logo

జైల్లో పరిచయంతో వరుస దొంగతనాలు

భవానీపురం ప్రాంతంలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీపీ కె.బాబూరావు

Published : 23 Jan 2022 03:39 IST

పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి, బంగారు వస్తువులు

భవానీపురం, న్యూస్‌టుడే : భవానీపురం ప్రాంతంలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు. శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీపీ కె.బాబూరావు వివరాలు వెల్లడించారు. కాకినాడ మాధవనగర్‌కు చెందిన పిన్నింటి రమేష్‌ బాబు  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జైలులో శిక్ష అనుభవించాడు. ఆ సమయంలో భరత్‌ చౌహాన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. మధ్యప్రదేశ్‌ దార్‌ జిల్లాకు చెందిన భరత్‌ చౌహాన్‌ బంధువైన సురేష్‌తో కలిసి 2020, 2021లో కాకినాడలో ఎనిమిది దొంగతనాలు చేశారు. దొంగిలించిన సొత్తుతో మధ్యప్రదేశ్‌ వెళ్లిపోతుండేవారు. తిరిగి గత ఏడాది డిసెంబరులో విజయవాడ భవానీపురం వచ్చి ఐదు దొంగతనాలకు పాల్పడ్డారు.
ముగ్గురు కలిసి గవర్నర్‌పేటలోని ఒక లాడ్జిలో అద్దెకు దిగారు. తొలుత హెచ్‌బీకాలనీలో ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగిలించారు. దానిపై తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించే వారు. దుస్తులు విక్రయిస్తున్నట్లుగా నటించి, తాళం వేసిన ఇళ్లను గమనించేవారు. రాత్రి సమయంలో ఆయా ఇళ్లకు వెళ్లి, తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసేవారు. భవానీపురం రైతుబజారు సమీపంలోని ఒక ఇంట్లో, హెచ్‌ఐజీ-100లో బంగారం, వెండి వస్తువులు, హెచ్‌ఐజీ-249లో బంగారం బిస్కెట్లు దొంగిలించారు. బాజీబాబా మందిరం రోడ్డులోని ఆ ఇంట్లో చోరీకి యత్నించారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ అమర్చి ఉండటంతో.. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లింది. పోలీసులు అక్కడకు చేరుకోగానే.. దొంగలు పారిపోయారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు, ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఆ వేలిముద్రలు కాకినాడలో దొంగతనాలకు పాల్పడిన వారితో సరిపోలాయి. 22న గొల్లపూడి వైజంక్షన్‌ వద్ద ద్విచక్రవాహనంపై భరత్‌ చౌహాన్‌, పిన్నింటి రమేష్‌బాబులు వస్తుండగా పోలీసులు ఆపారు. విచారించడంతో దొంగతనాల విషయం వెలుగుచూసింది.

కాకినాడకు చెందిన పిన్నింటి రమేష్‌బాబు మొదట దుస్తుల వ్యాపారం చేసేవాడు. వ్యాపార నిమిత్తం ఇండోర్‌కు వెళ్లి వస్తుండేవాడు. అక్కడ భన్వర్‌సింగ్‌తో పరిచయం ఏర్పడింది. భన్వర్‌సింగ్‌ 2019లో మూడు కేజీల బంగారాన్ని రమేష్‌బాబుకు ఇచ్చి, తర్వాత తీసుకుంటానని చెప్పాడు. భన్వర్‌సింగ్‌కు అతడి సోదరుడికి మధ్య విభేదాలు ఉన్నాయి. భన్వర్‌సింగ్‌ సోదరుడి ఫిర్యాదు మేరకు ఇండోర్‌ పోలీసులు రమేష్‌బాబును అరెస్టు చేసి ఇండోర్‌ జైలుకు పంపారు. అక్కడ భరత్‌ చౌహాన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో భరత్‌చౌహాన్‌ను కాకినాడకు రప్పించాడు. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అతడితో ఎనిమిది దొంగతనాలు చేయించాడు. తర్వాత భవానీపురంలో దొంగతనాలు చేశారు. భరత్‌ చౌహాన్‌, సురేష్‌లు దొంగతనం చేస్తుంటే.. రమేష్‌బాబు బయట ఉంటూ.. పోలీసులు, ఎవరైనా వచ్చినా వారికి సమాచారం ఇచ్చేవాడు. దొంగిలించిన వస్తువులను ముళ్లపొదలు, నిర్మానుష్య ప్రదేశాల్లో దాచేవారు. భవానీపురంలో దొంగిలించిన బంగారాన్ని, కొన్ని వస్తువులను ఇబ్రహీంపట్నం సమీపంలో దాచారు. వాటిని తీసుకుని వస్తుండగా గొల్లపూడి వైజంక్షన్‌ వద్ద పట్టుపడ్డారు. సురేష్‌ దొరకాల్సి ఉంది. మిగిలిన సొత్తు అతడి వద్ద ఉంది. నిందితుల నుంచి 65 గ్రాముల బంగారం, 5.480 కేజీల వెండి, రూ.29,500 నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  నిందితులను అరెస్టు చేయటంలో కీలకపాత్ర పోషించిన అధికారులను నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని