logo

విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!

అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి.

Published : 17 May 2024 02:14 IST

‘అదానీ గంగవరం పోర్టు’లోనే బొగ్గు నిల్వలు

ఈనాడు-విశాఖపట్నం: అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. న్యాయస్థానం ఆదేశాలిచ్చి 13 రోజులైనా జిల్లా యంత్రాంగం కనీస చర్చల దిశగా అడుగులు వేయలేదు. అయితే..గురువారం చర్చలు కొలిక్కి వచ్చినా ఇన్నాళ్లు ఉక్కును చుట్టుముట్టిన కష్టాలు వర్ణణాతీతం.


అదానీ చేతుల్లోకి వెళ్లడంతోనే అసలు చిక్కు: జగన్‌ అధికారంలోకి రాగానే గంగవరం పోర్టులో రాష్ట్ర వాటా 10.5%ను కారుచౌకగా రూ.600 కోట్లకు అదానీకి కట్టబెట్టారు. అప్పటి నుంచి విశాఖ ఉక్కుకు కష్టాలు మొదలయ్యాయి. హ్యాండ్లింగ్‌ ఛార్జీలు టన్నుకు రూ.275 ఉండగా, రూ.350కు పెంచేసి, ఎప్పటికప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్లాంటుకు ప్రత్యేకంగా ఉన్న బెర్త్‌ను రద్దు చేశారు. గంగవరం పోర్టుకు భూములిచ్చిన దిబ్బపాలెం, గంగవరం గ్రామాల నిర్వాసితులు అదానీ వచ్చాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య సౌకర్యాలు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మృతులకు పరిహారం పెంపు, నెల జీతం పెంచాలంటూ గతేడాది ఆగస్టులో సమ్మె చేపట్టారు. ఆ సమయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కలెక్టర్‌ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఆరునెలల్లో సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. అవి అమలు కాకపోవడంతో ఎన్నికల కోడ్‌ వచ్చాక ఏప్రిల్‌ 12న నిర్వాసిత కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. అప్పటికే విశాఖ ఉక్కుకు చెందిన 2.20లక్షల టన్నుల బొగ్గు, 80వేల టన్నుల లైమ్‌స్టోన్‌ గంగవరం పోర్టు యార్డుల్లో ఉంది.


గాజువాక, న్యూస్‌టుడే: అదానీ గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు చేపట్టిన నిరసన గురువారం రాత్రితో ముగిసింది. కనీస వేతనాలు పెంచాలని, వీఆర్‌ఎస్‌ కింద రూ.35 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండు చేస్తూ నెల రోజులకు పైగా కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పోర్టు నిర్వాసిత కార్మికలతో పాటు వివిధ విభాగాల ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడంతో పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. సుమారు 500 మంది ఆర్‌ అండ్‌ ఆర్‌ ఎంప్లాయిస్‌ (రీహేబ్లిటేషన్‌, రీ సెటిల్‌మెంటు- నిర్వాసిత కార్మికులు)ఆందోళనలు చేపట్టగా జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, సీపీ రవిశంకర్‌ స్పందించి... పోర్టు యాజమాన్యం, కార్మికులతో దఫదఫాలుగా చర్చలు కొనసాగించారు. చివరిగా గురువారం రాత్రి సీపీ రవిశంకర్‌, జోన్‌-2 డీసీపీ సత్తిబాబు, హార్బర్‌ ఏసీపీ మోజెస్‌పాల్‌, న్యూపోర్టు సీఐ దాలిబాబు ఆధ్వర్యంలో నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో పోర్టు సీఈఓ ఆనంద్‌ మాలిక్‌, హెచ్‌ఓడీ సీఎస్‌ రాజు, కార్పొరేట్ ఎఫైర్స్‌ అధికారి అంజిరెడ్డి, బాపూజీ కలిసి కార్మికులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఒక్కో కార్మికుడికి రూ.27 లక్షలు చెల్లించడానికి యాజమాన్యం ముందుకొచ్చింది. ఆ ఒప్పందాన్ని రెండు నెలల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఇరుపక్షాలు అంగీకార పత్రాలపై సంతకాలు చేశాయి. నిరసన విరమించి అర్ధరాత్రి నుంచి కార్మికులు విధుల్లోకి చేరతారని సీఐ దాలిబాబు తెలిపారు.


రూ.2 వేల కోట్ల ఆదాయం కోల్పోయినట్టే..: రోజుకు 15వేల టన్నుల ఉత్పత్తి చేసే ప్లాంటులో కీలకమైన హార్డ్‌ కోల్‌ లేక.. ఉత్పత్తి..4వేల టన్నులకు పడిపోయింది. రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు, నాలుగు రోలింగ్‌ మిల్స్‌ నిలిచిపోయాయి. 70 శాతం యంత్ర సామగ్రి నిరుపయోగంగా ఉన్నాయి. ఉక్కు చరిత్రలోలేని విధంగా కోక్‌ ఓవెన్‌ ఉత్పత్తి దారుణంగా  పడిపోయింది. 33 రోజులుగా నెలకొన్న పరిస్థితులతో స్టీలు ప్లాంటు దాదాపు రూ.2వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.దీనికి ఎవరు బాధ్యులని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. త్వరగా చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాల్సిన యాజమాన్యం తమ వల్ల నష్టం కల్గలేదంటూ ‘ఫోర్స్‌ మెజ్యూర్‌’ నోటీసులు ప్లాంటుకు ఇచ్చి ఇన్నాళ్లు చేతులు  దులిపేసుకుంది. లా అండ్‌ ఆర్డర్‌ అదుపులో లేదన్న కారణంతోనే ముడి సరుకు ఇవ్వలేకపోయినట్లు పేర్కొంది. మరోవైపు స్టీలు యాజమాన్యం సైతం కలెక్టర్‌, సీపీకి పలుసార్లు విజ్ఞప్తులు చేసింది.ఎట్టకేలకు గురువారం నాటికి చర్చలు కొలిక్కివచ్చాయి.


జీతాలివ్వలేక.. విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక: స్టీలు ప్లాంటులో ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెలా రూ.84 కోట్లు జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. గత నెలలోనూ ఆర్థిక కష్టాలతో రెండు దఫాలుగా జీతాలు చెల్లించారు. ఈ నెల 16వ తేదీ వచ్చినా జీతాలు అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏప్రిల్‌ నాటికి ఈపీడీసీఎల్‌కు రూ.103 కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒత్తిడి తట్టుకోలేక అప్పులు తెచ్చి రూ.35 కోట్లు చెల్లించగా, మిగిలిన రూ.68కోట్లు వెంటనే చెల్లించకపోతే సరఫరా నిలిపి వేస్తామంటూ ఈపీడీసీఎల్‌ నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని