logo

‘బోరు’మనిపించావ్‌ జగన్‌

తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్‌ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్‌ఆర్‌ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్‌ హడావుడి చేశారు.

Updated : 23 Apr 2024 05:03 IST

జలకళకు గ్రహణం
అన్నదాతకు మిగిలింది ఎదురుచూపులే..
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి

తెదేపా హయాంలో అమలుచేసిన ఎన్టీఆర్‌ జలసిరి పథకానికి వైకాపా ప్రభుత్వం పేరు మార్చి వైఎస్‌ఆర్‌ జలకళ అని పెట్టింది. దీనికింద ఉమ్మడి జిల్లాలో 20 వేల బోర్లు తీస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి ఒక రిగ్గు కేటాయిస్తున్నామంటూ సీఎం జగన్‌ హడావుడి చేశారు. ఈ అయిదేళ్లలో తవ్వినవి కేవలం 397 బోర్లు మాత్రమే.

‘అన్నదాతలకు అండగా ఉంటాం. రైతు పొలంలో బోరు తీసి విద్యుత్తు కనెక్షన్‌ ఇచ్చి, వ్యవసాయ మోటార్‌ ఉచితంగా అందిస్తామని’ పథకం ప్రారంభ సమయంలో జగన్‌ గొప్పగా చెప్పుకొచ్చి ఆచరణలో పాతాళానికి తొక్కేశారు.


నాడు

సాగు చేస్తున్న తోటను చూపుతున్న రైతు సన్యాసిరావు

ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు జి.సన్యాసిరావు, ఎన్‌.నర్సాపురం గ్రామం. తెదేపా హయాంలో జలసిరి ద్వారా వేసిన సోలార్‌ మోటారుతో నీటిని వాడుకుని చక్కగా సాగుచేస్తున్నాడు. ఈ నీటి ఆధారంగా వేసిన కొబ్బరి, జీడి తోట కాపు దశకు చేరుకుంది. అంతరపంటగా గడ్డి పెంచడంతోపాటు కూరగాయలు వేసి ఆదాయం పొందుతున్నారు. ఒకట్రెండు మరమ్మతులు వచ్చినా, సంబంధిత సిబ్బంది వచ్చి బాగు చేశారని సన్యాసిరావు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

నేడు

ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు పోతంశెట్టి వీరబాబు. కాగిత గ్రామం. వైకాపా పాలనలో ఏడాదిన్నర కిందట బోరు వేశారు. ఈ మధ్య కాలంలో విద్యుత్తు సరఫరా ఇచ్చారు. గ్రామంలో సుమారు 12 బోర్లు వేయగా, ఇందులో ఇటీవల నలుగురికి మోటార్లు ఇచ్చారు. ఇందులో ఆయనకు రాలేదు. దీంతో సొంతంగా మోటారు తెచ్చి వేసుకుని వాడుతున్నారు. ఉచిత మోటార్లు ఎప్పుడు వస్తాయో తెలియడంలేదంటున్నారు వీరబాబు.

జలకళ కింద ఉమ్మడి జిల్లాలో 14,994 మంది దరఖాస్తు చేశారు. వాటన్నింటిని పరిశీలించి కేవలం 1,654 రైతులకే మొదట బోర్లు తీయడానికి అనుమతి ఇచ్చారు. అందులో కూడా ఈ అయిదేళ్లలో 397 చోట్ల మాత్రమే బోర్లు తవ్వారు. మిగతా దరఖాస్తులన్నీ బుట్టదాఖలు చేశారు.

బోర్లు తీసే రిగ్గు గుత్తేదారులకు ప్రభుత్వం రూ. కోట్లలో బకాయిలు పెట్టేసింది. వారంతా బిల్లులిచ్చిన తర్వాతే బోర్లు తీస్తామని ఆగిపోయారు. బోర్లు తీసిన రైతులకు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదు.. కనెక్షన్‌ ఇచ్చినా పంప్‌సెట్లు అందించలేదు. ఉమ్మడి జిల్లాలో ఒక్క రైతుకు కూడా చుక్కనీటిని అందించకుండా ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేశారు.

ఆనాటి జల‘సిరులు’..

తెదేపా ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్‌ జలసిరి పథకంలో బోరు తీసి, మోటారు, సోలార్‌ ప్యానల్‌ అమర్చడానికి రూ. 6 లక్షలు ఖర్చయ్యేది. అందులో రైతుల వాటాగా ఎస్సీ, ఎస్టీల నుంచి కేవలం రూ. 6 వేలు వసూలు చేశారు. ఇతర సామాజిక వర్గాల రైతుల నుంచి రూ.49 వేలు తీసుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే రాయితీగా సమకూర్చేది. ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 1,076 మంది రైతులు లబ్ధిపొందారు. జగన్‌ సర్కారు మొదట్లో అన్నీ ఉచితమని, తీరా రిగ్గులు వేసిన తర్వాత విద్యుత్తు కనెక్షన్‌ డబ్బులు రైతులే చెల్లించాలంటూ మాటమార్చేసింది. చివరకు అందరికీ అన్యాయం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు