మాజీ సైనికుడి నుంచి లంచం డిమాండ్‌

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌ పంచాయతీ కార్యదర్శి వి.శ్రీధర్‌ ఒక మాజీ సైనికుడి నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (అనిశా)

Published : 25 Sep 2022 04:51 IST

రూ. 90 వేలు తీసుకున్న పంచాయతీ కార్యదర్శి

పట్టుకున్న అనిశా అధికారులు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌ పంచాయతీ కార్యదర్శి వి.శ్రీధర్‌ ఒక మాజీ సైనికుడి నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులకు చిక్కాడు. కరీంనగర్‌ రేంజి ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన దావా తిరుపతి సైన్యంలో నాయక్‌ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు. తన గ్రామంలోనే సాన స్టీల్స్‌ పేరుతో చిన్న తరహా పరిశ్రమ పెట్టేందుకు ఆరు నెలల కిందట పనులు ప్రారంభించి.. శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) నుంచి అనుమతి పొందారు. ఈ ఏడాది జూన్‌లో నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌వోసీ) కోసం పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కార్యదర్శి శ్రీధర్‌ ఎన్‌వోసీ ఇవ్వకుండా తిరకాసు పెడుతూ వచ్చాడు. చివరకు రూ.లక్ష లంచం డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని బతిమాలినా అతడు వినకపోవడంతో బాధితుడు ఈ నెల 15న అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు తిరుపతి మరోసారి కార్యదర్శిని సంప్రదించగా.. రూ.90 వేలకు అంగీకరించాడు. శనివారం ఉదయం ఆర్టీసీ వర్క్‌షాప్‌ ఎదుట బస్‌స్టాప్‌ వద్ద తిరుపతి నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో అధికారులు దాడిచేసి.. శ్రీధర్‌ను పట్టుకున్నారు. సమీపంలో ఉన్న అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని