logo

కోతల జోగి.. చేతలు ఏవీ..?

దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు.

Published : 20 Apr 2024 05:54 IST

ఒక్క హామీ నెరవేర్చితే ఒట్టు

బంటుమిల్లిలో అసంపూర్తిగా నిలిచి పోయిన డ్రైనేజి నిర్మాణం

నాడు

అధికారంలోకి రాగానే బంటుమిల్లి మండలంలోని ప్రధాన గ్రామాలతో పాటు అన్ని ప్రాంతాలలో డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు మురుగు నీటి సమస్య లేకుండా చేస్తా. బంటుమిల్లి మండలాన్ని అభివృద్ధి చేస్తా

 మంత్రి జోగి రమేష్‌ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ

నేడు

అయిదేళ్లు అధికారంలో ఉన్నా కనీసం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఇదే కాదు మండలంలో కనీసం ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు.


బంటుమిల్లి, న్యూస్‌టుడే

దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. ఏటా ఎన్నికల హామీలకే ఇది పరిమితమవుతోంది. బంటుమిల్లితో పాటు మిగిలిన 20 పంచాయతీలలో ఎక్కడా సరైన మురుగు పారుదల వ్యవస్థ లేదు. ఉన్న వాటిల్లోనూ సకాలంలో పూడిక తీయించడం లేదు. ఇళ్లల్లో వాడుకున్న నీరు బయటకు వెళ్లే దారిలేక చాలామంది తమ ఇంటి ఆవరణలోనే గుంటలు తవ్వుకుని అందులోకి మళ్లించుకుంటున్నారు. మరికొందరు రోడ్లపైకి వదిలేస్తున్నారు. దీనితో ఆయా ప్రాంతాలు ఎప్పుడూ అపరిశుభ్రంగా దర్శమిస్తున్నాయి.

దారి మళ్లించిన పంచాయతీ నిధులు.. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంతో చేతిలో పైసా లేకపోవడంతో  చిన్నచిన్న పనులను సైతం సర్పంచులు, కార్యదర్శులు చేపట్టలేని దుస్థితి నెలకొంది. స్థానికులు తమ సమస్యలను పదే పదే పాలకులకు విన్నవించినా చూస్తాం.. చేస్తామంటూ వాయిదా వేస్తూ వచ్చారు తప్ప వాటి పరిష్కారంపై దృష్టి పెట్టలేదు.


పాలకులకు చెప్పినా..

మా గ్రామం పెదతుమ్మిడి. ఇళ్లల్లోని వాడుకపు నీరు, మురుగు నీరు బయటకు వెళ్లడానికి సీసీ డ్రైనేజీలు లేవు. ఉన్న మురుగు బోదెలలో కూడా పూడికలు తీయించకపోవడంతో అవి పూర్తిగా పూడుకుపోయాయి. వర్షాకాలం వస్తే చాలు వర్షపు నీటితో మురుగు నీరు కలిసి రోడ్లపైకి చేరుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పాలకులు ఆ తరువాత అసలు పట్టించుకోవడం లేదు.

 బొల్లా వసంత కుమార్‌, పెదతుమ్మిడి


సమస్యలు అలాగే ఉన్నాయి

పంచాయతీలకు వచ్చే ఆదాయానికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గండికొట్టడంతో పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో దీర్ఘకాలంగా నెలకొన సమస్యలు గ్రామాలలో అలాగే ఉండిపోతున్నాయి. అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని నేరవేర్చకుండా వదిలేసే నాయకులకు ఓటు వేయకూడదు. మా అర్తమూరు గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలం దారులన్నీ అధ్వానంగా మారుతున్నాయి.

జోగి వెంకట రవీంద్ర, అర్తమూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని