logo

కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు

అసెంబ్లీ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఆసిఫాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు క్రమంగా తారస్థాయికి చేరింది.

Published : 12 Aug 2023 04:59 IST

పోటాపోటీగా రాఠోడ్‌ గణేష్‌, మర్సుకోల సరస్వతి సమావేశాలు

ఈనాడు, ఆసిఫాబాద్‌: అసెంబ్లీ సమరానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఆసిఫాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు క్రమంగా తారస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు మద్దతు తెలుపుతున్న రాఠోడ్‌ గణేష్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ మద్దతు తెలుపుతున్న మర్సుకోల సరస్వతి.. ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి  అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల నేతలు ఎవరికి వారే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు. పార్టీ నిర్వహించే సమావేశాలను సైతం వేర్వేరుగా, పోటాపోటీగా జరుపుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జిల్లాలో చేసిన పాదయాత్ర సందర్భాంగానే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి.

జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా ఎస్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు మర్సుకోల సరస్వతి, విశ్వప్రసాద్‌ సమక్షంలో బూత్‌ స్థాయిలో ఏజెంట్ల నియామకం, గత ఎన్నికల ఓటింగ్‌ సరళి, స్థానిక నేతల బలోపేతం గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు అన్ని మండలాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. కాగా రాఠోడ్‌ గణేష్‌ తన అనుయాయులతో మరొక చోట సమావేశం ఏర్పాటు చేసుకోవడం కలకలం సృష్టించింది. సిర్పూర్‌(యు) మండల ఉప సర్పంచి, కాంగ్రెస్‌ పార్టీ నేత ఎండీ హమీద్‌ఖాన్‌, లింగాపూర్‌ మండల నేత జాదవ్‌ రమేశ్‌ ఇద్దరు విశ్వప్రసాద్‌ ఇంటి వద్ద నిర్వహించే సమావేశానికి వచ్చారు. ఈక్రమంలో మీరెందుకు ఇక్కడికి వచ్చారని, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీలో ఏళ్లుగా కొనసాగుతున్న మమ్మల్ని ఎందుకు పిలవలేదని వీరిద్దరు గొడవకు దిగారు. రెండునెలల క్రితం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలోనూ ఇదే విధంగా ఇరువర్గాల నాయకుల మధ్య గొడవ జరిగింది.

ఎవరి దారి వారిదే..

కాంగ్రెస్‌ పార్టీకి ఒకప్పుడు ఆసిఫాబాద్‌ నియోజకవర్గం కంచుకోటగా ఉండేది. 2009, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సోదరులు విశ్వప్రసాద్‌, ప్రేంసాగర్‌రావులు కలిసికట్టుగా పనిచేసి ఆత్రం సక్కును గెలిపించుకున్నారు. వచ్చే ఎన్నికలకు మాత్రం ఇద్దరు చెరో అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో పార్టీలో ఎవరిదారే వారిదే అన్నట్లుగా కార్యకర్తలు రెండువర్గాలుగా చీలిపోయారు. మరోవైపు కెరమెరి మండలం అనార్‌పల్లికి చెందిన రాఠోడ్‌ శేష్‌రావు సైతం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో ఉంటున్నారు. కాగజ్‌నగర్‌లో రావి శ్రీనివాస్‌, కృష్ణారెడ్డిలు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సైతం రెండు వర్గాలు ఉన్నాయి. పంతాలు వీడి ఏకతాటిపైకి వస్తేనే కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వస్తుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని