logo

జలపాతాల సోయగం.. పట్టించుకుంటే పరవశం

అందమైన జలపాతాలు.. జలజలా పారుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నా అవి కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. వల్సంపేట జలపాతంలో తరచూ ఏదో ప్రమాదం జరుగుతున్నా వాటి నివారణ చర్యలు శూన్యం.

Published : 06 Jun 2023 06:06 IST

అభివృద్ధిపై దృష్టిపెట్టని పాలకులు
ప్రమాదాల నివారణా చర్యల్లేవు!
కొయ్యూరు, న్యూస్‌టుడే

ప్రమాదాలకు నిలయమైన వల్సంపేట జలపాతం

అందమైన జలపాతాలు.. జలజలా పారుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నా అవి కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు. వల్సంపేట జలపాతంలో తరచూ ఏదో ప్రమాదం జరుగుతున్నా వాటి నివారణ చర్యలు శూన్యం. ప్రస్తుతం వేసవి కావడంతో నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో జలపాతాల అభివృద్ధికి, ప్రమాద నివారణ చర్యలకు ఇదే అనువైన సమయం.

కొయ్యూరు మండలంలో ముఖ్యంగా వల్సంపేట (గాది గుమ్మి), తొంపడం, చాకులపాలెం, చింతవానిపాలెం సమీపంలో ఇసుకుల మడుగు, ములకలపాడు జలపాతాలున్నాయి. కొమ్మిక, డౌనూరు, మూలపేట పంచాయతీల్లో జలపాతాలున్నా వాటికి పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంటుంది.

అక్కడే 42 మంది మృత్యువాత

మండల కేంద్రానికి సుమారు 30 కి.మీ. దూరంలో, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట నుంచి సుమారు ఆరు కి.మీ. దూరంలో వల్సంపేట (గాది గుమ్మి) జలపాతం ఉంది. దీని దగ్గర పర్యాటకుల కోసం హట్‌లను ఏర్పాటు చేశారు. అలాగే దీని దగ్గరకు చేరుకోవడానికి తారు రోడ్డు కూడా వేశారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. విద్యార్థులు, యువకులు ఎక్కువశాతం సొంతంగా ప్రైవేటు బస్సులు వేసుకుని మరీ వస్తుంటారు. జలజలజారే జలపాతం దగ్గర ఫొటోలు తీసుకోవాలన్న కోరికతో అక్కడకు వెళ్లి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు 42 మంది వరకు మృత్యువాత పడ్డారు. దీని దగ్గర ప్రమాదాలు జరిగే చోటుకు వెళ్లకుండా నివారించేందుకు ఇనుప గొలుసులు ఏర్పాటు చెయ్యాలి. అలాగే జలపాతంలోని అగాధాన్ని బండరాళ్లతో పూడ్చితే ఫలితం ఉంటుంది.


చాకులపాలెం వద్ద..

* కొయ్యూరు నుంచి 8 కి.మీ. దూరంలో చాకులపాలెం జలపాతం ఉంది. ఆ గ్రామం నుంచి సుమారు కిలోమీటరున్నర దూరం అడవిమార్గంలో వెళ్లాలి. కనీసం మెటల్‌ రోడ్డు వెయ్యాల్సి ఉంది. జలపాతం చుట్టూ యాత్రికులు కూర్చోడానికి హట్‌లు నిర్మిస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాల్లేవు.


* మండల కేంద్రానికి రెండున్నర కి.మీ. దూరంలో ములకలపాడు జలపాతం ఉంది. గతంలో ఇక్కడ సినిమా షూటింగ్‌ జరిగింది.  రహదారి నుంచి 150 మీటర్ల మేర రోడ్డువేసి చుట్టూ ఉన్న తుప్పలను తొలగించాలి.


తొంపడం జలపాతం

* తొంపడం జలపాతానికి రామరాజుపాలెం, గానుగల మీదుగా వెళ్లాలి. దీనికి రోడ్డు వేయాల్సి ఉంది. ఇది వల్సంపేట జలపాతానికి సుమారు నాలుగు కి.మీ. దూరంలో ఉంది. గానుగుల నుంచి సుమారు రెండు కిలోమీటర్లు మేర రోడ్డు ఏర్పాటు చేయాలి. ఈ ప్రదేశాల్లో ప్రమాదాలకు అవకాశం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి వల్సంపేట జలపాతంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతోపాటు మిగిలిన జలపాతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


ఇసుకులమడుగులో సందర్శకుల స్నానాలు

* మండల కేంద్రానికి సుమారు ఆరు కి.మీ. దూరంలోని చింతవానిపాలెం సమీపంలో ఇసుకుల మడుగు జలపాతం ఉంది. చింతవానిపాలెం సమీపం నుంచి రెండు కి.మీ. మేర అటవీ మార్గంలో కాలినడకన మాత్రమే వెళ్లాలి. నాలుగేళ్లగా అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ఇటీవలే ఉపాధి హామీ పథకంలో రోడ్డు వేశారు. వర్షం కురిసిన కొన్నిరోజుల వరకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. సుమారు రెండు కి.మీ. మేర మెటల్‌ రోడ్డు నిర్మించి, జలపాతం దగ్గర మెట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు లేక రోజురోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. సందర్శకులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలి.

చర్యలు తీసుకుంటాం..: వల్సంపేట జలపాతంలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. గిరిజన సంక్షేమ శాఖ జేఈని పంపించి ఏం చేయాలన్న దానిపై నివేదిక తీసుకొని చర్యలు తీసుకొంటాం. పర్యటకులు ఎక్కువగా వచ్చే జలపాతాల అభివృద్ధికి చర్యలు తీసుకొంటాం.

అభిషేక్‌, పాడేరు ఐటీడీఏ పీవో


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని