logo

ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్‌) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్‌.ఇబ్రహీం బేతవోలులోని ఎస్‌జీవీఎస్‌జీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.

Published : 17 May 2024 04:37 IST

చేయి విరిగిన షేక్‌ ఇబ్రహీం

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్‌) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్‌.ఇబ్రహీం బేతవోలులోని ఎస్‌జీవీఎస్‌జీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా అతనికి అవనిగడ్డలో పీవోగా నియమించారు. ఎన్నికల విధులు పూర్తి చేసుకున్న తర్వాత మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో సామగ్రి మొత్తం అప్పగించి అధికారులు చెప్పిన తర్వాతే బస్సులో మంగళవారం తెల్లవారుజామున గుడివాడ చేరుకున్నారు. ఇంతలోగా మీరు అప్పగించిన సామగ్రిలో ఒక కవర్‌ కనిపించడం లేదని.. వెంటనే రావాలని ఎన్నికల సామగ్రి స్వీకరణ సిబ్బంది నుంచి ఇబ్రహీంకు ఫోన్‌ వచ్చింది. దీంతో కంగారుగా ఇబ్రహీం తన ద్విచక్రవాహనంపై తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో వెళ్లగా సామగ్రి మొత్తం అందినట్లు ఆర్వో చెప్పారని, పొరబడి ఫోన్‌ చేశామని సిబ్బంది స్పష్టం చేశారు. దేవుడా కనికరించావనుకొని అప్పటికే మూడు రోజులపాటు విశ్రాంతి లేకుండా ఇంటికి బయలుదేరిన ఇబ్రహీం గుడివాడ వస్తుండగా గుడ్లవల్లేరు మండలం వేమవరం వద్ద అతని వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతని కుడి మోచేయి-భుజానికి మధ్యలో విరిగిపోయి ముక్కలైంది. వెంటనే స్థానికులు అతని భార్యకు ఫోన్‌ చేయగా బంధువులతోపాటు ఆమె వచ్చి గుడివాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇబ్రహీం చేతికి వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్లేట్లు వేశారు. సుమారు రూ.లక్ష ఖర్చయ్యింది. శిరస్త్రాణం ధరించడం వల్లే నా భర్త బతికారని.. కవరు దొరికిన వెంటనే ఎన్నికల సిబ్బంది ఫోన్‌ చేసుంటే ప్రమాదం జరిగేది కాదని ఇబ్రహీం భార్య జరీనా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అవనిగడ్డ ఎన్నికల అధికారి జి.బాలసుబ్రమణ్యంకు ఇబ్రహీం బంధువులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో ప్రమాదానికి గురైనందున నిబంధనల ప్రకారం షేక్‌ ఇబ్రహీంకు నష్ట పరిహారం అందించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని