AP News: వివేకా హత్యకేసు.. వైకాపా రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో ..

Updated : 13 Sep 2023 16:20 IST

కడప: ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీమంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో సీబీఐ అదుపులోకి తీసున్న విషయం తెలిసిందే. శివశంకర్‌రెడ్డిని హైదరాబాద్‌ నుంచి పులివెందుల తరలించిన సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో కడప కారాగారానికి తరలించారు. ఈ సందర్భంగా పులివెందుల కోర్టు వద్ద శివశంకర్‌రెడ్డిని కలిసేందుకు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైకాపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

దస్తగిరి వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన
శివశంకర్‌రెడ్డి  కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి సన్నిహితుడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఉంది. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ ఇటీవల సమాచారమిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తర్వాత వస్తానంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీబీఐ ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాద్‌లో ఆయన్ను పట్టుకుంది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌రెడ్డి ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని