icon icon icon
icon icon icon

Elections: ఓటేసేందుకు బయల్దేరిన నగరవాసులు.. బస్సులు, రైళ్లు కిటకిట

ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.

Updated : 10 May 2024 19:51 IST

హైదరాబాద్‌: ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ఒక్క ఓటుతో తలరాతలు మారుతుంటాయి. అంతటి విలువైన ఓటును నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ఓటర్లు. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయినా.. రాష్ట్ర  భవిష్యత్‌ కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. నిజాయతీ, విలువలు ఉన్న నాయకులకే పట్టం కడతామని చెబుతున్నారు. 

స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. మరి కొందరు సొంత వాహనాల్లో వెళ్తున్నారు. దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. పది రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్‌ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, సాగర్‌ రింగ్‌రోడ్డు బస్టాప్‌లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది.

టీఎస్‌ ఆర్టీసీ రెండు వేల ప్రత్యేక బస్సులు..

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్‌ నుంచి 500, జేబీఎస్‌ నుంచి 200, ఉప్పల్‌ నుంచి 300, ఎల్బీనగర్‌ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రయాణికుల రద్దీ మేరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు నడపనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img