ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు

జగన్‌ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 03 May 2024 08:35 IST

సీపీఎస్‌ ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశాల ఉద్యమాన్ని అణచివేశారు
జగన్‌ పాలనలో పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ సైతం రివర్సే
‘ఈనాడు’తో అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు చేసి, పాత పెన్షన్‌ అమలు చేయాలని, జీతాలు పెంచాలని అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, సమగ్రశిక్ష అభియాన్‌ ఉద్యోగుల ఉద్యమాలను దౌర్జన్యంగా అణచి వేశారని, కొంతమంది ఉద్యోగులపై నేరస్తుల మాదిరిగా బైండోవర్‌ కేసులు పెట్టారని వెల్లడించారు. ఒక పక్క అణచివేతలు, కేసులతో భయపెడుతూ.. మరోపక్క బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులు, పెన్షనర్లను హింసించారని పేర్కొన్నారు. ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం ఏప్రిల్‌ నెల జీతం, పెన్షన్లు ఒకటో తేదీనే వేశారని, ఉద్యోగులను మభ్యపెట్టేందుకు ఇది కొత్త ఎత్తుగడ అని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.

జీతాలు, పెన్షన్లలోనూ రివర్సే..

‘జగన్‌ పాలనలో ప్రతినెలా ఒకటో తేదీన జీతం, పెన్షన్‌ రాక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 15వ తేదీ వరకు ఎదురుచూస్తూ జీతాలు, పెన్షన్లు వస్తే చాలు అనే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసమే ఎదురుచూడాల్సిన పరిస్థితిని కల్పించింది. భారత దేశ చరిత్రలో మొదటిసారి మధ్యంతర భృతి(ఐఆర్‌) కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇచ్చారు. ఐఆర్‌ 27% ఇస్తే.. ఫిట్‌మెంట్‌ 23% ఇచ్చారు. దీంతో ఉద్యోగుల జీతాలు తగ్గాయి. ఇక్కడా రివర్స్‌ పాటించారు.

  • 2021 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబరు వరకు 21 నెలలు పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. 2018 జులై నుంచి 2024 మార్చి 31 వరకు రావాల్సిన డీఏ బకాయిలు ఇవ్వలేదు. ఒక్కో ఉద్యోగికి 192 నెలల బకాయిలు రావాలి. రాష్ట్రంలో 10వేల బేసిక్‌ పెన్షన్‌ ఉన్న వారికి రూ.70వేలు, బేసిక్‌ 20వేలు ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు రూ. 1.40 లక్షల చొప్పున బకాయిలు ఉన్నాయి.
  • పీఆర్సీలో 70ఏళ్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌ తెదేపా హయాంలో 10 శాతం ఉంటే దీన్ని 7శాతానికి తగ్గించారు. 75-80 ఏళ్ల మధ్య 15 శాతం ఉండే అదనపు పెన్షన్‌ను 12శాతానికి తగ్గించారు. 2022 జనవరి నుంచి 27 నెలల్లో 81% పెన్షన్‌ను విశ్రాంత ఉద్యోగులు నష్టపోయారు. ఇది రివర్స్‌ పెన్షన్‌ కాకపోతే మరేమిటి?
  • హెచ్‌ఆర్‌ఏ తగ్గించేశారు. సచివాలయ ఉద్యోగులకు 30% ఉండే హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి, జిల్లా కేంద్రాల్లో 20% నుంచి 16 శాతానికి తగ్గించారు.

మెడికల్‌ బిల్లులు ఇవ్వలేదు..

మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు నాలుగున్నరేళ్లపాటు చెల్లించలేదు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో సరైన వైద్య సేవలు అందని దుస్థితి ఏర్పడింది. డబ్బులు పెట్టి చికిత్సలు పొందితే ఆ బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఉన్నా ఉపయోగం లేకుండాపోయింది.

  • జిల్లాపరిషత్తు పరిధిలోని ఉపాధ్యాయులు కొందరు కొవిడ్‌తో చనిపోతే వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు చేయలేదు.
  • పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు మూడేళ్లుగా ఆర్జిత సెలవుల డబ్బులు ఇవ్వడం లేదు.

పీఆర్సీ నివేదికనే దాచేశారు..

పీఆర్సీ కమిషన్‌ ఇచ్చిన నివేదికనే ఈ ప్రభుత్వం బయటపెట్టలేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేసి, నివేదిక ఇచ్చారు. దాని ప్రకారమే పీఆర్సీ అమలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

  • 12వ పీఆర్సీ కమిషన్‌ వేశారు. ఈ కమిషన్‌ ఇంతవరకు పని ప్రారంభించలేదు. పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నా ఐఆర్‌ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ కమిషన్‌ నివేదిక ఎప్పటికి ఇస్తుందో తెలియని దుస్థితి.
  • ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎక్కడా పెట్టలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు మళ్లీ అవే కష్టాలు వస్తాయి.
  • పెన్షనర్ల కోసం జిల్లాకో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వైకాపా మ్యానిఫెస్టోలో చెప్పారే తప్ప ఎక్కడా క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయలేదు. చివరికి మ్యానిఫెస్టోలోనూ అబద్ధాలు చెప్పారు.

గ్యారంటీ లేని పెన్షన్‌..

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ అమలు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయకపోగా.. కొత్తగా గ్యారంటీ పెన్షన్‌ పథకం(జీపీఎస్‌) తెచ్చారు. ఈ చట్టంలోని క్లాజ్‌-6(5)లో షేర్‌ మార్కెట్‌లో వచ్చిన ఒడిదొడుకులపై పెన్షన్‌ ఇస్తామనే నిబంధన పెట్టారు. ఇది సీపీఎస్‌ కంటే అన్యాయమైంది. సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే వాటాను 14%కు పెంచాలని చెప్పినా దీన్ని అమలు చేయడం లేదు. కేవలం 10%మాత్రమే ఇస్తోంది. 4% మిగిల్చుకుంటూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని