‘భీమ్లీ’ ఖల్‌ నాయక్‌!

‘‘నాయక్‌ నహీ.. ఖల్‌ నాయక్‌ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్‌? యూనిఫామ్‌ తీసేయ్‌..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. 

Published : 03 May 2024 05:47 IST

పోలీసులు, అధికారులు, నేతలపై రుసరుస
వారి కష్టాలు ఆ శ్రీనివాసుడికే ఎరుక
అక్రమాలు, భూదందాలు ఆయన ‘అవ’ లక్షణాలు
తన వంతుగా కొండలు, ఇసుక, మట్టి భోజ్యం
విశాఖ సముద్ర తీరాన అవినీతి తిమింగలం
ఈనాడు, విశాఖపట్నం, అమరావతి

‘‘నాయక్‌ నహీ.. ఖల్‌ నాయక్‌ మై హూ..!’’
అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు.
‘‘ఏం చేస్తున్నావ్‌? యూనిఫామ్‌ తీసేయ్‌..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు.
అధికారులైనా... ఎవరైనా సరే.. ‘‘అరేయ్‌.. ఒరేయ్‌ అంటూ..’’ సంబోధిస్తారు
ఆయన ముందు నిలబడాలంటే ఎవరికైనా ఇబ్బందే!

వైకాపా సర్కారు అధికారం చేపట్టిన మొదట్లో ఆయన రాష్ట్రస్థాయిలో కీలకస్థానంలో ఉన్నారు. ఓ జిల్లాకు పార్టీ సారథిగానూ కొనసాగారు. ఆయన పేరు, ప్రఖ్యాతలు ఈ సముద్ర తీరప్రాంతానికే పరిమితం కాలేదు. ఇంతులతో సాగించిన ‘సంభాషణల చాతుర్యం’ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. సొంత పార్టీ మహిళా అధ్యక్షులు, నేతలతో ఆయన వివాదాలు జోకులుగా పేలుతూ సోషల్‌ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. విశాఖలోని ఎంతో సుందరమైన బీచ్‌కు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అంతటి అందమైన తీరప్రాంతం అంతుచూసే దాకా వదిలి పెట్టలేదు ఈ ‘భీమ్లీ’ నాయక్‌! పచ్చనైన కొండలను గుండు చేయించారు. నదీ గర్భంలో ఇసుకను కొల్లగొట్టారు. ప్రభుత్వ శాఖల్లోని ‘పొరుగు’ పోస్టులకు బేరం పెట్టారు. ఓ ఫార్మా కంపెనీలో కాసులు దండుకోవడాన్నే ప్రధాన పనిగా పెట్టుకున్నారు. తనకు అనుకూలంగా లేకపోతే ప్రతిపక్ష నేతలే కాదు.. సొంత పార్టీ నాయకులపైనా ప్రతాపం చూపారు. అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. సంపదను ‘శ్రీ’నివాసంగా మార్చుకునే క్రమంలో ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. ఈయన అక్రమాలకు తన బంధుగణం వంత పాడుతుంది. ఆ బంధుగణమే ఈ నేత అవినీతి తంతుకు నేతృత్వం వహిస్తుంటుంది.


గెడ్డలు పూడ్చి.. భూములు ఆక్రమించి

ఈ నాయకుడి ప్రోద్బలంతోనే తన సోదరులు, బంధువులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. 2015లో అడవివరంలో దేవస్థానానికి చెందిన సుమారు 13 ఎకరాల భూమిని 33 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. లీజుదారుడు ఈ నాయకుడికి స్వయానా సోదరుడు. ఆ భూమిలో ఓ స్కూలు నిర్మించిన లీజుదారుడు.. ఆ పక్కనే ఉన్న 7-8 ఎకరాల భూమిని సైతం ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. స్కూలుకు రహదారి వేయడం కోసం రామన్నచెరువుకు వెళ్లే గెడ్డను పూడ్చేశారు. దీని పూడ్చివేతను వ్యతిరేకిస్తూ స్థానికులు ధర్నాలు సైతం చేశారు. దేవస్థానానికి డబ్బులు చెల్లించకపోవడంతో ఇటీవల లీజుదారుడికి నోటీసులు జారీ చేశారు.


నోటి  దురుసెక్కువ..

ప్రతిపక్ష నేతలే కాదు.. ఆయన ధాటికి సొంత పార్టీ(వైకాపా) ద్వితీయశ్రేణి నాయకులు కూడా విలవిల్లాడుతున్నారు. నోటిదురుసు ఎక్కువ అని అధికారవర్గాల్లో ఆయనకు పేరు ఉంది.   ‘‘నీకు ఎవడు ఉద్యోగం ఇచ్చాడు’’ అంటూ అధికారులను కించపరుస్తూ జనాల మధ్యనే అవమానాలకు గురిచేస్తారు. కలెక్టరు సమక్షంలోనే ఓ ఎస్సైని పట్టుకుని ‘ఏం డ్యూటీ చేస్తావయ్యా’’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఉత్సవాల్లో నృత్యాలకు అనుమతివ్వలేదని ఓ సీఐని బదిలీ చేయించారు. మత్స్యశాఖ అధికారిణి గురించి ఈ నాయకుడు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఒక ఎంపీడీవోను కూడా ఇటీవల తిడుతూ విరుచుకుపడటం వివాదాస్పదమైంది. అధికారులతోపాటు పార్టీ మండల స్థాయి నాయకులు కూడా ఈ నేత వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారు. అందరూ ఉండగానే ‘అరేయ్‌.. ఒరేయ్‌’ అని చులకనగా మాట్లాడతారని మండల  స్థాయి నేతలు వాపోతున్నారు.


ఒక్కో పోస్టుకు  రూ.లక్షల్లో వసూలు

నియోజకవర్గంలోని ఓ భారీ ఫార్మా కంపెనీని గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆ కంపెనీ వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటం ఆయనకు బాగానే కలిసొస్తోంది! ‘వ్యర్థాలు సముద్రంలో కలిస్తే జలచరాలు ఏమవ్వాలి..? కాలుష్యం పెరిగిపోయి మానవాళి ఆరోగ్యం దెబ్బతినదూ..?’ అని బెదిరిస్తూ ఫార్మా కంపెనీని మొదట ఇరకాటంలో పడేస్తారు. తర్వాత నిబంధనల ‘వల’ను తెరపైకి తీసుకొచ్చి ఆ కంపెనీ నుంచి డబ్బు గుంజుతున్నారు. అంతేకాదు.. తాను సూచించిన వారికే కొలువులు ఇవ్వాలంటూ ఆ కంపెనీకి షరతు విధించారు. కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తూ నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెగబడుతున్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ షిఫ్టు ఆపరేటర్ల్ల పోస్టు కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5-7 లక్షల వరకు వసూలు చేశారు. కొత్త అంగన్‌వాడీ పోస్టులకు సైతం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసి జేబులు నింపుకొన్నారు. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పోస్టులనూ వదలకుండా అమ్ముకొన్నారు!


కొండలు  ‘మట్టి’ కొట్టుకుపోయాయి

ఈ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఎర్రమట్టి తవ్వకాలు దర్జాగా సాగిపోతుంటాయి. ఆయన అనుచరులు తొలుత గనుల శాఖ నుంచి ఆయా గ్రామాల్లోని వైకాపా నేతల పేరుతో నిర్ణీత ప్రాంతాల్లో తవ్వకాలకు అనుమతులు పొందుతారు. తర్వాత అనుమతుల హద్దులను దాటేసి అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తారు. భీమిలి ప్రాంతంలోని కాపులుప్పాడ, కె.నగరపాలెం, దాకమర్రి, కొత్తవలస, నేర్లవలస, అమనాం, చిప్పాడ కొండలు ఆ కీలక నేత ధాటికి ‘మట్టి’ కొట్టుకుపోయాయి. ప్రైవేటు లే-అవుట్లలోని లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి రాత్రిళ్లు యంత్రాలతో కొండలకు కొండలనే పిండిచేస్తున్నారు. ఆనందపురం పరిధిలోని 52 కొండల్లో ప్రతి రోజూ ఎర్రమట్టి యథేచ్ఛగా తరలిపోతోంది. పద్మనాభం పరిధిలో బాంధేవీపురం పల్లికొండ ప్రాంతంలో నిత్యం గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. కృష్ణాపురం, పాండ్రంగి పంచాయతీల్లో విస్తరించి ఉన్న సూది కొండలోనూ అడ్డగోలు తవ్వకాలు సాగిస్తున్నారు. నేరెళ్లవలస శివారులో మెట్ట నుంచి రాత్రి సమయాల్లో మట్టి తవ్వి తరలిస్తున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.6-8 వేలు, లారీకి రూ.25-50 వేల వరకు వసూలు చేస్తున్నారు. అన్నవరం సముద్ర తీరం నుంచి నల్ల ఇసుక కాకినాడ, ఒడిశాకు ఆయన అండదండలతోనే ఎగుమతి  అవుతోంది.


భూ వివాదాల్లో   తలదూర్చి..

జగనన్న స్మార్ట్‌సిటీ పేరుతో పేదలకు సెంటు స్థలం ఇచ్చేందుకు భీమిలి ప్రాంతంలో 135 ఎకరాలు గుర్తించారు. ఇందులో నిడిగట్టు, రామజోగి అగ్రహారం, నేరెళ్లవలస, కాపులుప్పాడ పరిధిలో డి-పట్టా కలిగిన రైతుల నుంచి ఈ నేత బలవంతంగా భూములు లాక్కొన్నారు. ఆ ప్రాంతంలో ఎకరాకు రూ.10 లక్షల చొప్పున సుమారు 40 ఎకరాలు తన బంధువు పేరుతో తీసుకున్నట్లు సమాచారం. భూ సేకరణ నేపథ్యంలో వీఎంఆర్డీఏ ఎకరాకు 900 చ.అ. చొప్పున కేటాయిస్తుంది. ఇలా ఆ నాయకుడు 36 వేల చ.అ. భూమిని దక్కించుకుని అందులో వైద్య కళాశాల నిర్మించాలని పావులు కదిపారు. నేరేళ్ల వలసలోని 30 ఏళ్లనాటి ప్రైవేటు వెంచర్లలో నెలకొన్న భూ వివాదాల్లో తలదూర్చి పంచాయితీలు చేస్తున్నారు. ఆ వివాదాలను పరిష్కరిస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. భీమిలి ప్రాంతంలో ఎక్కడ లే-అవుట్‌ వేసినా భూమి ధరను బట్టి ఆ నేతకు కమీషన్‌ ఇవ్వాల్సిందే. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ ఈయన తరఫున వసూళ్ల పర్వం సాగుతోంది. వరుసకు సోదరుడైన వ్యక్తి ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తుంటారు.


ఆయన వేధిస్తే పార్టీ మారతారంతే..!

తన నియోజకవర్గంలోని రాజకీయ వ్యవహారాల పర్యవేక్షణ, సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్షుల సమన్వయ బాధ్యతను వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తికి ఇచ్చారు. ఆయనను తెరపై ఉంచి నియోజకవర్గంలో తెదేపా నాయకుల బలహీనతలపై ఆరా తీయడం, వారినే లక్ష్యంగా చేసుకుని వేధించి, భయపెట్టి పార్టీని మార్పిస్తారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లా పశు సంవర్థక విభాగానికి సంబంధించిన కీలక పోస్టులో ఉన్న నాయకుడికి పార్టీ మారే పరిస్థితి కల్పించారు. భీమిలి మున్సిపాలిటీలోనూ ఓ మహిళా నాయకురాలికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అధికార పార్టీ తీరుపై ఒక మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఈ ప్రజాప్రతినిధి.. ఆ మాజీ ఎమ్మెల్యే వద్ద ఉన్న భూములను లాక్కునేందుకు ప్రయత్నించారు. పార్టీ పుట్టినప్పటి నుంచి తెదేపాలోనే ఉండి, గ్రంథాలయ సంస్థలో కీలకపాత్ర పోషించిన ఓ నేత.. వీరి వేధింపులను తాళలేక ఆ పార్టీని వదిలేయాల్సి వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని