అతి వేగం.. ఆపై నిర్లక్ష్యం.. వాటి ఖరీదు నాలుగు నిండు ప్రాణాలు

అతి వేగం, ఆపై కారు నడపడంలో చూపిన నిర్లక్ష్యం.. నెలల పసికందు సహా నలుగురి ప్రాణాలు బలిగొంది. ఆ కుటుంబంలో అంతులేని శోకాన్ని నింపింది. మహారాష్ట్రలోని వార్ధాలో

Published : 11 Aug 2022 04:29 IST

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు

పసికందు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృత్యువాత

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

ముప్కాల్‌, న్యూస్‌టుడే: అతి వేగం, ఆపై కారు నడపడంలో చూపిన నిర్లక్ష్యం.. నెలల పసికందు సహా నలుగురి ప్రాణాలు బలిగొంది. ఆ కుటుంబంలో అంతులేని శోకాన్ని నింపింది. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగే వేడుకకు బయలుదేరిన ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే కన్నుమూయగా..మరో ముగ్గురు పిల్లలు గాయాల పాలయ్యారు. నుజ్జునుజ్జయిన కారును గడ్డపారతో పెకలించి మృతదేహాలను వెలికితీయాల్సి రావటం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. ఆర్మూర్‌ గ్రామీణ సీఐ గోవర్ధన్‌రెడ్డి అందించిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌ టోలిచౌకి ప్రాంతానికి చెందిన మిన్హాజ్‌బేగం కుటుంబ సభ్యులు, బంధువులు వార్ధా వెళ్లడానికి రెండు కార్లలో మంగళవారం రాత్రి 11 గంటలకు వారి నివాసం నుంచి బయలుదేరారు.

* ఒక కారును మిన్హాజ్‌బేగం సోదరుడు అంజాద్‌ నడిపిస్తుండగా.. అందులో వారిద్దరితో పాటు ఆమె ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. మరో కారులో మిన్హాజ్‌ పెద్ద కుమారుడు మహమ్మాద్‌ సఫ్‌నాన్‌(14), వారి బంధువులు ఎక్కారు. మిన్హాజ్‌తో పాటు పిల్లలున్న కారు 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ బుధవారం ఉదయం 6.30 గంటలకు నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం కొత్తపల్లి శివారుకు చేరుకొంది. వాహనాన్ని నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడంతో అది డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అంజాద్‌(32), మిన్హాజ్‌ బేగం(38), ఆమె చిన్నకుమార్తె ఫిల్జా(3 నెలలు) అక్కడికక్కడే మరణించారు. రెండో కుమారుడు సాహిల్‌(7) ఆర్మూర్‌ ఆసుపత్రిలో కన్నుమూశాడు. పెద్ద కుమార్తె సాదియా(19), మూడో కుమారుడు ఆదిల్‌(5), నాలుగో కుమారుడు ఒమర్‌(3) గాయపడ్డారు. మరో కారులో ముందు వెళ్తున్నవారంతా విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి తిరిగొచ్చారు. విగతజీవులుగా మారిన తమవారిని, చిన్నారులను చూసి కన్నీరు మున్నీరయ్యారు. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, మిన్హాజ్‌ భర్త ఇబ్రహీం ఇంటి వద్దే ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts