 2024 07:40 IST

అవినాష్‌ను గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారో జగన్‌ సమాధానం చెప్పాలి
సీబీఐ ఛార్జిషీట్‌లో వైఎస్సార్‌ పేరు చేర్పించిన వారికి పదవి
పీసీసీ అధ్యక్షురాలు ధ్వజం

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌-అమరావతి, నరసరావుపేట: ‘‘వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్‌ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చ చీర కట్టుకున్నానట. పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్‌ చెప్పడాన్ని ఏమనుకోవాలి. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చచీర కట్టుకుంటే తప్పేముంది. చంద్రబాబు పచ్చరంగు ఏమైనా కొనుక్కున్నారా? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్‌ ఉందా? జగన్‌ మరిచిపోయినట్లున్నారు... సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌లో పైన పసుపు రంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్సార్‌ పసుపు రంగు ఉంటే తప్పేముంది. అది తెదేపా సొంతం కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్లు పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్‌రెడ్డికి అసలు సంస్కారం ఉందా?’’ అని షర్మిల మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు జిల్లా సంజీవయ్యనగర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో షర్మిల మాట్లాడారు. ‘రాసిచ్చిన స్క్రిప్టును చదివేది జగన్‌మోహన్‌రెడ్డి. నేను వైఎస్సార్‌ బిడ్డను. నాకు మోకరిల్లే అవసరం లేదు. వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. నన్ను దూషించారు.. బెదిరించారు. సొంత చెల్లెలి గురించి ఆలోచించకుండా మగవారి మధ్య మాట్లాడటం సభ్యతేనా?’ అని నిలదీశారు. ‘రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆలోచించాలి. భాజపా, మోదీ ముందు మోకరిల్లింది జగన్‌మోహన్‌రెడ్డి. పోలవరం, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులను తాకట్టు పెట్టారు. దిల్లీకి వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అవినాష్‌రెడ్డిని రక్షించడానికి దిల్లీ వెళ్తున్నారు. వైఎస్సార్‌కు జగన్‌ వారసుడు కాదు. మోదీకి వారసుడు. మోదీకి దత్తపుత్రుడిగా భాజపా నాయకులే చెబుతున్నారు’ అని షర్మిల పేర్కొన్నారు.

సీబీఐ ఛార్జిషీట్‌లో జగన్‌ న్యాయవాదే పేరు చేర్చారు

‘కాంగ్రెస్‌ పార్టీ వైఎస్సార్‌ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చలేదు. జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవాది వైఎస్సార్‌ పేరును చేర్పించారు. కేసుల నుంచి జగన్‌ బయటపడడని తెలిసి.. న్యాయవాది సుధాకర్‌రెడ్డి సీబీఐ ఛార్జిషీటులో వైఎస్సార్‌ పేరును కోర్టులో పిటిషన్‌ వేసి మరీ చేర్పించారు. అందుకు ప్రతిఫలంగా అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పదవి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? జగన్‌ సమాధానం చెప్పాలి. వివేకాను చంపిన నిందితుడికి సీటు ఎందుకు ఇచ్చావని సౌభాగ్యమ్మ లేఖ రాస్తే కనీసం స్పందించలేదు. జగన్‌కు ఉన్నది గుండెనా? బండనా? ప్రజలు నిజం వైపు ఉంటారా? నేరం వైపు ఉంటారా? అని ఆలోచించుకుని ఓటెయ్యాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.

అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో..

‘అవినాష్‌ అమాయకుడు అని నమ్ముతున్నానని, ఎంపీ టికెట్‌ ఇచ్చానని జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగంగా చెబుతున్నారు. అవినాష్‌రెడ్డిని ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు. ఆలోచన, ఇంగితం దేవుడు ఇవ్వలేదా? జగన్‌ సమాధానం చెప్పాలి’ అని షర్మిల డిమాండ్‌ చేశారు. ‘అవినాష్‌రెడ్డి, చంపినవారి మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. అడ్వాన్సు తీసుకున్నారు. కాల్‌ రికార్డులు సరిపోతున్నాయని సీబీఐ సాక్ష్యాలు చూపుతున్నా ఎందుకు నమ్ముతున్నారు’ అని ప్రశ్నించారు. జగన్‌కు ఏ అవసరం ఉండి అవినాష్‌ను కాపాడుతున్నారో అని వ్యాఖ్యానించారు.

రాజధాని నిర్మించలేదు

‘అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వాషింగ్టన్‌ డీసీగా చేస్తానని చెప్పిన జగన్‌ ఆ తర్వాత చేతులెత్తేశారు. చివరికి మూడు రాజధానులు ప్రకటించి.. ఒక్కటీ నిర్మించలేదు. నాగార్జునసాగర్‌ కాలువల మరమ్మతులు చేపడతానని హామీ ఇచ్చి మరిచారు.  ఇసుక దోపిడీకి పాల్పడటంతో పాటు లిక్కర్‌ మాఫియాలో 33% వాటాలు తీసుకుంటున్న అంబటి రాంబాబును ఇంటికి సాగనంపాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.


ఆడబిడ్డ చీరపై విమర్శలా!: చంద్రబాబు

  • ‘తోడపుట్టిన చెల్లెలి పుట్టుకపై.. మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా’ అని సీఎం జగన్‌ తీరుపై ఎక్స్‌ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • మహిళలంటే గౌరవం లేని మనిషి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img