Kovai Sarala: పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ

నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.

Updated : 10 May 2024 12:14 IST

సంపూర్ణమైన హాస్యానికి పరిపూర్ణమైన అర్థం కోవై సరళ (Kovai Sarala). మాటల్లో వెటకారం, చేతల్లో చమత్కారం ఆమె సొంతం. సహజనటిగా, సహాయనటిగా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి.. సరికొత్త కామెడీకి జీవం పోసి కామెడీ క్వీన్‌ అనిపించుకున్నారు. తాజాగా ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. అవేంటో చదివేద్దాం..

కోవై.. అంటే ఇంటి పేరా.. నాన్న పేరా?

కోవై సరళ: అప్పట్లో కోయంబత్తూరును కోవై అనేవారు. ఆ పేరుతో కోవై ఎక్స్‌ప్రెస్‌ అనే ట్రైన్‌ కూడా ఉండేది.  ప్రెస్‌వాళ్లు నా పేరు ముందు కోవై చేర్చారు. అప్పటినుంచి కోవై సరళ అయ్యాను.

మీ కుటుంబ నేపథ్యం ఏంటి?

కోవై సరళ: నేను కోయంబత్తూరులో పుట్టి పెరిగాను.  అమ్మానాన్నలిద్దరిదీ కేరళ. చిన్నప్పుడు డాక్టర్‌ కావాలని కోరిక ఉండేది. మా నాన్న మిలటరీ ఉద్యోగి కావడంతో ఇంట్లో చాలా పద్ధతులు ఉండేవి. పొద్దునే 5 గంటలకు లేవాలి. అలా కఠినంగా ఉండేవారు. ఒకరోజు ఆయన దగ్గరకు వెళ్లి నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పా. నాన్న నా ఇష్టాన్ని చూసి వెంటనే ఓకే అన్నారు.  చిన్నప్పటినుంచి నేను ఎంజీఆర్‌ అభిమానిని. ఆయన్ని చూసే సినిమాల్లోకి రావాలనిపించింది. ఆరోతరగతి చదివేటప్పుడే ఆయన్ని చూడాలని ఆయన బస చేసిన హోటల్‌ ముందు నిల్చునేదాన్ని. వారం రోజులు అలా రోజూ ఆయన్ని చూడడం కోసం నిల్చున్నా. ఒకరోజు ఆయనే పిలిచి వివరాలు అడిగారు. నాకు సినిమాల్లోకి రావాలనుందని చెప్పా. చదువుకో తర్వాత హీరోయిన్‌గా నటించొచ్చు అన్నారు. నేను చదువుకోవడానికి కూడా ఆయనే డబ్బు పంపేవారు. 

కమల్‌ హాసన్‌ పక్కన హీరోయిన్‌గా అవకాశం ఎలా వచ్చింది?

కోవై సరళ: కమల్‌ అసిస్టెంట్‌ ఫోన్‌ చేసి ఆ సినిమా (సతీ లీలావతి) గురించి చెబితే నేను నమ్మలేదు. తర్వాత కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి నా డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.  నేను ఆ సమయంలో తెలుగులో బిజీగా ఉన్నాను. అదే విషయం ఆయనతో చెబితే.. 5 నెలలు నాకోసం వెయిట్‌ చేశారు. సినిమా అయిపోయాక చివరిరోజు ‘మీరు తప్ప మరెవరూ ఇంత బాగా చేయలేరు’ అని చిత్రబృందమంతా ప్రశంసించింది. ఇప్పటివరకు 900కుపైగా సినిమాలు చేశాను. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చేశాను. 

సినిమాల్లో మొదటి అవకాశం ఎప్పుడు వచ్చింది?

కోవై సరళ: తెలుగులో ‘మూడు ముళ్లు’ సినిమా తమిళంలో చేసిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. ఆయన నాకు అవకాశమిస్తానని నా చిన్నప్పుడే చెప్పారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్‌ జరుగుతుందని తెలిసి కలిశాను. తాను తీస్తోన్న సినిమాలో పాత్ర ఇచ్చారు. అదే నా మొదటి సినిమా. ఆ చిత్రాన్ని ఏడాదిపాటు థియేటర్లో ప్రదర్శించారు. సూపర్‌ హిట్‌. సినిమాల కోసమే డ్యాన్స్‌ నేర్చుకున్నా.

తెలుగు ఇండస్ట్రీలో ఏ కమెడియన్‌ అంటే ఇష్టం?

కోవై సరళ: నేను టాలీవుడ్‌కు వచ్చినప్పుడు తెలుగు రాదు. అప్పుడు మీరు(అలీ) అన్నీ వివరించేవారు. అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు మీరే నా ఫ్రెండ్‌.  బ్రహ్మానందం గారు నాకు అన్న, తండ్రిలా అన్ని సలహాలిచ్చేవారు. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ‘సరళా చెల్లి ఏం చేస్తున్నావు. డబ్బులు సంపాదించి దాచుకో. అవసరానికి ఉంటాయి. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనుంటాను’ అని చెప్పారు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. 

పూరి జగన్నాథ్‌ గురించి చెప్పండి? 

కోవై సరళ: నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ‘దేశముదురు’ సినిమా సమయంలో ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందులో సన్నివేశాలకు అల్లు అర్జున్ తెగ నవ్వారు. 

మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?

కోవై సరళ: కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కండీషన్‌ లేదు కదా. స్వేచ్ఛ కోసమే చేసుకోలేదు. బోర్‌ కొడితే హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తాను. తరచూ షిరిడీ వెళ్తుంటాను. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. తర్వాత ఈ బంధాలన్నీ వచ్చాయి. ఎంతోమంది పిల్లలు ఉన్న వాళ్లు కూడా చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని ఒకరు చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ధైర్యంగా ముందుకువెళ్లాలి. 

మీ ఆరోగ్యంపై ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి.. వాటిలో నిజమెంత?

కోవై సరళ: అవి చూసి ఎంతోమంది ఫోన్‌లు చేశారు. నేను హాస్పిటల్లో ఉన్నానని.. ఖర్చులకు డబ్బులు లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్‌ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేసినట్లు రాశారు.  అవి చూసి ఆశ్చర్యపోయా. మా అక్కవాళ్లు చాలా మంచివారు. అలా రాసినవాళ్లకు నేను ఎలాంటి సమాధానం ఇవ్వాలనుకోలేదు. ఎవరిపాపం వాళ్లదని వదిలేశాను. 

ఫ్రీ టైంలో ఏం చేస్తారు?

కోవై సరళ: నేను బయటకు వెళ్లను. ఫ్రెండ్స్‌ లేరు. సినిమాలకు వెళ్లను. షాపింగ్ అసలు చేయను. ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడూ వార్తలు వింటుంటాను. ఎవరైనా వస్తే వాళ్లకు వార్తలు వివరిస్తుంటాను.  

హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయా? మొదట డబ్బింగ్‌ చెప్పింది ఏ సినిమాకు?

కోవై సరళ: చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ ఉన్నాయి. ‘పెళ్లాం చెబితే వినాలి’, ‘సతీ లీలావతి’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’.. ఇలా దాదాపు 15 సినిమాల్లో హీరోయిన్‌గా చేశాను. హీరోయిన్‌గా మాత్రమే చేసుంటే జనాలు ఎప్పుడో మర్చిపోయేవారు. కామెడీ చేశాను కాబట్టే ఇన్ని రోజులు గుర్తుంచుకున్నారు. మొదటిసారి ‘పెళ్లాం చెబితే వినాలి’ సినిమాకు డబ్బింగ్‌ చెప్పాను. సినిమాల్లోకి వచ్చాక డబ్బింగ్‌ చెప్పే క్రమంలో వాయిస్‌ సన్నగా మారింది. ప్రభుదేవ కోసం సినిమాలో ఓ పాట పాడాను. అప్పుడు జ్వరం వచ్చింది. మరోసారి ‘సఖి’ సినిమాలో స్నేహితుడా.. స్నేహితుడా పాటను కామెడీగా పాడాను. అది బాగా నవ్వులు పూయించింది.

తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఏది ఇష్టం? 

కోవై సరళ: తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఇష్టం. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. కోలీవుడ్‌ నాకు పుట్టినిల్లు అయితే.. టాలీవుడ్‌ మెట్టినిల్లుతో సమానం. పుట్టిల్లు కంటే మెట్టినిల్లే ఇష్టం. నాకు చెన్నైలోనే ఇల్లు ఉంది. ఇంకెక్కడా లేదు. చిన్న వయసులోనే తల్లి పాత్రలు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 35 ఏళ్లు అవుతుంది.

ఇప్పుడున్న హీరోల్లో ఎవర్నైనా పెళ్లి చేసుకోవాలంటే ఎవర్ని చేసుకుంటారు. ఫన్నీగా చెప్పండి?

కోవై సరళ: అల్లు అర్జున్‌. అతడి గొంతు నాకు చాలా ఇష్టం. తనతో రెండు సినిమాలు చేశాను. ఆయన ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది.

ఈ సినిమాలో అనవసరంగా నటించా.. అనుకున్న సందర్భం ఉందా?

కోవై సరళ: అలాంటి సందర్భం లేదు. కానీ ఒకసారి చాలా బాధపడ్డాను. ఆర్టిస్టు అవడం నా కల. ‘ఫ్యామిలీ’ సినిమాకు సంబంధించి ఊటీలో కామెడీ సాంగ్‌ షూటింగ్‌ చేయాలి. ఆ ముందు రోజు రాత్రి 11.30కు మానాన్న చనిపోయారు. ఆయనంటే నాకు ప్రాణం. వదిలి వెళ్లలేను. నాన్న అంత్యక్రియలు అవగానే షూటింగ్‌కు వెళ్లాను. ‘నీ కోసం ఎవరూ వెయిట్‌ చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వృత్తిని గౌరవించాలి’ అని నాన్న చెప్పిన మాటలే తలచుకున్నాను. మనసులో చెప్పలేనంత బాధ ఉండి సినిమా కోసం నవ్వుతూ నటించాను. అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. నేను మా నాన్న చనిపోయిన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లానని ఎంతోమంది రకరకాలుగా మాట్లాడారు. 

నాన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది?

కోవై సరళ: ఆయన నాకు ఫ్రెండ్‌. నా ధైర్యం. ఏ చిన్న విషయమైనా ఆయనతో పంచుకునేదాన్ని. షూటింగ్‌లో ఎవరైనా ఐలవ్‌యూ చెబితే వెంటనే నాన్నతో చెప్పేదాన్ని. జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించారు. 

ఇండస్ట్రీలో మీకు ఎవరైనా ప్రపోజ్‌ చేశారా?

కోవై సరళ: ఎవరూ ప్రపోజ్‌ చేయలేదు. 

ఇన్నేళ్లు ఎందుకు విరామం తీసుకున్నారు?

కోవై సరళ: నేను స్క్రీన్‌ మీద కనిపిస్తే ప్రేక్షకులు ఆనందించాలి. అలాగే నా పాత్ర ఆకట్టుకోవాలి. కోవై సరళ కామెడీతో పాటు ఛాలెంజింగ్‌ పాత్రలు కూడా చేయగలదు అని అనుకోవాలి. అందుకే గ్యాప్‌ తీసుకున్నా. ఇప్పటివరకు మూడు సార్లు నంది అవార్డులు తీసుకున్నా.

‘కాంచన’ గురించి చెప్పండి?

కోవై సరళ: ఆ సినిమాకు అన్నీ లారెన్సే. ‘కాంచన’కు వచ్చిన ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయి. చిన్నప్పుడు దెయ్యం అంటే భయం. ఇప్పుడు అది నన్ను చూస్తే భయపడుతుంది (నవ్వుతూ). చనిపోయిన వాళ్లను చూస్తే నాకు ఈర్ష్య పుడుతుంది. నన్ను కూడా తీసుకుపోవచ్చు కదా అనిపిస్తుంది. 

ట్రైన్‌లో ఏదో ఫన్నీ ఇన్సిడెంట్‌ జరిగిందట కదా.. ఏమిటది?

కోవై సరళ: ఊటీలో షూటింగ్‌. అప్పుడు నేను బాగా బిజీగా ఉన్నాను. రోజుకు 7 సినిమాల్లో కాల్‌షీట్లు ఇచ్చాను. కోయంబత్తూరులో షూటింగ్‌ అవగానే టికెట్‌ అనుకొని ఫ్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకెళ్లాను. తర్వాత స్టేషన్‌లో దిగిపోమన్నారు. 

పాలిటిక్స్‌లోకి వస్తారా?

కోవై సరళ: రాను. కమల్‌ హాసన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన కోసం ఓ మీటింగ్‌కు వెళ్లానంతే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు