లోకం విడిచి వెళ్తున్నా.. అనాథలా అంత్యక్రియలు చేయండి
విజయవాడ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి వ్యక్తి బలవన్మరణం
పెనమలూరు, న్యూస్‌టుడే : పోలీస్ కమిషనర్ గారూ.. మీ పాదాలకు నమస్కారం చేస్తా.. నా భార్య పిల్లలను దిక్కులేని వారిని చేసి వెళ్లిపోతున్నా.. తీర్చలేని అప్పులు, భారంగా మారిన వడ్డీలు నా కుటుంబాన్ని చిదిమేశాయి. వీటిని తట్టుకోలేక ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా.. ఇక నుంచి నా భార్యకు వడ్డీలు కట్టే బాధ నుంచి విముక్తి కలిగించండి. నా దేహాన్ని బంధువులెవరికీ అప్పగించొద్దు. అనాథ శవం దొరికితే ఎలా దహనం చేస్తారో అలాగే నన్నూ దహనం చేయండి. ఇదే నా చివరి కోరికంటూ ఓ వ్యక్తి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనమలూరు మండలం పెదపులిపాక వద్ద కరకట్టపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉద్దంటి సాయిబాబు(45) విజయవాడ పటమటలంక పుట్ట రోడ్డులో నివసిస్తుంటాడు. అతను అక్కడే ఓ ప్రైవేటు పాఠశాలలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అతనికి కొంతకాలంగా మానసికస్థితి బాగుండటం లేదు. తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒకటి రెండ్రోజుల తర్వాత తిరిగి వస్తుండేవాడు. ఈనెల 12న బీసెంట్ రోడ్డులోని తన స్నేహితుడి వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో తెలిపి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో శనివారం సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఆదివారం ఉదయం పెదపులిపాక వద్ద కరకట్టపై చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతోందని అతడి భార్య కృష్ణవేణికి తెలియడంతో ఆమె వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా.. అది తన భర్త సాయిబాబుదేనని గుర్తించింది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. మృతుడు సాయిబాబు రాసినట్టుగా అతడి చొక్కా జేబులో నగర పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖ లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.